Politics

నిమ్మల రామానాయుడు అరెస్ట్‌

నిమ్మల రామానాయుడు అరెస్ట్‌

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ‘పాలకొల్లు చూడు’ పేరుతో నిరసన కార్యక్రమంలో భాగంగా పెంకిళ్లపాడు టిడ్కో గృహాల వద్ద వంటా వార్పు కార్యక్రమానికి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దీనికి పోటీగా వైకాపా పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ గొడాల గోపి ఆధ్వర్యంలో అదే ప్రాంతంలో ‘నిజం చెబుతాం’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనుమతి లేదంటూ రెండు పార్టీల కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ నిరసన వ్యక్తం చేసేందుకు తెదేపా శ్రేణులు, లబ్ధిదారులు ఎమ్మెల్యే నిమ్మల ఇంటి వద్దకు చేరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యేను పోలీసుల గృహనిర్బంధం చేశారు. దీంతో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది.

అయితే పోలీసుల కళ్లుగప్పి ఎమ్మెల్యే రామానాయుడు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం జాతీయ జెండాలతో పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు ఆయనతో పాటు తెదేపా, జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటిస్తుంటే అడ్డంకులేంటని మండిపడ్డారు. ఈ క్రమంలో జరిగిన పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే కిందపడిపోయారు. అనంతరం పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి భీమవరం వైపునకు తీసుకెళ్లారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z