Sports

జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు మూడు పతకాలు

జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు మూడు పతకాలు

జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు సత్తా చాటారు. వ్యక్తిగత విభాగం జూనియర్‌ పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌లో రోహిత్‌ కవిటి కాంస్యం గెలుచుకున్నాడు. 621.10 స్కోరుతో రోహిత్‌ మూడో స్థానంలో నిలిచాడు.

టీమ్‌ విభాగం జూనియర్‌ పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో రోహిత్‌ కవిటి, అబ్దుల్‌ ఖలీఖ్‌ ఖాన్, అద్నాన్‌ ఖుస్రోలతో కూడిన జట్టు మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకోగా, ఈ ముగ్గురే సభ్యులుగా ఉన్న జట్టు పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ సివిలియన్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది.

చిత్తుగా ఓడిన తెలంగాణ జట్టు
చెన్నై: జాతీయ సీనియర్‌ హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు భారీ పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఒడిషా 7–0 గోల్స్‌ తేడాతో తెలంగాణను ఓడించింది. ఒడిషా తరఫున దిప్సన్‌ తిర్కీ (24వ నిమిషం), రజిన్‌ కందుల్న (25, 60), అమిత్‌ రోహిదాస్‌ (31), అజయ్‌ కుమార్‌ ఎక్కా (36), నీలమ్‌ సంజీప్‌ (43), రోషన్‌ మిన్జ్‌ (57) గోల్స్‌ సాధించగా…తెలంగాణ ఒక్క గోల్‌ కూడా కొట్టలేకపోయింది.

మరో మ్యాచ్‌లో పంజాబ్‌ 13–0తో ఉత్తరాఖండ్‌పై ఘన విజయం సాధించింది. భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, జుగ్‌రాజ్‌ సింగ్‌ ‘హ్యాట్రిక్‌’ గోల్స్‌ సాధించడం విశేషం. ఇతర మ్యాచ్‌లలో ఉత్తరప్రదేశ్‌ 8–1తో రాజస్తాన్‌ను, పుదుచ్చేరి 6–0తో కేరళను, ఢిల్లీ 23–0తో అరుణాచల్‌ప్రదేశ్‌ను ఓడించాయి.