DailyDose

డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఈడీ నోటీసులు-నేటి నేర వార్తలు

డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఈడీ నోటీసులు-నేటి నేర వార్తలు

* డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఈడీ నోటీసులు

గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో ఇటీవల నటుడు నవదీప్ ను విచారించింది. సెప్టెంబర్ 14న బెంగళూరులో పట్టుబడ్డ నైజీరియన్ డ్రగ్ పెడ్లర్లతో నటుడు కాంటాక్ట్‌లో ఉన్నాడని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. తాజాగా మ‌రోసారి నటుడు న‌వ‌దీప్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు  జారీ చేస్తూ.. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకావాలని కోరింది. అక్టోబర్ 10న హాజరుకావాలని నవదీప్ ను కోరినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

విద్యుత్‌ మరమ్మతులు చేస్తుండగా లైన్‌మెన్‌ మృతి

 విద్యుత్‌ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌ తగలి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో రెండు సంవత్సరాల నుంచి నాగరాజు (35) ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే పీటీఆర్ లో ప్యూజ్ పోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం సంబవించకుండా ఉండేందుకు అల్యూమినియం నిచ్చెన సహాయంతో ఫ్యూజ్ పెట్టెందుకు ఎక్కాడు.ఈ సందర్బంలో 33కేవీ విద్యుత్ వైర్ కు నిచ్చెన అనుకోని ప్రమాదం సంభవించిందని తెలిపారు. దీంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతుని భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మృతునికి ఒక కుమారుడు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లు తెలిపారు.

*  నల్లగొండ జిల్లాలో దారుణం

 జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మత్తులో తోటి స్నేహితుని గొంతు కోసి పారిపోయాడు. ఈ విషాదకర సంఘటన నాగార్జునసాగర్ హిల్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గంజాయి మత్తులో నితిన్ అనే యువకుడు స్నేహితుడు విష్ణు గొంతి కోసి పారిపోయాడు. గాయపడిన విష్ణును సహచరులు దవాఖానకు తరలించారు. గొంతు కోసిన నిందితుడు నితిన్ ఏఎస్ఐ భిక్షమయ్య కొడుకుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసున మోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం

కర్ణాటక- తమిళనాడు సరిహద్దు ప్రాంతం అత్తిబెలెలోని బాలాజీ క్రాకర్స్‌ దుకాణంలో శనివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంతో 13 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. మృతులు, బాధితులు అందరూ తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రాంతానికి చెందిన వారే. తమిళనాడు నుంచి వచ్చిన బాణసంచాను దుకాణంలో సర్దుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో దుకాణంలో 20 మంది ఉన్నారు. వారిలో నలుగురు బయటకు పరుగుపెట్టుకుని వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. దుకాణం యజమాని నవీన్‌ ఒంటికీ కాలిన గాయాలయ్యాయి. అతన్ని చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం మూడున్నర నుంచి రాత్రి 8.30 వరకు మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపకదళ సిబ్బంది శ్రమించారు. బాలాజీ క్రాకర్స్‌ పక్కన ఉన్న మరో ఐదు దుకాణాలు, కొన్ని వాహనాలు కూడా కాలిపోయాయి. వాటిలో ఒక మద్యం దుకాణం ఉంది. విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు.

కోరుట్ల ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం

జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ డిపోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆర్టీసీ రాజధాని బస్సు దగ్దం అయింది. వివరాలు.. కోరుట్ల ఆర్టీసీ డిపోలో రాజధాని బస్సులో డీజిల్ నింపిన తర్వాత మంటల చెలరేగినట్టుగా తెలుస్తోంది. దీంతో అక్కడి వారంతా భయాందోళన చెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న డిపో అధికారులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్దమైంది. అయితే పక్కనే ఉన్న ఫ్యూయల్‌ స్టేషన్‌కు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాగా,  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఈజిప్టులో ఇజ్రాయెల్ పర్యాటకులపై కాల్పులు

ఈజిప్టులో ఓ పోలీసు అధికారి ఇజ్రాయెల్ పర్యాటకులపై కాల్పులకు తెగబడటం కలకలం రేపింది. అలెగ్జాండ్రియాలోని అమౌద్ అల్-సవారీ ప్రాంతంలో ఇజ్రాయెల్ పర్యాటకులు ప్రయాణిస్తున్న బస్సుపై అతడు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో కనీసం ఇద్దరు మృతిచెందారని స్థానిక అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌లో కొకైన్ విక్రయం

