NRI-NRT

ఇరాన్‌కు అమెరికా అందించిన నిధులతోనే ఇజ్రాయెల్‌పై దాడి: ట్రంప్

ఇరాన్‌కు అమెరికా అందించిన నిధులతోనే ఇజ్రాయెల్‌పై దాడి: ట్రంప్

ఇరాన్‌కు అమెరికా అందించిన నిధులతోనే హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడి చేస్తోందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను వైట్‌హౌస్‌ ఖండించింది

ఇజ్రాయెల్‌ (Israel)పై హమాస్‌ దాడికి అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పరోక్షంగా కారణమని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) ఆరోపించారు. అమెరికా ప్రజలు చెల్లించిన పన్నులతోనే ఈ దాడులకు నిధులు అందడం అవమానకరమని ట్రంప్ పేర్కొన్నారు. ‘‘ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులు బాధాకరం. బలమైన శక్తితో దాడులను తిప్పికొట్టే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. అమెరికా ప్రజలు చెల్లించిన పన్నులతో ఈ దాడులకు నిధులు అందడం అత్యంత అవమానకరం. బైడెన్‌ యంత్రాంగం నుంచి బయటికి వచ్చిన పలు నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి’’ అని ట్రంప్ ఆరోపించారు.

అంతకుముందు రిపబ్లికన్ పార్టీ బైడెన్‌ యంత్రాంగంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇరాన్‌కు అమెరికా గత నెలలో ఆరు బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందించిందని, ఆ నిధులతోనే హమాస్‌కు ఇరాన్‌ ఆయుధాలు సరఫరా చేసిందని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను వైట్‌హౌస్‌ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ ఆండ్రూ బేట్స్ ఖండించారు. ‘‘ఇరుపక్షాలు ఐక్యంగా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వాల్సిన సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం. అమెరికా ఇచ్చిన నిధులు ఆహారం, ఔషధాలు వంటి అవసరాల కోసం మాత్రమే ఉపయోగిస్తారు’’ అని ఆండ్రూ బేట్స్ స్పష్టం చేశారు. మరోవైపు హమాస్‌ ఉగ్రవాదులు వంద మంది ఇజ్రాయెల్‌ పౌరులు, సైనికులను అపహరించినట్లు టెల్అవీవ్‌ తెలిపింది. హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని మిలిటెంట్‌ సంస్థ ‘హెజ్బొల్లా’ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. అయితే ఈ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టనట్లు ఇజ్రాయెల్‌ దళాలు తెలిపాయి