Business

జియో సరికొత్త ఆఫర్-వాణిజ్య వార్తలు

జియో సరికొత్త ఆఫర్-వాణిజ్య వార్తలు

*  జియో సరికొత్త ఆఫర్

కొత్త సంవత్సరంలో అడుగుపెట్టనున్న తరుణంలో ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెట్టింది. ఏడాది కాలపరిమితితో ఉన్న రీఛార్జ్‌ ప్లాన్‌పై ‘హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ 2024’ (Happy New Year Offer 2024) పేరిట అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. జియో ప్రీపెయిడ్‌ ప్లాన్‌ (Jio Prepaid Plan) యూజర్లకు ఈ ఆఫర్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. లాంగ్‌ టర్మ్‌ ప్లాన్‌ కోసం ఎదురు చూస్తున్న వారు ఈ ప్లాన్‌ వివరాలపై ఓ లుక్కేయండి.ఇప్పటికే జియో అందిస్తున్న రూ.2,999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రీఛార్జితో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్‌కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 912 జీబీ డేటా అందిస్తోంది. అయితే జియో తీసుకొచ్చిన న్యూ ఇయర్‌ ఆఫర్‌లో భాగంగా రీఛార్జ్‌ చేసుకుంటే 24 రోజుల అదనపు వ్యాలిడిటీ పొందొచ్చు. అంటే మొత్తం 389 రోజులు ఈ ప్లాన్‌ని వినియోగించుకోవచ్చన్నమాట. దీంతో పాటూ జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా ఏడాది పాటూ ఉచితంగా వీక్షించవచ్చు.

2000 కోట్లు ఖర్చు చేస్తాం!

మహీంద్రా హాలిడేస్ అండ్ రిసోర్ట్స్‌‌‌‌ తన బిజినెస్‌‌‌‌ను మరింతగా విస్తరించాలని చూస్తోంది. రూమ్స్‌‌‌‌ సంఖ్యను పెంచాలనుకుంటోంది. ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2,000 కోట్లు ఖర్చు చేయనుంది.  ‘రిసోర్ట్‌‌‌‌లలోని రూమ్‌‌‌‌లను పెంచాలని చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న 5,000 నుంచి 10 వేలకు వచ్చే ఆరేళ్లలో పెంచుతాం. వచ్చే  రెండేళ్లలో 639 కొత్త రూమ్‌‌‌‌లను అందుబాటులోకి తీసుకురావడానికి  రూ.835 కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నాం. మొత్తంగా 2024–25 లో రూ.2,000 కోట్లు ఖర్చు చేస్తాం’ అని కంపెనీ ఎండీ కవిందర్ సింగ్ వెల్లడించారు. రూమ్‌‌‌‌లలో దిగేవారు  పెరిగారని, ఆక్యుపెన్సీ రేషియో 84–85 శాతానికి చేరుకుందని చెప్పారు.  ఈ నెంబర్ 90 శాతానికి చేరుకుంటుందని అంచనా వేశారు.

స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో 55 శాతం రిట‌ర్న్స్‌

ప్రతి ఒక్కరూ తమ కుటుంబ భవిష్యత్ అవసరాలు, పిల్లల చదువులు, పెండ్లిండ్ల కోసం పొదుపు చేస్తుంటారు. అటువంటి పొదుపు పథకాల్లో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. స్టాక్ మార్కెట్ల ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు రిస్క్ ఉన్నా రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయి. ఈ ఏడాది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై మదుపర్లకు 55 శాతానికి పైగా రిటర్న్స్ లభించాయి. ఉదాహరణకు మీరు ఈ ఏడాది ప్రారంభంలో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.లక్ష పెట్టుబడి పెట్టారనుకుందాం. ఇప్పడది సుమారు రూ.1.50 లక్షలకు చేరుకుంది.మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపుపై 45 శాతానికి పైగా, మల్టీ క్యాప్ ఫండ్స్ మీద 40 శాతానికి పై చిలుకు, ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపైన సుమారు 40 శాతం, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో నిధుల మదుపుపై 30 శాతానికి పైగా రిటర్న్స్ లభించాయి.దేశీయ స్టాక్ మార్కెట్లపై ఓ లుక్కేద్దాం.. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 16 శాతానికి పైగా గ్రోత్ నమోదు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో సెన్సెక్స్ 61 వేల పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభిస్తే.. ఇప్పుడు 71,106 పాయింట్ల వద్ద ముగిసింది. ఏడాది కాలంలో సెన్సెక్స్ 10 వేల పాయింట్లు పెరిగింది. స్టాక్ మార్కెట్లలో స్టాక్స్ గ్రోత్ తో పోలిస్తే, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు అధిక రిటర్న్స్ ఇస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ వైవిధ్యభరితమైన మ్యూచువల్ ఫండ్స్.. స్మాల్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ లేదా లార్జ్ క్యాప్ పేరుతో ఏర్పాటు చేసే ‘ప్యాకేజీ’ ఫండ్స్. ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థలో మనం పెట్టే పెట్టుబడులను ఫండ్ మేనేజర్.. 25 శాతం స్మాల్ క్యాప్, మరో 25 శాతం మిడ్ క్యాప్, 25 శాతం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. మిగతా 25 శాతం పెట్టుబడులను ఫండ్ మేనేజర్ తన వెసులుబాటును బట్టి ఆయా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు.కంపెనీల వారీగా సింగిల్ ఫండ్ లోనూ పెట్టుబడి పెట్టొచ్చు. ఫ్లెక్సీ ఫండ్స్‌లో మదుపర్ల పెట్టుబడులను వారి చాయిస్‌ను బట్టి స్మాల్ లేదా మిడ్ లేదా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడతారు. దేశంలోని కంపెనీలను మూడు రకాలుగా విభజించారు. రూ.5000 కోట్ల లోపు మార్కెట్ క్యాపిటలైజేషన్ గల కంపెనీలను స్మాల్ క్యాప్, రూ.5000-20 వేల కోట్ల మధ్య ఎం-క్యాప్ గల సంస్థలను మిడ్ క్యాప్ కంపెనీలు అని పరిగణిస్తారు. రూ.20 వేల కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ గల సంస్థలను లార్జ్ క్యాప్ సంస్థలు అని చెబుతారు. దేశంలోని మొత్తం కంపెనీల్లో టాప్ 100 కంపెనీలు లార్జ్ క్యాప్, 100-250 కంపెనీలు మిడ్ క్యాప్ కంపెనీలుగా, మిగతా కంపెనీలను స్మాల్ క్యాప్ కంపెనీలుగా పరిగణిస్తారు.

