DailyDose

ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిస్తా- తాజా వార్తలు

ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిస్తా- తాజా వార్తలు

 శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

ఆపదమొక్కుల వాడు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలో ని 13 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.నిన్న స్వామివారిని 69,981 మంది భక్తులు దర్శించుకోగా 20, 492 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.55 కోట్లు వచ్చిందని వివరించారు.

* నాకు ఆంధ్రా జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చింది!

తెలంగాణ తనకు ఎంతో బాలాన్ని ఇచ్చిందని, అదే స్ఫూర్తితో ఏపీలో రౌడీలతో పోరాడుతున్నాని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. భాజపా అభ్యర్థులకు మద్దతుగా హనుమకొండలో నిర్వహించిన విజయసంకల్ప సభలో పవన్‌ పాల్గొని ప్రసంగించారు. ‘‘నా పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటోంది. ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో తెలంగాణలో కూడా అలాగే తిరుగుతా. ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిస్తా. తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే పదేళ్లుగా పార్టీ నడుపుతున్నా. బలిదానాలపై ఏర్పడిన రాష్ట్రం అవినీతిమయం కావడం బాధ కలిగించింది. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాం. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని భాజపాతో కలిశాను. నాకు ఆంధ్రా జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చింది. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో నేనూ ఒకడిని. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలోనూ పర్యటిస్తా. కమలం గుర్తుకు ఓటు వేసి.. రావు పద్మ, ఎర్రబెల్లి ప్రదీప్‌ను గెలిపించాలి’’ అని ఓటర్లకు పవన్‌ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

*    కేసీఆర్ కు రేవంత్ సవాల్ 

సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావని సీఎం కేసీఆర్ అంటున్నారని..కాంగ్రెస్ కు 80 సీట్ల కంటే ఎక్కువే రాబోతున్నాయని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 80 సీట్లకు ఒక్క సీటు తక్కువ వచ్చినా..ఏ శిక్షకైనా సిద్ధమంటూ రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.

*  తెలంగాణను సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్

కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని మహబూబ్‌నగర్‌(Mahabubnagar) బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్(Minister Srinivas goud) అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణను సీఎం కేసీఆర్‌ ఎంతో అభివృద్ధతి చేశారన్నారు. గతంలో పాలమూరు పరిస్థితి ఎలా ఉండోదో మనకు తెలుసు.వలసలు, ఉరితాళ్లు, నీళ్లు అరిగోస పడేవాళ్లమన్నారు. కేసీఆర్‌ పోరాడి తెలంగాణను సాధించాక పాలమూరు తలరాత మార్చాడన్నారు. నీళ్లులేక నోళ్లు తెరిచిన చెరువులు, కుంటలు, నేడు పంట పొలాలతో విలసిల్లుతున్నాయన్నారు.నేడు ఇక్కడ అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకున్నం. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించేందుకు పని చేస్తున్నాం.అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా పని చేస్తున్నాం. కొంతమంది కుల,మత రాజకీయాలతో గెలువాలని చూస్తున్నారు. అలాంటి వారికి బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ రౌడీ రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీలను గెలిపిస్తే రాష్ట్రం కుక్కల చింపిన విస్తరి అవుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి మరింత కొనసాగాలంటే కేసీఆర్‌ను గెలిపించాలన్నారు.

గౌతమ్‌ గంభీర్‌ కీలక నిర్ణయం

టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌లో తన సొంతగూటికి చేరుకుంటున్నట్లు ప్రకటించాడు. 2023 సీజన్‌ వరకు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా పని చేసిన గంభీర్.. వచ్చే సీజన్‌ నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సేవలు అందించనున్నట్లు వెల్లడించాడు. 2012, 2014 ఎడిషన్లలో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన గంభీర్‌ తిరిగి తన సొంతగూటికి చేరడంపై హర్షం వ్యక్తం చేశాడు.కేకేఆర్‌ యాజమాన్యం గంభీర్‌కు ఆత్మీయ స్వాగతం పలికింది. గంభీర్‌ వచ్చే సీజన్‌ నుంచి హెడ్‌ కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌తో పాటు కేకేఆర్‌ బృందంలో భాగమవుతాడు. గంభీర్‌ మెంటార్‌గా కేకేఆర్‌కు సేవలిందిస్తాడు. గంభీర్‌ చేరికను కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ నిర్ధారించారు.ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రారంభానికి చాలా సమయం ఉండగానే అన్ని ఫ్రాంఛైజీల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో హెడ్ కోచ్‌కు స్థానచలనం కలిగింది. సంజయ్‌ బాంగర్‌ స్థానంలో ఆండీ ఫ్లవర్‌ హెడ్ కోచ్‌గా నియమించబడ్డాడు. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు బౌలింగ్‌ కోచ్‌లను మార్చాయి. ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న షేన్‌ బాండ్‌ రాజస్థాన్ రాయల్స్‌కు.. బాండ్ స్థానంలో లసిత్ మలింగ ముంబై ఇండియన్స్‌ బౌలింగ్ కోచ్‌గా అపాయింట్ అయ్యారు.

