Food

బోధిసత్వుడికి తేయాకుకు సంబంధం ఏమిటి?

బోధిసత్వుడికి తేయాకుకు సంబంధం ఏమిటి?

తేనీరులో రకరకాల వెరైటీలు ఉన్నట్టే.. తేయాకు పుట్టుక వెనుక కూడా టీ పరిమళమంత గొప్ప కథలు పుట్టెడు ఉన్నాయి. బుద్ధుడి కనురెప్పల వెంట్రుకల నుంచి టీ మొక్క ఆవిర్భవించిందని కొందరి వాదన. వీటికి భిన్నంగా మరో కథ చైనా జానపదుల్లో వినిపిస్తుంది. ‘దయ’ దేవత కరుణతో తేయాకు మొక్కలు పుట్టాయని వాళ్లు బలంగా చెబుతారు. ఈ కథ చైనాలో బోధిసత్వుడి మూలాలను తెలియజేస్తుంది. ఈ గాథకు ఆయన్ను ప్రత్యక్షసాక్షిగా విశ్వసిస్తారు. చైనాలో ఒకానొక ప్రాంతంలో బోధిసత్వుడి కంచు విగ్రహం ప్రతిష్ఠించి ఉన్న పురాతన ఆలయం ఉండేదట. ఓ నిరుపేద రైతు రోజూ వచ్చి ఆ గుడిని శుభ్రం చేస్తుండేవాడు. అయితే ఒకరోజు ఆకస్మికంగా బోధిసత్వుడి విగ్రహం కదిలిందట. దాన్ని చూడగానే రైతు మోకరిల్లి కండ్లు మూసుకోగా.. దయా దేవి లోగొంతుకతో ‘ఈ గుడి వెలుపల నీ భవిష్యత్తుకు తాళం చెవి ఉంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకో’ అని చెప్పిందట. దిగ్భ్రాంతి నుంచి తేరుకున్న రైతు గుడి బయట వెతకగా ఓ ఎండిపోయిన పొద కనిపించిందట. దానికి పాదుతీసి, రోజూ నీళ్లు పోస్తూ జాగ్రత్తగా సంరక్షించాడు ఆ రైతు. కొన్నాళ్లకు ఆ పొద చివుళ్లు వేసింది. పచ్చగా కళకళలాడింది. ఆ ఆకులు సేకరించి పానీయంగా తాగితే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చిందట. ఆ చెట్టు నుంచే చైనాలో తేయాకు మొక్కలు అంతటా విస్తరించాయని కొందరి నమ్మకం. అలా బోధిసత్వుడి ఆలయ ఆవరణలో తేయాకు ఉనికిలోకి వచ్చింది. ఆ దయ గల దేవత సెలవిచ్చినట్టు కొన్ని పరిస్థితుల్లో ఏమీ పాలుపోకుండా బుర్ర బద్దలవుతున్న వేళ.. చిక్కటి టీ తాగితే చాలు! తేనీటి తాళం చెవి ఆలోచనల గవాక్షం తెరిచి.. మస్తిష్కాన్ని తట్టిలేపుతుంది.