DailyDose

హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతు-TNI నేటి నేర వార్తలు

హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతు-TNI నేటి నేర వార్తలు

కదిలే రైలులో ఫోన్ చోరి చేసే ప్రయత్నం

కదిలే రైళ్లలో దొంగతనాలు చేస్తూ కొందరు దొంగలు ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. రైలు కదులుతున్న సమయంలో కిటికీ బయట ఉండే దొంగ లోపల ఉన్న ప్రయాణికుడి మొబైల్ ఫోన్ చోరి చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు రైల్వే ప్రయాణాలు చేసే వారికి అరుదుగా కనబడుతూనే ఉంటాయి. తాజాగా బీహార్‌లోని బెసుగాయ్ ప్రాంతంలో ఆగి ఉన్న రైలులో చోరీ చేయడానికి వచ్చి చోరీకి పాల్పడగా ఒక ప్రయాణికుడు దొంగ చేతిని కిటికీ లోంచి గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో రైలు కదిలింది. దీంతో దొంగ కిటికీని గట్టిగా పట్టుకున్నారు. రైలు కింద పడిపోకుండా ప్రయాణికులు అతనిని పట్టుకుని కాపాడే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ స్టేషన్‌లో రైలు ఆగగానే ప్రయాణికులు దొంగని రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతు

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ లోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఎస్బిఐ కాలనీ దామోదరం సంజీవయ్య నగర్ లో హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతు అయింది. కనిపించకుండా పోయిన లక్ష్మీ (55) నాలాలో పడి గల్లంతు అయింది. ఇంటి వద్ద పగిలిన గాజులు కనిపించడంతో నాలాలో పడిపోయినట్లు కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేశారు.ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు వివాహం జరగడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు లక్ష్మి. ఇటీవల వర్షానికి ఉన్న ఇంటి గోడ కూలిపోవడంతో ప్రహరీ లేక ఇబ్బందులు పడుతోంది మహిళ. లక్ష్మి ఇంట్లో గ్యాస్ స్టవ్ పై వంట చేస్తూ బియ్యం.. సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టడం అక్కడే చెప్పులు ఉండడంతో నాలాలో పడిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. గాంధీనగర్ పోలీసులకు లక్ష్మీ కుమార్తె సునీత ఫిర్యాదు చేయగా.. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎల్బీ నగర్ ప్రేమ ఉన్మాది దాడి కేసు విచారణలో బిగ్‌ ట్విస్ట్‌

ఎల్బీ నగర్ ప్రేమ ఉన్మాది దాడి కేసు విచారణలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ప్రేమను నిరాకరించినందుకు ప్రియురాలి తమ్ముని చంపాడు శివకుమార్. రంగారెడ్డి జిల్లా నేరెళ్లచెరువు గ్రామానికి చెందిన శివకుమార్‌ , యువతి , యువతి తమ్ముడు ముగ్గురూ క్లాస్ మెట్స్. గతంలో నిందితుడి తండ్రిని హత్య చేసిన వ్యవహారం పైనా ఆరా తీస్తున్నారు పోలీసులు.మూడేళ్ల క్రితం తండ్రి గట్టిగా మందలించడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రినీ హత్య చేసినట్లు నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు శివకుమార్ నేర చర్రితపై విచారణ చేస్తున్నారు పోలీసులు. శివకుమార్ యువతి ఇంటికి వచ్చినప్పటి నుండి.. ఎక్కడెక్కడికి వెళ్ళాడు అని ఆరా తీస్తున్నారు ఎల్బీ నగర్ పోలీసులు. పోలీసుల విచారణలో తండ్రి హత్య గురించి నోరు విప్పలేదు నిందితుడు శివకుమార్. తన తండ్రి అనారోగ్యం తో చనిపోయాడు అని చెప్తున్నాడు నిందితుడు. శివకుమార్ గతం పై లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులు.. నిందితున్ని ఈ రోజు కోర్టులో హాజరు పరుచనున్నారు.