* కేరళ తమిళనాడుకు భారీ వర్ష సూచన

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కేరళ, తమిళనాడు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు హెచ్చరికలు చేసింది. రెండు రాష్ట్రాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు కోస్తా ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమ, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.నేడు (బుధవారం), రేపు (గురువారం) కేరళలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) అంచనా వేసింది. ఇక తమిళనాడు, పుదుచ్చేరిలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. వాతావరణ విభాగం హెచ్చరికలతో కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవు ప్రకటించాయి.మరోవైపు తమిళనాడులోని 10 జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో అడపాదడపా వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి, కారైకల్‌లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. మరోవైపు కేరళలో ఇప్పటికే గణనీయమైన వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో వరుసగా 7 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.

* రేపు వికారాబాద్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ సభ

రేపు వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల బ్లాక్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. ఈ సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడానికి పార్టీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఈ సభకు భారీ ఎత్తున పార్టీ నాయకులు ,కార్యకర్తలు ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని కోరారు వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మెతుకు ఆనంద్. కాగా ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సభకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు

జనసేన పార్టీకి మరో షాక్‌ 

 ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జి సందీప్‌తో పాటు రాయలసీమ రీజియన్‌ ఇంఛార్జి పద్మావతిలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. బుధవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పేసుకున్నారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌పై సంచలన ఆరోపణలు, తీవ్ర విమర్శలే చేశారు. ‘‘పవన్ కల్యాణ్‌కు ఆ పార్టీలో ఉండే రుక్మిణి అంటే భయం. ఆమె మాట విని చాలామందిని రోడ్డు మీదకు నెట్టారు.  ఆయనో అహంకారి. తన స్వార్థం కోసం ఎంతో మందిని బలి చేశారు. యువతను దారుణంగా మభ్య పెడుతున్నారు. తాను లేకుండా నాదెండ్ల కూడా అసెంబ్లీకి వెళ్లకూడదనుకునే తత్వం పవన్‌ది. జనసేన ఆఫీసుకు వచ్చే హవాలా డబ్బును మార్చేది నాదెండ్లనే. హైదరాబాద్‌లో భూకబ్జా కేసులో ఏ1గా ఉన్న వ్యక్తిని జనసేన కమిటీలో పవన్‌ పెట్టారు. రాజకీయాల్లో మాట తప్పి.. టీడీపీ కోసమే పవన్‌ పని చేస్తున్నారు. టీడీపీ పంచన చేసి నమ్ముకున్న మాలాంటి వాళ్లను మోసం చేశారు’’ అని పసుపులేటి సందీప్ అన్నారు. ‘‘చిరంజీవి అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చా. 2014లో జనసేనకు అండగా నిలబడింది నేనే. పవన్‌ను నమ్మి నా బిడ్డను ఆయన దగ్గరికి పంపాను. కానీ, ఆయన నా బిడ్డను రోడ్డున పడేశారు. ఒక తల్లిగా చెప్తున్నా.. మీ బిడ్డల్ని ఆయన దగ్గరకు పంపొద్దు. పార్టీలో మహిళలను నాదెండ్ల ఎదగనివ్వడం లేదు. పవన్‌ సరిగా లేనందు వల్లే పార్టీలో మహిళలకు గౌరవం లేకుండా పోయింది. ఈ అంశం మీద ఎక్కడైనా చర్చకు నేను సిద్ధం’’ అని పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z