Sports

పాక్ పై భారత్ మరోసారి తిరుగులేని ఆధిపత్యం

పాక్ పై భారత్ మరోసారి తిరుగులేని ఆధిపత్యం

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ (Pakistan)పై భారత్ మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరల్డ్ కప్‌లో పాక్‌తో ఆడిన ఏడుసార్లు విజయం సాధించిన టీమ్‌ఇండియా (Team India).. ఎనిమిది మ్యాచ్‌లోనూ గెలుపొంది ఆ రికార్డు పదిలం చేసుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థితో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బంతితో అదరగొట్టి పాకిస్థాన్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేసిన టీమ్‌ఇండియా.. బ్యాటింగ్‌లోనూ సత్తాచాటింది. పాక్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఈ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్‌ శర్మ (86; 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరోసారి భారీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. శ్రేయస్ అయ్యర్ (53; 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ 19 (29 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. శుభ్‌మన్ గిల్ (16; 11 బంతుల్లో 4 ఫోర్లు) దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు. కోహ్లీ (16; 18 బంతుల్లో 3 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. పాక్‌ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2, హసన్‌ అలీ ఒక వికెట్ పడగొట్టారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ను 191 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో బాబర్ అజామ్ (50) అర్ధశతకం సాధించగా.. మహమ్మద్ రిజ్వాన్ (49), ఇమామ్‌ ఉల్ హక్ (36) రాణించారు. అబ్దుల్లా షఫిఖ్‌ (20) పరుగులు చేశాడు. మిగతా వారిలో సాద్‌ షకీల్ (6), ఇఫ్తికార్ అహ్మద్ (4), షాదాబ్‌ ఖాన్ (2) ఘోరంగా విఫలమయ్యారు. ఒకదశలో 29.3 ఓవర్లకు 154/2 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచిన పాక్‌.. 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. కేవలం 37 పరుగుల వ్యవధిలో చివరి ఎనిమిది వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారు. బుమ్రా, సిరాజ్, కుల్‌దీప్‌ యాదవ్, హార్దిక్‌, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z