Sports

క్రీడాకారులకు ఇచ్చే టీషర్టులుపై జగన్‌ ఫొటోలు

క్రీడాకారులకు ఇచ్చే టీషర్టులుపై జగన్‌ ఫొటోలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌(YS Jagan) ప్రచార యావ పతాక స్థాయికి చేరుకుంటోంది. చివరకు క్రీడాకారులను కూడా వదలడం లేదు. డిసెంబరు 15 నుంచి జనవరి 26 వరకు నిర్వహించే ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఇచ్చే టీషర్టులు, టోపీలు, మణికట్టు బ్యాండ్లపై సీఎం జగన్‌ ఫొటోలు ముద్రించారు. వైకాపా జెండా రంగులతో వీటిని తయారు చేశారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) అధికారులు జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి సంబంధించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఇందులో గ్రామ సచివాలయాల స్థాయిలో నిర్వహించిన క్రీడల్లో విజేతలై మండల స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనే యువతకు టీషర్టు, టోపీ, మణికట్టు బ్యాండులు ఇవ్వనున్నట్లు తెలిపిన శాప్‌ అధికారులు ..వాటి చిత్రాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌లో చేర్చి జిల్లా అధికారులకు చూపించారు. టీషర్టు, టోపీ, బ్యాండ్లపై సీఎం జగన్‌ ఫొటో ముద్రించారు. వైకాపా జెండాలోని ఆకుపచ్చ, నీలం రంగులతో తయారు చేసిన వీటిపై తెలుపు రంగులో ‘ఇది అందరి ఆట’ అంటూ ఆంగ్ల అక్షరాలతో ముద్రించారు. రూ.45 కోట్లకుపైగా ప్రజాధనంతో నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ తన ప్రచారానికి వినియోగించుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z