Agriculture

డిసెంబరులో గణనీయంగా పెరిగిన వర్షపాతం

డిసెంబరులో గణనీయంగా పెరిగిన వర్షపాతం

రాష్ట్రంలో మిగ్‌జాం తీవ్ర తుపాను ప్రభావంతో గతేడాది డిసెంబరులో వర్షపాతం గణనీయంగా పెరిగింది. సాధారణం కంటే 383% అధికంగా నమోదైంది. అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో సాధారణం కంటే 2,814% పెరగడం గమనార్హం. నంద్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం ఉంటే.. కర్నూలు జిల్లాలో 57% లోటు నమోదైంది. తుపాను ప్రభావంతో డిసెంబరు 2 నుంచి వానలు, అధిక వేగంతో గాలులు మొదలయ్యాయి. 8వ తేదీ వరకు 19 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో 22 జిల్లాల్లో సుమారు 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా.

కోస్తాలో 521% ఎక్కువ
తీవ్ర తుపాను ప్రభావం కోస్తా జిల్లాల్లో అధికంగా ఉంది. ఇక్కడ డిసెంబరులో సాధారణ వర్షపాతం 27.6 మి.మీ. కాగా, 171.4 మి.మీ. కురిసింది. ఇది సాధారణం కంటే 521% అధికం. రాయలసీమలో సాధారణ వర్షపాతం 25.9 మి.మీ. ఉంటే, 83.2 మి.మీ. నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో అత్యధికం, శ్రీసత్యసాయి జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. 9 జిల్లాల్లో సాధారణం కంటే 1,000 శాతానికి పైగా అధికంగా వర్షాలు కురిశాయి.