Politics

తొలిసారి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్: కేటీఆర్

తొలిసారి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్: కేటీఆర్

 రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షమే అని, భారత రాష్ట్ర సమితికి భారీ విజయం ఖాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ప్రజలు నిండు మనసుతో రెండుసార్లు ఆశీర్వాదించారని, మూడోసారి కూడా పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. డిసెంబర్ 3న వచ్చే ఎన్నికల ఫలితాల ద్వారా సబ్బండ వర్గాలకు సంక్షేమాన్ని అందించిన కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారన్న విశ్వాసం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో తొలిసారి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారన్నారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందించిన అభివృద్ధిని పాశుపతాస్త్రంగా మార్చుకొని ప్రతిపక్షాలపై విజయం సాధిస్తామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన బీఆర్ఎస్ విశ్వసనీయతనే ఈ ఎన్నికల్లో విజయ మంత్రంగా మారుతుందని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న ప్రజా, తెలంగాణ వ్యతిరేక శక్తులకు మరోసారి ఓటమి తప్పదని, ప్రజల మద్దతుతో గులాబీ జెండాను మరోసారి ఎగరేస్తామన్నారు. నిరంతరం ప్రజలకు మంచి చేసిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓటు వేస్తారని, ప్రజలను ముంచిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల పైన వేటు వేస్తారన్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారని, మరోవైపు కేసీఆర్ ఉన్నారన్నారు. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని స్థితిలో ఉన్నారని, తెలంగాణలో గాడ్సే సిద్ధాంతాలు నడవవు అని స్పష్టం చేశారు.

ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సహంతో కదం తొక్కుతున్నాయని ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఎగరవేయనున్నారన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఉన్నదని, యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్రసన్యాసం చేసిందని, పోటీకి ముందే బీజేపీ కాడెత్తేసింది అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని, ఈసారి 100 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి పాత రికార్డులను బీఆర్ఎస్ తిరుగరాస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z