*  వివాహితపై వాలంటీర్ హ‌త్యాచార‌య‌త్నం

ఏపీలో వాలంటీర్ల ఆగ‌డాలు హ‌ద్దు మీరుతున్నాయి. అధికార పార్టీ అండ‌తో రెచ్చిపోతున్నారు. విచ్చ‌ల‌విడిగా అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నారు. బెదిరింపులు, దౌర్జ‌న్యాలు, అక్ర‌మాల‌తో పాటు తాజాగా హ‌త్యాచార‌య‌త్నానికీ పాల్ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. అస‌లు ఈ వాలంటీర్ల వ్య‌వ‌స్థ అవ‌స‌ర‌మా? అనే చ‌ర్చ మ‌రింత జోరందుకుంది. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. వాలంటీర్ల వ‌క్ర‌బుద్ధి మాత్రం మార‌డం లేదని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.తాజాగా, బాపట్ల జిల్లా బాప్టిస్టు పాలెంలో ఓ వివాహితపై వాలంటీర్ అఘాయిత్యం చేయ‌బోయాడు. ఒంటరిగా ఉన్న బాలింతను కామ-వాంఛ తీర్చాలంటూ వాలంటీర్ అసభ్యంగా ప్రవర్తించాడు.ఇంట్లోకి ప్రవేశించి ఆమెను బలవంతం చేయబోయాడు. భయపడిపోయ‌న ఆ మహిళ బయటకు పరుగులు తీసింది. అంత‌టితో ఆగ‌లేదు ఆ వాలంటీర్ దాష్టీకం. ఈ విష‌యం ఎవరికైనా చెబితే ఊళ్లో తిరగలేవంటూ ఆ మ‌హిళ‌ను బెదిరించాడు. విష‌యం ఇంట్లో వాళ్ల‌కి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ బాధితురాలు. వాలంటీర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.నా వెనుక ఎంపీ మోపిదేవి ఉన్నాడంటూ బెదిరించాడని సదరు మహిళ ఆరోపించింది.ఇతర మహిళలతో కూడా ఇలానే ప్రవర్తిస్తాడని పింఛన్లు ఇచ్చే నెపంతో ఇళ్లలోకి వచ్చి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. అందుకే అతడిని తాము ఇళ్లకు రానీయడం లేదని వాపోయారు.

కన్నతల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు

ఇల్లందు మండలం సుభాష్ నగర్ ఏరియాకి చెందిన చిలివేరు రమేష్(బోర్ రమేష్ )కన్నతల్లి మల్లికాంబ(75) ఇంటిలోకి రావద్దని గేటుకు తాళం వేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి… మల్లికాంబకు ఆరుగురు సంతానం. అందులో ఒక కొడుకు, 5 అమ్మాయిలు ఉన్నారు. కన్నతల్లిని ఆ అయిదుగురు కూతుర్లే ఎన్నో సంవత్సరాలుగా చూసుకుంటున్నారు. తల్లి ఆరోగ్యం బాగోలేదని కొడుకు చిలివేరి రమేష్ ఇంటికి కూతుర్లు తల్లిని తీసుకొచ్చారు. కొడుకు, కోడలు కలిసి తల్లి ఇంట్లోకి రావద్దని ఇంటి గేటుకు తాళం వేసుకున్నారు. ఈ ఘటన చూసిన స్థానికులు నివ్వెర పోయారు.

బీజేపీ నేతను నరికి చంపిన దుండగులు

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నేతను నరికి చంపారు కొంత మంది దుండగులు. దీంతో బిజెపి నేత కుటుంబ హత్య తమిళనాడులో సంచలనంగా మారింది. ఇంటి ముందు మద్యం తాగవద్దని చెప్పడంతో బిజెపి నేత మోహన్ రాజ్ కుటుంబాన్ని నరికి చంపారు కొంత మంది దుండగులు.ఈ దారుణమైన సంఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా పల్లడంలో చోటు చేసుకుంది. బీజేపీ పార్టీ నేత మోహన రాజ్ సహా నలుగురు కుటుంబ సభ్యులను ఆ దుండగులు చంపారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమేరాల ద్వారా విచారణ వేగవంతం చేశారు పోలీసులు. హత్యలకు ఇంటి వద్ద జరిగిన మద్యం గొడవే కారణమా లేక రాజకీయ కారణం అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.

మలేషియాలో ఉద్యోగాల పేరుతో మోసం

దేశంలో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం చేయడం ఇప్పటివరకూ చూశాం. ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగాల పేరుతో అనేక రకాల మోసాలు చేసే వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు విన్నాం. అయితే ఏకంగా మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏకంగా ఎనభై లక్షలు వసూలు చేసిన మోసగాడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డొకిపర్రుకు చెందిన తోట బ్రహ్మానందం మలేసియాలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దీ కాలం కిందట గుంటూరుకు వచ్చినప్పడు స్నేహితులతో మాట్లాడుతూ మలేషియాలో ఉద్యోగాలున్నాయని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. అప్పటి నుండి మేడికొండూరు మండలంలో ఒక్కొక్కరి వద్ద నుండి నాలుగు లక్షల రూపాయల చొప్పున మొత్తం పదిహేను మంది నుండి డబ్బులు వసూలు చేశాడు.అదే విధంగా అతని స్నేహితుడు తురకపాలెంకు చెందిన సుభాన్ కు కన్సల్టెన్సీ ఇప్పిస్తానని నమ్మబలికాడు. అందుకు ఇరవై లక్షల రూపాయలు అవుతుందని చెప్పి ఆ డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ యువకుల్ని మలేషియా పంపించాడు. ఆరు నెలల వీసాపై మలేషియా వెళ్లిన ఒకరి ఉద్యోగం రాగా మరొకరికి ఉద్యోగమే లేదు. వచ్చిన ఉద్యోగానికి కూడా జీతం లేదు. దీంతో వారిద్దరూ మోసం పోయామని తెలిసింది. అదే సమయంలో ఆరు నెలలు గడచి పోవడంతో స్థానికులకు సాయంతో ఆ ఇద్దరూ యువకులు స్వగ్రామం చేరుకున్నారు.దీంతో బ్రహ్మానందం మోసం చేసినట్లు స్థానిక యువకులకు తెలిసి పోయింది. ఈ క్రమంలోనే తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ బ్రహ్మానందాన్ని ఒత్తిడి చేశారు. అయితే తనకు ఎటువంటి సంబంధం లేదని ఇష్టం వచ్చినట్లు చేసుకోండని బ్రహ్మానందం దురుసుగా మాట్లాడాడు. దీంతో బాధితులందరూ స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే బ్రహ్మానందం మలేషియాలో ఉండటంతో ఏంచేయాలో అర్దం కావటం లేదని బాధితులు వాపోయారు.

