Politics

2004లో రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ

2004లో రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే స్టేషన్‌ ఘన్‌పూర్‌కు రెండు పనులు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌కు వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కాలేజీ తీసుకొస్తామన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో రేవంత్‌ మాట్లాడారు.

‘‘పదేళ్ల భారాస పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మంత్రివర్గంలో నలుగురు మహిళలకు స్థానం కల్పిస్తాం. బిల్లులు రావడం లేదని సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటామని అంటున్నారు. ఆంధ్రాలో అధికారం కోల్పోతామని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం.. ఈ భారాస ప్రభుత్వం. భారాస వంద తప్పులు పూర్తయ్యాయి. ఇక కాంగ్రెస్‌ విజయం ఖాయం. కాంగ్రెస్‌ వస్తే రైతుబంధు బంద్‌ అవుతుందని భారాస ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్‌ వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తాం. ఉపాధి హామీ కూలీకి వెళ్లే ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.₹12వేలు ఇస్తాం. 2004లో రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ. అధికారంలోకి రాగానే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌, ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తాం’ అని రేవంత్‌ వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z