ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో (X) మరో మార్పు చోటుచేసుకుంది. రిప్లయ్ విషయంలో యూజర్లకు ఆ సంస్థ మరింత కంట్రోల్ ఇచ్చింది. రిప్లయ్‌లను పరిమితం చేసేందుకు గానూ కొత్తగా వెరిఫైడ్ అకౌంట్ల నుంచి మాత్రమే రిప్లయ్‌లు (Reply limitation) వచ్చేలా ఆప్షన్‌ను యాడ్ చేసింది. దీనివల్ల ఎక్స్‌లో వెరిఫైడ్ కాని యూజర్లు రిప్లయ్ ఇవ్వడం సాధ్యపడదు.సాధారణంగా ఎవరైనా ప్రముఖ వ్యక్తి పోస్టు పెడితే.. ఇతరులు కామెంట్ల రూపంలో రిప్లయ్ ఇస్తుంటారు. ఒకవేళ ఆ వ్యక్తి కేవలం వెరిఫైడ్ యూజర్లు మాత్రమే రిప్లయ్ ఇచ్చేలా ఆప్షన్‌ను ఎంచుకుంటే.. సాధారణ యూజర్లు ఎవరూ ఇకపై రిప్లయ్ ఇవ్వడం సాధ్యపడదు. ఒక విధంగా ఈ ఆప్షన్.. ఎక్స్ యూజర్లను వెరిఫైడ్ అకౌంట్లు వైపు మళ్లించే చర్యగా కనిపిస్తోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ఆప్షన్ వల్ల ప్రముఖులకు వేధింపులు, ట్రోలింగుల బెడద తగ్గే అవకాశం ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ తరహా ఆప్షన్ ఎక్స్‌లో అందుబాటులో ఉంది. కాకపోతే అందులో ‘ఎవ్రీవన్’, ‘మిమ్మల్ని ఫాలో అవుతున్న వ్యక్తులు’ ‘కేవలం మీరు మెన్షన్ చేసిన వ్యక్తులు’ అనే ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. కొత్తగా వెరిఫైడ్ అకౌంట్ల నుంచి మాత్రమే రిప్లయ్‌లు వచ్చే ఆప్షన్‌ను తీసుకొచ్చారు. ఈ ఆప్షన్ లైవ్‌లోకి వచ్చింది. ఒకవేళ వెరిఫైడ్ బ్లూ టిక్ పొందాలంటే ఆండ్రాయిడ్ యూజర్లు నెల నెలా రూ.900 చెల్లించాల్సిందే. వీరికి సాధారణ యూజర్లతో పోలిస్తే కొన్ని అదనపు సదుపాయాలను కల్పిస్తున్నారు. పోస్టులు ఎడిట్ చేసుకోవడం, సుదీర్ఘమైన పోస్టులతో పాటు, సుదీర్ఘమైన వీడియోలు సైతం పోస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z