Sports

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత షూటర్‌

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత షూటర్‌

హరియాణా షూటర్‌ రిథమ్‌ సాంగ్వాన్‌ (Rhythm Sangwan) అదరగొట్టింది. పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు సొంతం చేసుకుంది. సాంగ్వాన్‌ గురువారం ఆసియా క్వాలిఫయర్స్‌ మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌లో కాంస్య పతకం సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంగ్రామంలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. 20 ఏళ్ల రిథమ్ సాంగ్వాన్‌కు ఆసియా క్వాలిఫయర్స్‌లో ఇది మూడో పతకం. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో కాంస్య పతకం సాధించిన ఆమె.. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో అర్జున్‌ చీమాతో కలిసి రజత పతకం అందుకుంది.

రిథమ్‌ సాంగ్వాన్‌ అర్హతతో భారత్‌ నుంచి పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడే షూటర్ల సంఖ్య 16కి చేరింది. మిగతా క్వాలిఫయర్స్‌ పోటీల అనంతరం ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. భారత్‌ తరఫున అత్యధికంగా టోక్యో ఒలింపిక్స్‌లో 15 మంది షూటర్లు బరిలో దిగారు. జకార్తాలో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్‌లోనే ఇషా సింగ్, వరుణ్‌ తోమర్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో బంగారు పతకాలు సాధించి పారిస్ ఒలింపిక్స్‌ బెర్తులను ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z