హైదరాబాద్‌లో డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. రోజూ ఎక్కడో చోట డ్రగ్స్ విక్రయిస్తూ నిందితులు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా.. మరో ఇద్దరిని గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో నగరానికి 30 గ్రాముల కొకైన్ తీసుకొచ్చి విక్రయిస్తుండగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను డ్రగ్స్ వ్యాపారిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీకెండ్ కావడంతో పబ్‌లలో, శివారు ప్రాంతాల్లోని ఫాంహౌజ్‌లలో డ్రగ్స్ పార్టీల కోసం డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గోవా నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్న ద్దరినీ అరెస్ట్ చేశారు.

శంకర్ నారాయణ కాన్వాయ్‌పై దాడి 

పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణకు ప్రమాదం తప్పింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్లలో బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యేపై ఓ ఆగంతకుడు డిటోనేటర్‌ విసిరాడు. గోరంట్ల మండలం గడ్డం తండా వద్ద ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకరనారాయణ నిర్వహించారు. ఆయన వాహనం దిగి కొంత దూరం నడిచారు. బైక్ ర్యాలీ అనంతరం వెళుతున్న ఎమ్మెల్యే శంకరనారాయణ కాన్వాయ్‌పై ఓ ఆకతాయి డిటోనేటర్‌ విసరడం కలకలం రేపింది. అది పేలక పోవడంతో ప్రమాదం తప్పింది. అయితే, డిటోనేటర్‌ గురితప్పి పొదల్లో పడటం, అది పేలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడున నాయకులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.శంకర్ నారాయణ కాన్వాయ్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరన్నది పోలీసులు గుర్తించారు. నిందితుడు సోమందేపల్లి మండలం గుడిపల్లికి చెందిన వెంకటేష్‌గా గుర్తించారు. వెంకటేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గ్రానైట్ తవ్వకాల్లో భాగంగా పేలుళ్లకు ఉపయోగించే డిటోనేటర్‌ను ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. మద్యం మత్తులోనే ఇలా చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు తెలుసుకున్నారు. ఇవాళ మద్యం మత్తులో పనికి వెళ్లగా యజమాని వెనక్కి పంపించినట్లు వారు వెల్లడించారు. జేబులో ఎలక్ట్రికల్ డిటోనేటర్ తీసుకువచ్చి.. వాహనంపై వెంకటేష్ విసిరేశాడు. ఎలక్ట్రికల్ డిటోనేటర్‌కు కరెంటు లేకుండా పేలే అవకాశం లేదని పోలీసులు తెలిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని పోలీసులు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని సీఐ చెప్పారు.

ఐఐటీ-ఢిల్లీ ఫెస్ట్ లో దారుణం

ఐఐటీ – ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ఫెస్ట్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఫ్యాషన్ ప్రజెంటేషన్ కోసం దుస్తులు మార్చుకునేందుకు 10 మంది విద్యార్థినులు వాష్ రూమ్ కు వెళ్లారు. అయితే అక్కడ రహస్యంగా వీడియో తీశారని ఢిల్లీ యూనివర్సిటీలోని భారతి కాలేజీకి చెందిన విద్యార్థినులు ఆరోపించారు. దీనిపై వారు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు బాధిత విద్యార్థినులు సోషల్ మీడియా వీడియోల ద్వారా తమ గోడు వెల్లబోసుకున్నారు. వాష్ రూమ్ కు వెళ్లిన సమయంలో రహస్యంగా వీడియో రికార్డింగ్ చేశారని, ఈ విషయం యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలూ తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై కిషన్ గఢ్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టి 20 ఏళ్ల కాంట్రాక్ట్ స్వీపర్ అయిన నేరస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఐపీసీ సెక్షన్ 354సీ కింద కేసు నమోదు చేసుకొని, నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.అయితే దీనిపై ఐఐటీ ఢిల్లీ స్పందించింది. ఇలాంటి ఘటనను సహించేది లేదని ఒక ప్రకటన విడుదల చేసింది. పరిస్థితిని అధికారులకు నివేదించామని పేర్కొంది. దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తామని తెలిపింది. కాగా.. ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ కూడా ఈ ఘటనను ఖండించింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.