*  తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపంతో ఓ బాలిక ఆత్మహత్య

 విజయవాడలో ఓ బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు ఆ బాలికని మందలించడంతోనే మనస్థాపనతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మైనర్ బాలుడిపై ట్యూషన్ టీచర్ లైంగిక వేధింపులు

స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డ ఓ ట్యూచర్ టీచర్ లైంగికంగా వేధింపులకు పాల్పడడటంతో.. టార్చర్ భరించలేక 14 ఏళ్ల బాలుడు గొంతుకోసి చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ట్యూషన్ కోసమని ప్రతిరోజూ ఆ బాలుడు జామినానగర్‌‌లోని ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లేవాడు. అతను కొంతకాలం నుంచి ఈ అబ్బాయిపై కన్నేశాడు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఓసారి బాలుడితో సన్నిహితంగా ఉంటూ వీడియో తీశాడు. అప్పటి నుంచి విద్యార్థిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. అతడు ఏం చెప్పినా వినాలని.. లేదంటే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెరిదిస్తున్నాడు. తాజాగా టీచర్ విద్యార్థిని తన ఇంటికి రమ్మన్నాడు. తనపై మళ్లీ వేధింపులకు పాల్పడుతాడని భావించిన బాలుడు టీచర్‌‌ను తనతో పాటు తీసుకొచ్చినా పేపర్ కట్టర్‌తో గొంతు కోసి పారిపోయాడు. ప్రస్తుతం బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

*  ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ట్రాన్స్‌పోర్ట్‌ లారీ

ఓ ప్రమాదం బస్సు ప్రయాణికులను కాపాడింది. నిజమే సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగితే ప్రాణాలు పోతాయి. కాని ఈ ప్రమాదం మాత్రం ప్రాణాలు పోకుండా కాపాడింది. ఏంటా అని ఆశ్చర్యపోకండి. అదే నిజం.. లేదంటే ఎంతోమంది ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చేది. మమ్మల్ని ఓ ట్రాన్స్పోర్ట్ లారీ రూపంలో భగవంతుడే కాపాడాడు అని ప్రయాణికులే చెప్పుకుంటున్నారు. విషయం ఏంటంటే  శ్రీశైలం నుంచి తెలంగాణ రాష్ట్రం మునుగోడు కు ఆర్టీసీ బస్సు వెల్తుంది. అయితే నర్సరావుపేట మండలం పెట్లూరి వారి పాలెం వద్దకు రాగానే బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో బస్సు రోడ్డు పక్కకి దూసుకెళ్ళింది. అయితే అదే సమయంలో నరసరావుపేట వైపు నుంచి వస్తున్న నవత ట్రాన్స్పోర్ట్ లారీ అనుకోని విధంగా ఆ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అక్కడికక్కడే ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే బస్సు రోడ్డు సైడ్ కు దూసుకుపోయి ఏ చెట్టునో ఢీ కొంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెప్తున్నారు.అయితే, నవతా ట్రాన్స్పోర్ట్ లారీ ప్రమాదం రూపంలో బస్సును ఢీకొనడంతో ప్రయాణికులను కాపాడినట్లు అయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. లారీ, బస్సు డ్రైవర్లుకు ఎటువంటి గాయాలు అవలేదు. లారీ ముందు భాగం మాత్రం కొంతమేర దెబ్బతింది. ప్రమాదం నుండి అందరూ క్షేమంగా బయటపడటంతో తమ తమ గమ్య స్థానాలకు ప్రయాణీకులు వెళ్ళిపోయారు.అటు, చిత్తూరు జిల్లాలో కూడా మరో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం సమీపంలో అర్ధరాత్రి లారీని కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రం,హున్సూర్ ఎక్సైజ్ డిఎస్పీగా పని చేస్తున్న విజయ్ కుమార్ తన కుటుంబంతో తిరుమల వెంకన్నను దర్శనం చేసుకొని తిరిగి బెంగళూరుకు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న లారీని వెనుక వైపు నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీఎస్పీ విజయ్ కుమార్ తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలిసింది.డీఎస్పీకి రెండు కాళ్లు విరిగాయని తెలిసింది.