Business

బీపీసీఎల్‌ ఐఓసీకి జరిమానా- వాణిజ్య వార్తలు

బీపీసీఎల్‌ ఐఓసీకి జరిమానా- వాణిజ్య వార్తలు

* బీపీసీఎల్‌ ఐఓసీకి జరిమానా

కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)..భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్‌)కు రూ.2కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు రూ.1కోటి మేర జరిమానా విధించింది. తమ పెట్రోల్ పంపుల వద్ద కాలుష్య నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేయనందుకు జరిమానా విధించినట్లు బోర్డు తెలిపింది. ఈ మేరకు రెండు సంస్థలు వేర్వేరు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్‌)లోని రిటైల్ అవుట్‌లెట్లలో వేపర్‌ రికవరీ సిస్టమ్స్ (వీఆర్‌ఎస్‌) ఇన్‌స్టాల్ చేయనందుకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సీపీసీబీ నుంచి ఆదేశాలు అందినట్లు ఐఓసీ తెలిపింది. అయితే, సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోపు పెట్రోల్‌ స్టేషన్లలో వీఆర్‌ఎస్‌లను ఏర్పాటు చేయనందుకు ఈ ఫైన్‌ విధించలేదని స్పష్టం చేసింది. వాహనాల్లో ఇంధనం నింపేటప్పుడు పెట్రోల్ ఆవిరై వాతావరణంలోకి వెళుతుంది. ఈ ఆవిరిలో బెంజీన్, టోలీన్, క్సైలీన్‌ వంటి క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. పెట్రోల్ ఆవిరి బయటకు రాకుండా ఇంధన స్టేషన్లలో వీర్‌ఎస్‌ని అమర్చాలని 2016లో పెట్రోల్ పంపులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు, సీపీసీబీ నిర్దేశించిన సమయంలో వీఆర్‌ఎస్‌ను ఇన్‌స్టాల్ చేయనందుకు రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసు అందుకున్నట్లు బీపీసీఎల్‌ ప్రకటన విడుదల చేసింది.

* నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల చాలా రోజులకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చారు. అలాగే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం పెరిగాయి. హైదరాబాద్: రూ. 966,వరంగల్: రూ. 974,విశాఖపట్నం: రూ. 912,విజయవాడ: రూ. 927,గుంటూర్: రూ. 944.

* నమో భారత్ టిక్కెట్‌పై కొత్త అప్‌డేట్

NCRCTC నమో భారత్ టిక్కెట్ కోసం కొత్త అప్‌డేట్ విడుదల చేయబడింది. అప్‌డేట్ ప్రకారం, ప్రయాణానికి తీసుకున్న టికెట్ కేవలం రెండు గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. దీని తర్వాత ఈ టికెట్ గడువు ముగుస్తుంది. గడువు ముగిసిన టిక్కెట్‌తో ఎవరైనా పట్టుబడితే గంట ప్రాతిపదికన జరిమానా విధించబడుతుంది. జరిమానా గంటకు రూ.10 ఉంటుంది. ప్రస్తుతం జరిమానా నిబంధనను సడలించినా త్వరలో కఠినంగా అమలు చేయనున్నారు. సరాయ్ కాలే ఖాన్-మీరట్ మధ్య ప్రయాణం ఒక గంటలో పూర్తవుతుంది కాబట్టి టిక్కెట్ చెల్లుబాటును రెండు గంటలపాటు ఉంచినట్లు అధికారులు తెలిపారు. దీని తర్వాత కూడా ఒక గంట అదనపు సమయం ఇచ్చారు. స్టేషన్‌లో ప్రయాణికులు ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు.

