Business

భారీగా పెరిగిన బంగారం ధర

భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ధర మరో ఆల్‌టైమ్‌ హై రికార్డుకు చేరింది. రోజుకింత పెరుగుతూ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు ప్రకంపనల్నే సృష్టిస్తున్నాయి. సోమవారం హైదరాబాద్‌లో తులం ఇంకో రూ.440 ఎగిసింది. ఫలితంగా క్రితమెన్నడూ లేనట్టుగా 24 క్యారెట్‌ పసిడి 10 గ్రాములు రూ.64,200ను తాకింది. ఆభరణాలు తయారు చేయడానికి వినియోగించే 22 క్యారెట్‌ పుత్తడి రేటు కూడా రూ.400 ఎగబాకి రూ.58,850ని చేరుకున్నది. ఇదిలావుంటే ఢిల్లీలోనూ బంగారం ధరలు పరుగులు పెట్టాయి. రూ.450 పుంజుకొని రూ.64,300 వద్ద 24 క్యారెట్‌ పసిడి ధర స్థిరపడింది. అలాగే 22 క్యారెట్‌ 10 గ్రాములు రూ.410 పెరిగి రూ.58,950గా నమోదైంది.

దూకుడుగా..
పసిడి ధరలు గతకొద్ది రోజుల నుంచి క్రమేణా పెరుగుతూపోతున్నాయి. హైదరాబాద్‌ విషయానికే వస్తే.. గడిచిన రెండు వారాల్లో 24 క్యారెట్‌ 10 గ్రాములు రూ.2,000, 22 క్యారెట్‌ రూ.1,750 మేరకు ఎగిసినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రోజుకో ఆల్‌టైమ్‌ హై రికార్డు నమోదవుతున్నట్టు మార్కెట్‌ వర్గాలు ట్రేడింగ్‌ సరళిని విశ్లేషిస్తున్నాయి. కాగా, వరుస పండుగల సీజన్‌కు పెండ్లిళ్ల సీజన్‌ కూడా తోడవడంతో మార్కెట్‌లో గోల్డ్‌ సేల్స్‌ బాగా జరుగుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. ఇక నిరుడుతో పోల్చితే ఈసారి ధంతేరాస్‌కు బంగారం అమ్మకాలు పుంజుకున్న సంగతి విదితమే. కడ్డీలు, నాణేలు, నగల కొనుగోళ్లకు అన్ని వర్గాలవారు ఆసక్తి కనబర్చారు.

వెండి ధర అక్కడే..
మార్కెట్‌లో బంగారం ధరలు దూసుకుపోతే.. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. సోమవారం కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.83,500 వద్దే ఉన్నది. అయినప్పటికీ గడిచిన 10 రోజుల్లో రూ.4,500 పెరగడం గమనార్హం. కాగా, ఢిల్లీలో రూ.80,200గా ఉన్నది. సాధారణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమల నుంచీ డిమాండ్‌ ఉండటంతో ఇన్ని రోజులూ ధరలు పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. అయితే ధరలు స్థిరంగా ఉంటేనే వ్యాపారం ఎక్కువగా అవుతుందని, ఒడిదుడుకుల్లో సాగితే కొనుగోలుదారులు వేచిచూసే ధోరణినే అవలంభిస్తారని, అప్పుడు అమ్మకాలు ఉండబోవని అంటున్నారు. ధరల్లో స్థిరత్వం చోటు చేసుకుంటే కొనుగోలుదారులనుంచి మళ్లీ డిమాండ్‌ రావచ్చన్నారు.

గ్లోబల్‌ మార్కెట్‌లో..
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 2,077 డాలర్లకు చేరింది. సిల్వర్‌ రేటు 25.40 డాలర్లు పలికింది. ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకం విలువ, వడ్డీరేట్లపై ఫెడరల్‌ రిజర్వ్‌ వైఖరి ఇన్వెస్టర్లను అమితంగా ప్రభావితం చేస్తున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు కొమెక్స్‌లోనూ స్పాట్‌ గోల్డ్‌ రేటు 6 డాలర్లు పెరిగి 2,077 డాలర్లుగా నమోదైంది. అయితే సోమవారం ట్రేడింగ్‌లో ఒకానొక దశలో ఏకంగా 2,146 డాలర్లను తాకి సరికొత్త ఆల్‌టైమ్‌ హై రికార్డును నెలకొల్పడం విశేషం. మిడిల్‌ ఈస్ట్‌లో రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతుండటమే ఇందుకు కారణమని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరుగవచ్చంటున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z