డిస్నీ ఒప్పందం వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందా?

గత కొన్ని నెలలుగా చర్చలో ఉన్న రిలయన్స్, డిస్నీ ఒప్పందం వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. భారత మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వాల్ట్‌ డిస్నీకి చెందిన డిస్నీ ఇండియాకు చెందిన ఈ విలీనానికి సంబంధించి గతవారం లండన్‌లో నాన్-బైండింగ్ టర్మ్ షీట్‌లో ఇరు సంస్థలు సంతకం చేసినట్టు సమాచారం. రిలయన్స్ సంస్థకు మెజారిటీ వాటా లభించే అవకాశం ఉన్న జాయింట్ వెంచర్ గురించి ఇరు కంపెనీలు ఇటీవల చర్చలు నిర్వహించాయి.చర్చలు సఫలమైతే ఈ జాయింట్ వెంచర్ భారత మీడియా రంగంలోనే అతిపెద్దది కానుంది. తద్వారా రిలయన్స్ ఆధ్వర్యంలోని సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడనుంది. ఇరు సంస్థల మధ్య ఏర్పడబోయే జాయింట్ వెంచర్ రిలయన్స్‌కు మెజారిటీ వాటాతో 51:49 శాతం స్టాక్ అండ్ క్యాష్ కన్సాలిడేషన్ కొత్త ఏడాది ఫిబ్రవరి నాటికి ముగుస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

టాటా మోటార్స్ హారియర్ సఫారి కొత్త వెర్షన్‌లను విడుదల

టాటా మోటార్స్ ఇటీవలే హారియర్, సఫారితో సహా తన రెండు ప్రీమియం SUVల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను విడుదల చేసింది. కంపెనీ నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ను కూడా ఆవిష్కరించింది. తాజాగా టాటా మోటార్స్ తన ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ – హారియర్, సఫారీలలో వినియోగిస్తున్న కొత్త పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌ను అభివృద్ధి చేస్తోందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మోడల్స్ ప్రస్తుతం ఈ రెండు వేరియంట్లలో 2-లీటర్ల డీజిల్ ఇంజన్‌ను వినియోగిస్తున్నారు. అయితే రాబోయే రెండు, మూడేళ్లలో కొత్త పెట్రోల్ ఇంజిన్ అందుబాటులోకి వస్తుందని అధికారి తెలిపారు.ఈ ప్రీమియం ఎస్‌యూవీ రేంజ్ కార్లు ఏడాదికి 2 లక్షల యూనిట్ల వరకు అమ్ముడవుతున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర చెప్పారు. ఇందులో 80శాతం డీజిల్ వెహికిల్సేనన్నారు. డీజిల్ ఇంజిన్ పై దృష్టి సారిస్తూనే.. మార్కెట్ 20శాతం డిమాండ్ ఉన్న  ఎస్‌యూవీల్లో పెట్రోల్ ఇంజిన్ చేయాలనే విషయాన్ని తేలిగ్గా తీసుకోలేమని చెప్పారు. దీని కోసమే 1.5లీ. జీడీఐ(గ్యాసోలిన్ డెరెక్ట్ ఇంజక్షన్) ఇంజిన్ ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.ఇటీవలే టాటా మోటార్స్ హారియర్, సఫారి కొత్త వెర్షన్‌లను విడుదల చేసింది. దీని ధర వరుసగా రూ. 15.49 లక్షలు, రూ. 16.19 లక్షలు. ఈ రెండూ కూడా ప్రయాణికుల రక్షణలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ పొందాయి. కారులో ప్రయాణించే పెద్దలు, పిల్లల రక్షణ విషయంలో భారత్‌ న్యూ కార్‌ అసెస్మెంట్‌ ప్రోగ్రామ్‌ కింద ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ పొందిన తొలి ఎస్‌యూవీలు కూడా ఇవే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z