DailyDose

భజరంగ్ పునియా సంచలన నిర్ణయం

భజరంగ్ పునియా సంచలన నిర్ణయం

భారత ప్రముఖ రెజ్లర్ భజరంగ్ పునియా కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు అతడు ప్రధాని మోదీకి లేఖ రాశాడు. ఇటీవల రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విధేయుడు సంజయ్ సింగ్‌ విజయం సాధించడంతో రెజ్లర్లు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో భజరంగ్ పునియా కూడా నిరసన తెలుపుతూ తన పద్మశ్రీని వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కాగా మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గతంలో బ్రిజ్‌భూషణ్ శరణ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై భారత రెజ్లర్లు దేశ రాజధాని ఢిల్లీలో కూడా నిరసన చేపట్టారు. తాజాగా ఇటీవల బ్రిజ్‌భూషణ్ శరణ్‌కు సహాయకుడు సంజయ్ సింగ్‌కు ఎక్కువ మద్దతు లభించడంతో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికల్లో విజయం సాధించడం మహిళా రెజ్లర్లకు నచ్చలేదు. దీంతో మహిళా రెజ్లర్లకు న్యాయం జరగకపోవడంతో తనకు వచ్చిన ప్రతిష్టాత్మక అవార్డును వెనక్కి ఇస్తున్నానని భజరంగ్ పునియా తన లేఖలో పేర్కొన్నాడు.

భజరంగ్ పునియా పోస్ట్‌లోని సారాంశం

ప్రియమైన ప్రధాని జీ, మీ ఆరోగ్యం బాగానే ఉందని ఆశిస్తున్నాను. మీరు పనిలో చాలా బిజీగా ఉంటారు. కానీ దేశంలోని రెజ్లర్లకు ఎలాంటి అన్యాయం జరుగుతుందో మీ దృష్టికి తెచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నా.. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ దేశంలోని మహిళా రెజ్లర్లు ఈ ఏడాది జనవరిలో నిరసనకు దిగిన విషయం మీకు కూడా తెలుసు. నేను కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నా. ఆ సమయంలో ప్రభుత్వం న్యాయం చేస్తామని చెప్పడంతో నిరసనలు ఆగిపోయాయి. అయితే మూడు నెలల తర్వాత కూడా బ్రిజ్ భూషణ్‌పై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. ఢిల్లీ పోలీసులు కనీసం అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఏప్రిల్‌లో మళ్లీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టాం. జనవరిలో 19 మంది ఫిర్యాదు చేయగా, ఏప్రిల్ నాటికి వారి సంఖ్య 7కి తగ్గింది. దీని అర్థం బ్రిజ్ భూషణ్ కొందరు రెజ్లర్లను బెదిరించారు. మిగిలిన 12 మంది రెజ్లర్లను నిరసనలు చేపట్టవద్దని ఆయన బలవంతం చేశారు’ అంటూ భజరంగ్ పునియా ప్రధాని మోదీకి రాసిన లేఖలో ప్రస్తావించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z