* ఎస్‌యూవీ కార్లలో రానున్న రోజుల్లో కొత్త పెట్రోల్‌ ఇంజిన్‌

ప్రీమియం ‘స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల (SUV)’ కోసం కొత్త పెట్రోల్‌ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. రానున్న రోజుల్లో వీటిని హ్యారియర్‌, సఫారీలో ఉపయోగించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ రెండు మోడళ్లలో 2-లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ను వాడుతున్నారు. ఏటా రెండు లక్షల ప్రీమియం ఎస్‌యూవీలు అమ్ముడవుతున్నట్లు కంపెనీ ప్రయాణికుల వాహన విభాగం డైరెక్టర్‌ శైలేష్‌ చంద్ర తెలిపారు. వీటిలో 80 శాతం డీజిల్‌ వాహనాలే. ఈ నేపథ్యంలోనే ఈ సెగ్మెంట్‌పై దృష్టి సారించి 1.5 లీటర్‌ జీడీఐ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ దిశగా పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు పేర్కొన్నారు. టాటా మోటార్స్‌ గతవారం హ్యారియర్‌, సఫారీలో వరుసగా రూ.15.49 లక్షలు, రూ.16.19 లక్షల ధరతో కొత్త వెర్షన్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భద్రత విషయంలో వీటిని అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలిపింది.

* ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల త‌నిఖీలు

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల త‌నిఖీలు ముగిశాయి. నాలుగు బంగారం దుకాణాల్లో బిల్లులు లేని సుమారు 300 కిలోల‌ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. విజ‌య‌వాడ‌, తిరుప‌తికి చెందిన ఐటీ అధికారులు గ‌త నాలుగు రోజులుగా ప్రొద్దుటూరులోని బుశెట్టి జువెలర్స్‌, డైమండ్స్ దుకాణాల‌తో పాటు గురురాఘ‌వేంద్ర, త‌ల్లం దుకాణాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. అనంతరం భారీ ఎత్తున బంగారం సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారాన్ని అట్టపెట్టెలు, సూట్‌కేసుల్లో భద్రపరిచి వాహనాల్లో తిరుపతికి తరలించారు. ఇతర ప్రాంతాల నుంచి బిల్లులు లేకుండా భారీ ఎత్తున బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు.బంగారం వ్యాపారంలో ప్రొద్దుటూరు రెండో ముంబయిగా ఖ్యాతి గడించింది. దీంతో భారీగా అక్రమ బంగారం దిగుమతి అవుతోందన్న పక్కా సమాచారంతో అధికారుల నాలుగు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రొద్దుటూరులో రెండు వేలకు పైగా బంగారం, స్వర్ణకారుల దుకాణాలు ఉన్నాయి. ఐటీ అధికారుల తనిఖీలతో మిగతా బంగారం వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. తనిఖీలు తమ వరకు వస్తాయన్న ఆందోళనతో బంగారం, స్వర్ణకారులు దుకాణాలను మూసివేశారు. దసరా పండుగ సమయంలో బంగారం దుకాణాలన్నీ మూత పడటంతో కొనుగోలుకు వచ్చిన వినియోగదారులు నిరాశ చెందారు.

* మారుతి సుజుకీ దసరా దీపావళి సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్లు

ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ దసరా, దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్‌ 31 వరకు కార్లపై డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఎస్‌యూవీ మోడల్‌ జిమ్నీపై రూ.లక్ష వరకు రాయితీని ఇస్తున్నట్టు ప్రకటించింది.జిమ్నీ ఎస్‌యూవీపై రూ.50 వేల వరకు రాయితీ ఇస్తున్న సంస్థ..ఎక్సేంజ్‌ లేదా లాయల్టీ బోనస్‌ కింద రూ.50 వేల వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నది. ఈ ఆఫర్‌ మాన్యువల్‌, పెట్రోల్‌ రకం మాడళ్లకు వర్తించనున్నది. ప్రస్తుతం జెటా రకం రూ.12.74 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది.

* నేడు పెట్రోల్ డీజిల్ ధరలు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ఆధారంగా ఫ్యూయల్ ధరలను సవరిస్తుంటారు. కానీ గత కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఈ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్:లీటర్ పెట్రోల్ ధర రూ.109.66,లీటర్ డీజిల్ ధర రూ.98.31,విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48,లీటర్ డీజిల్ ధర రూ. 98,విజయవాడ:లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76,లీటర్ డీజిల్ ధర రూ. 99.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z