Business

 భారత్‌లో అమెజాన్‌ ఇంటర్నెట్‌ సేవలు-వాణిజ్య వార్తలు

 భారత్‌లో అమెజాన్‌ ఇంటర్నెట్‌ సేవలు-వాణిజ్య వార్తలు

* టీసీఎస్ సంచలన నిర్ణయం

దేశంలో కరోనా విలయతాండవం చేయడంతో అప్పట్లో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ద్వారా తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు అనుమతించాయి. కొన్నాళ్లు ఆ వ్యవహారం బాగానే సాగినా.. ఆ తరువాత ఐటీ కంపెనీలకు మూన్ లైటింగ్ బెడద పట్టుకుంది. కార్పొరేట్ పరిభాషలో మూన్ లైటింగ్ అంటే.. తాము ఉద్యోగం చేస్తున్న సంస్థకు తెలియ‌కుండా ఖాళీ స‌మ‌యాల్లో ఇత‌ర సంస్థలకు కూడా ప‌ని చేయ‌డం అన్నమాట. అయితే, అలాంటి చాలామంది ఉద్యోగులను అప్పట్లో ఐటీ కంపెనీలు గుర్తించి తమ సంస్థల నుంచి తొలగించాయి.కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టినా నేటికీ కొంతమంది ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేందుకు మక్కువ చూపడం లేదట. కేవలం వారంలో రెండు రోజులు మాత్రమే ఆఫీస్‌కు వస్తున్నారట. ఈ క్రమంలో టెక్ దిగ్గజం టీసీఎస్ సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇకపై టీసీఎస్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై అందరూ ఖచ్చితంగా ఆఫీస్‌కి రావాల్సిందేనని తెలిపింది. ప్రస్తుతం టీసీఎస్ 6,08,985 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అందులో గత మూడు నెలల్లో 6 వేల మంది ఉద్యోగులు కంపెనీకి రిజైన్ చేసి వెళ్లిపోయారు. ఈ ఏడాది కొత్తగా మరో 40 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని టీసీఎస్ ఆలోచన చేస్తుంది.

* భారత్‌లో అమెజాన్‌ ఇంటర్నెట్‌ సేవలు

భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభించేందుకు ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌  సిద్ధమవుతోంది. ‘ప్రాజెక్ట్‌ కైపర్‌’ పేరిట అమెజాన్‌ శాటిలైట్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను అందించనుంది. ఇందుకోసం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.అమెజాన్‌కు చెందిన కైపర్‌ వ్యవస్థలో భాగంగా భూ సమీప కక్ష్యలో ఉన్న 3,236 ఉపగ్రహాల నెట్‌వర్క్ సాయంతో ఈ ఇంటర్నెట్‌ సేవలు అందించనున్నారు. వీటి ద్వారా తక్కువ లేటెన్సీతో కూడిన ఇంటర్నెట్‌ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందించేందుకు వీలు పడుతుంది. భారత్‌లో ఈ సర్వీసులను ప్రారంభించేందుకు నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ అథరైజేషన్‌ సెంటర్‌కు అమెజాన్‌ దరఖాస్తు చేసుకుంది. దీనికి టెలికాం విభాగం నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంది.ప్రాజెక్ట్‌ కైపర్‌లో భాగంగా మొత్తం 3236 శాటిలైట్లను అమెజాన్‌ అంతరిక్షంలోకి పంపనుంది. 2026నాటికి సగానికిపై ఉపగ్రహాలను పంపించాలన్నది ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉపగ్రహాల ద్వారా తక్కువ ధరలోనే 1 జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ సేవలను అందించే అవకాశం ఉంది. అమెజాన్‌ ఇ-కామర్స్‌తో పాటు ప్రైమ్‌ వీడియో సేవలను విస్తరించేందుకూ ఇది దోహదపడనుంది. అయితే, శాటిలైట్ ఇంటర్నెట్‌ సేవలకు ఎంత చెల్లించాల్సి ఉంటుంది? ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదీ వంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే సునీల్‌ మిత్తల్‌కు చెందిన వన్‌వెబ్‌, ముకేశ్‌ అంబానీకి చెందిన జియో శాటిలైట్‌ సేవల కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాయి. ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌ లింక్‌కు ఇంకా అనుమతులు లభించాల్సి ఉంది.

* నేడు సిలిండర్ ధరలు

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తారీకున సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. కాగా చాలా రోజుల తర్వాత గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించి సామాన్యులకు కాస్త ఊరటనిచ్చారు. అయితే నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..హైదరాబాద్: రూ.966,వరంగల్:  రూ. 974,విశాఖపట్నం: రూ. 912,విజయవాడ: రూ.927,గుంటూర్: రూ. 944.

