Editorials

విజయవాడలో కిటకిటలాడిన 34వ పుస్తక మహోత్సవం

విజయవాడలో కిటకిటలాడిన 34వ పుస్తక మహోత్సవం

నూతన సంవత్సర ప్రారంభోత్సవం నేపథ్యంలో పుస్తక ప్రియులతో విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న 34వ పుస్తక మహోత్సవం సోమవారం కిటకిటలాడింది. ఒకే ద్వారం నుంచి వాహనాలకు అనుమతి ఇవ్వడంతో సమస్యలు తలెత్తాయి. యువత ఎక్కువ మంది పుస్తక మహోత్సవానికి వచ్చి ఏ ఏ స్టాళ్లల్లో ఎటువంటి పుస్తకాలు ఉన్నాయో తిలకించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో వచ్చి ఉత్సాహంగా కొనుగోళ్లు చేశారు. సాహితీ ప్రియులు, పుస్తక రచయితలు, శ్రేయోభిలాషులు, పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. శాస్త్ర విజ్ఞానం, వినోదం, ఆహ్లాదం, సైన్స్‌, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, నవలల స్టాళ్ల వద్ద రద్దీ కనిపించింది. ప్రదర్శన జనవరి 7వ తేదీ వరకు ఉంటుంది.

సమాజ గతి మార్చాలంటే పుస్తక పఠనం ఎంతో అవసరమని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి.సిసోడియా అన్నారు. పుస్తక మహోత్సవంలో భాగంగా ఆదివారం పుస్తక ప్రియుల పాదయాత్రను మొగల్రాజపురం సిద్ధార్థ ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఆర్‌.పి.సిసోడియా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. విద్యావేత్త పరిమి పాదయాత్రకు నాయకత్వం వహించారు. పాదయాత్ర పాత 5వ నెంబరు రూటు మీదుగా జాతీయ రహదారి సర్వీస్‌ రోడ్డు నుంచి పాలిటెక్నిక్‌ కళాశాలకు చేరుకుంది. ప్రాంగణంలోని కేతు విశ్వనాథరెడ్డి సాహితీ వేదికపై నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఇంతియాజ్‌ అహ్మద్‌ హాజరై మాట్లాడారు. సమాజాన్ని మార్చాలంటే పుస్తకాలు చదవాలని సూచించారు. ప్రతి వ్యక్తికి సమాజంపై తనదైన ముద్ర వేయాలని, మార్పులు తేవాలని ఉంటుందని, కానీ ఆయా ఆకాంక్షలను నిజం చేసుకోవాలంటే మార్గదర్శనం మంచి పుస్తకాలతోనే లభిస్తుందని అన్నారు. తాను ఐఏఎస్‌ కావడానికి పుస్తకాల చదివే అలవాటు ఉండటమే ప్రధాన కారణమన్నారు. పుస్తకాలు చదివే అలవాటు చేసుకుంటే తాము కోరుకున్నట్లు పిల్లల జీవితాలను తీర్చిదిద్దుకోవచ్చని అన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ మాట్లాడుతూ.. పుస్తకాలున్న ఇల్లు విద్యాభివృద్ధికి నిలయం అవుతుందని పేర్కొన్నారు. పిల్లలకు, పుస్తకాలకు ఉన్న అనుబంధం మార్కులకు, హోం వర్కులకు ముడిపెట్టకూడదని సూచించారు. పుస్తకం… జ్ఞానానికి ప్రధాన మాధ్యమంగా ఉండాలని అన్నారు. జాషువా, శ్రీశ్రీ తదితరుల రచనలు, మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ లాంటి మహనీయుల జీవితాలను అధ్యయనం చేయాలని చెప్పారు. విద్యావేత్త పరిమి మాట్లాడుతూ… కనీసం ప్రాథమిక పాఠశాల స్థాయి వరకు మాతృభాష లేకపోవడం తెలుగు పిల్లల దురదృష్టమని అన్నారు. పుస్తకాల మహోత్సవాల నిర్వహణ వల్ల పిల్లలకు పుస్తకాలతో అనుబంధం పెంచుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. 34 ఏళ్లుగా నిర్విరామంగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్న సంఘ సభ్యులను అభినందించారు. సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట నారాయణ మాట్లాడుతూ చరవాణుల జోరు పెరిగి రోజురోజుకూ పుస్తక ప్రియుల సంఖ్య తగ్గడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వాలు, మేధావులు ఈ సమస్యను పట్టించుకోవాలని కోరారు. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ నిర్వాహకులు మనోహర్‌ నాయుడు, విజయ్‌ కుమార్‌, లక్ష్మయ్య పాల్గొన్నారు. అనంతరం ఎవరికి నచ్చిన పుస్తకం గురించి వారు క్లుప్తంగా వేదికపై వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z