Politics

చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా

చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా

మద్యం, ఇసుక కేసుల్లో తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం కేసుల విచారణను వాయిదా వేసింది. మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణను గురువారానికి వాయిదా వేసింది. అలాగే ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను శుక్రవారాని (ఈ నెల 24)కి వాయిదా వేసింది. ఈ కేసులో తదుపరి వాదనలను అడ్వకేట్‌ జనరల్‌ వినిపించనున్నారు.

సామాన్యులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే..
ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు పూర్తయ్యాయి. సీఐడీ అభియోగాలపై ఆధారాలు లేవని వారు వాదించారు. రాజకీయ కక్షతోనే వరుస కేసులు నమోదు చేస్తున్నారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 17 – ఏ నిబంధన చంద్రబాబుకు వర్తిస్తుందని పేర్కొన్నారు. అభియోగాలు నమోదుకు గవర్నర్‌ అనుమతి తీసుకోలేదన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని క్రిమినల్ కేసు ద్వారా విచారణ జరపకూడదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. ఉచితంగా ఇసుకను ఇచ్చారు కాబట్టి ఖజానాకు నష్టం జరిగిందని అనడానికి వీల్లేదన్నారు. అది ప్రభుత్వ నిర్ణయం, సామాన్యులకు మేలు చేయాలనే ఉద్దేశంతో చేసిన నిర్ణయంగానే చూడాలని కోరారు. ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టేందుకు ఏముంటుందని ప్రశ్నించారు. ఉచిత ఇసుక అనేది ఏవిధంగానూ చట్ట విరుద్ధం కాదని వాదించారు. ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో పేదలకు, భవన నిర్మాణ పనులకు అందుబాటులో ఉండేలా అప్పటి ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఈ విధాన పరమైన నిర్ణయం తీసుకుందని కోర్టుకు తెలిపారు.

చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారు: సీఐడీ
పబ్లిక్ సర్వెంట్‌గా ఉంటూ చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారని మద్యం కేసులో సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కేబినెట్‌ నిర్ణయానికి విరుద్ధంగా విధాన నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. దాని వల్ల భారీగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చిందని పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం వెళ్లాలి లేదా సవరించి ముందుకు వెళ్లాలని.. అలా కాకుండా వెళ్తే అవినీతి విస్తృతం అవుతుందని వివరించారు. ఎక్సైజ్ పాలసీనీ 5 నుంచి 10 శాతానికి ఉద్దేశ పూర్వకంగా మార్చారని సీఐడీ స్పష్టం చేసింది. కొంతమందికే లబ్ధి కలిగేలా మార్పులు చేసి లైసెన్స్ ఇచ్చారని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z