యాక్సెంచ‌ర్ టెకీల‌కు చేదు క‌బురు

భార‌త్‌లో ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జం యాక్సెంచ‌ర్ టెకీల‌కు చేదు క‌బురు చేర‌వేసింది. భార‌త్, శ్రీలంక‌లో త‌మ ఉద్యోగుల‌కు ఈ ఏడాది వేత‌న పెంపుతో పాటు అధిక బోన‌స్ చెల్లింపులు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. కీల‌క నైపుణ్యాల‌తో కూడిన విభాగాల‌కు ఇది వ‌ర్తించ‌ద‌ని పేర్కొంది. యాక్సెంచ‌ర్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ అజ‌య్ విజ్ ఈ మేర‌కు ఉద్యోగులకు స‌మాచారం అందించారు.ఐటీ రంగం ప‌లు స‌వాళ్లు ఎదుర్కొంటున్న నేప‌ధ్యంలో యాక్సెంచ‌ర్ నిర్ణ‌యం వెలువడింది. యాక్సెంచ‌ర్ వృద్ధి కూడా అంచ‌నాల‌కు అనుణంగా లేక‌పోవ‌డం నిరాశ‌కు గురిచేసింది. 2023 మార్చిలో ఏకంగా 19,000 మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్టు కంపెనీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నైపుణ్యాలు, పని ప్ర‌దేశం ఆధారంగా దీటైన వేత‌నం అందించేలా యాక్సెంచ‌ర్ వేత‌న చెల్లింపులు ఉంటాయ‌ని, ఈ ఏడాది ఉద్యోగుల‌కు వేత‌న పెంపును కంపెనీ చేప‌ట్ట‌డం లేద‌ని ఉద్యోగుల‌కు పంపిన ఈ మెయిల్‌లో కంపెనీ ఎండీ అజ‌య్ విజ్ పేర్కొన్నారు.పదోన్న‌తుల‌ను కూడా కంపెనీ కుదిస్తోంద‌ని చెప్పారు. ఒక‌టి నుంచి నాలుగు లెవెల్స్ వ‌ర‌కూ ప‌దోన్న‌తుల‌ను 2024 జూన్ వ‌ర‌కూ వాయిదా వేస్తున్న‌ట్టు కంపెనీ ప్ర‌క‌టించింది. ఇక భార‌త్‌లో 3,00,000 మందికిపైగా ప్రొఫెష‌న‌ల్స్ యాక్సెంచ‌ర్‌లో ప‌నిచేస్తున్నారు.

భారత్‌కు రానున్న ఐటీ ప్రాజెక్ట్‌లు

ఇజ్రాయెల్‌ – హమాస్‌ మిలిటెంట్ల (Israel – Hamas Conflict) మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లోని టెక్‌ కంపెనీలు ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌ లేదా యూరప్‌కు తరలించాలని భావిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు ఏటా ఐటీ రంగం ద్వారా 14 శాతం ఆదాయం లభిస్తోంది. ఆ దేశ ఆర్థివ్యవస్థలో ఇది అత్యంత కీలకం. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఇంటెల్‌, విప్రో, టీసీఎస్‌ సహా 500కు పైగా అంతర్జాతీయ ఐటీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో మొత్తంగా సుమారు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన పలు కీలక ప్రాజెక్ట్‌లను ఇజ్రాయెల్‌లోని ఐటీ సంస్థలు చేపడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో కంపెనీ నిర్వహణ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో ఆయా కంపెనీలు చేపడుతున్న ప్రాజెక్ట్‌లను భారత్‌ సహా యూరప్‌లోని దేశాలకు తరలించాలని నిర్ణయించాయి.

* నేడు పెట్రోల్ డీజిల్ ధరలు

వాహనదారులు ఎక్కువగా వినియోగించే గత కొద్ది కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆయిల్ కంపెనీలు ప్రతి నెల 1 తేదీన సవరిస్తుంటారు. కానీ, కొన్ని నెలల నుంచే ఈ ధరల్లో ఎలాంటి మార్పులు జరగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు వీటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధరలు: రూ. 109.66,లీటర్ డీజిల్ ధరలు: రూ. 98.31 విశాఖపట్న: లీటర్ పెట్రోల్ రేట్లు: రూ. 110.48,లీటర్ డీజిల్ ధరలు: రూ. 98.విజయవాడ:లీటర్ పెట్రోల్ ధరలు: రూ. 111.76,లీటర్ డీజిల్ ధరలు: రూ.99.

హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌కు మరిన్ని విమాన సర్వీసులు

హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌కు వారానికి ఏడు నుంచి 12 విమాన సర్వీసులు నడుపుతున్నట్లు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూపు ప్రకటించింది. హైదరాబాద్‌కు విమాన సేవలు ప్రారంభించి 20 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా సంస్థ సర్వీసుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. ఇందుకు బోయింగ్ 737 –8 విమానాలను వినియోగిస్తామని చెప్పింది. ఎకానమీలో 144 సీట్లు,  బిజినెస్ క్లాస్‌‌‌‌‌‌‌‌లో 10 సీట్లు అందుబాటులో ఉంటాయి.  రాత్రి సర్వీసులకు ఎయిర్‌‌‌‌‌‌‌‌బస్ విమానాలను వాడతామని తెలిపింది. వీటిలో 303 సీట్లు ఉంటాయి. బిజినెస్ క్లాస్‌‌‌‌‌‌‌‌లో 40,  ఎకానమీలో 263 సీట్లు ఉంటాయని సంస్థ జీఎం సై యెన్ చెన్ చెప్పారు.  అక్టోబర్ 29వ తేదీ నుంచి 96 వీక్లీ ఫ్లైట్లను హైదరాబాద్ సహా తొమ్మిది నగరాల నుంచి నడుపుతామని వెల్లడించారు. అయితే.. స్కూట్​ విమానాలు ఇక మీదట హైదరాబాద్​ నుంచి ఉండవని, ఇతర నగరాలను నుంచి సేవలు అందిస్తాయని చెప్పారు. ప్రస్తుతం వారానికి ఏడు సర్వీసులు నడుస్తుండగా.. అక్టోబర్​ 29వ తేదీ నుంచి మరో ఐదు సర్వీసులు పెంచుతామని సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ సే యెన్‌ చెన్‌ తెలిపారు. సంస్థ అనుబంధ విభాగం స్కూట్‌ రోజువారి సర్వీసులను నిలిపివేసిన క్రమంలో ఈ సర్వీసుల పెంపు కలిసిరానున్నది.

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు… ఆ వెంటనే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 64 పాయింట్లు నష్టపోయి 66,408కి పడిపోయింది. నిఫ్టీ 17 పాయింట్లు కోల్పోయి 19,794 వద్ద స్థిరపడింది. 

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z