Agriculture

అవగాహన పెంచుకోకుంటే అంతరించిపోతాం!

అవగాహన పెంచుకోకుంటే అంతరించిపోతాం!

గతడాది జూలైలో తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మోరంచలో జరిగిన విషాదం గుర్తుందా. 300 గడపలు.. 700 మంది ప్రజలు నివసిస్తున్న చిన్న ఊరును అర్ధరాత్రి వరద ముంచెత్తింది. చరిత్రలో కనీవినీ ఎరుగనంత కుండపోత వర్షం ఆ ప్రాంతంలో పడటంతో చెరువులు తెగి, వాగులు పొంగి.. మోరంచను తుడిచిపెట్టేసింది. మనుషులు, జంతువుల ప్రాణాలను బలితీసుకుంది. ఒక్క రోజులోనే ఊరు మొత్తం అనాథ అయ్యింది.

‘ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మారే జీవులే మనుగడ సాగిస్తాయి.. లేదంటే అంతరించిపోతాయి’.. డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంత సారాంశం ఇది. ప్రస్తుతం పర్యావరణ మార్పులతో కలుగుతున్న విపరీత పరిణామాలకు గుల్మార్గ్‌, మోరంచపల్లి ఘటనలు కేవలం కొన్ని ఉదాహరణలు. ఇలాంటి విపరీత పరిణామాలు ఇంకా ఎన్నో జరుగుతున్నాయి, మరెన్నో జరుగబోతున్నాయి. వీటిని తట్టుకునేందుకు మనం సిద్ధంగా ఉంటేనే మనుగడ సాధ్యమవుతుంది. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇలా అంతరించిపోయిన జాతుల సంఖ్య దాదాపు 500 కోట్లు. ఇప్పుడు సుమారు 90 లక్షల జీవజాతులు మాత్రమే భూమిపై మనుగడ సాగిస్తున్నాయి.

మార్పును గుర్తించాలి..
భూతాపం కారణంగా ఎండాకాలం, వానకాలం, శీతాకాలం మధ్య ఉండే విభజన చెరిగిపోతున్నది. ఎండాకాలంలో వానలు కురుస్తున్నాయి. వానలు దంచికొడతాయనుకొనే జూలై, ఆగస్టులో వడగాడ్పులు కనిపిస్తున్నాయి. చలితో వణకాల్సిన డిసెంబర్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజా నివేదిక ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 1.48 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మేర పెరిగాయి. ఇది మానవ చరిత్రలోనే అత్యధిక పెరుగుదల. ‘అత్యంత వేడి సంవత్సరంగా’ 2023 రికార్డు నెలకొల్పింది.

అంచనా ఒకలా.. జరిగేది మరోలా
పర్యావరణ మార్పులతో కలిగే ప్రకృతి విపత్తులతో ప్రజల జీవన స్థితిగతులు తీవ్రంగా ప్రభావితం అవుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతేడాది వానకాలంలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తాయని అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు అంచనా వేశారు. కానీ ఊహకందని విధంగా వడగాడ్పులు దేశవ్యాప్తంగా వందల మందిని బలిగొన్నాయి. ప్రభుత్వాలు గానీ, ప్రజలుగానీ సిద్ధంగా లేకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఇలాంటి పరిస్థితుల్లో పంట ఉత్పత్తులు, ఆదాయ వనరులు దెబ్బతింటాయి.

అందరం సిద్ధం కావాలి..
పర్యావరణ మార్పులతో ఇప్పటికే జరుగుతున్న విపరీత పరిణామాలను ప్రభుత్వాలతోపాటు ప్రజలు క్షుణ్ణంగా గమనించాల్సిందే. ప్రకృతి విపత్తులు ఇబ్బంది పెట్టినా ప్రజలను ఆదుకునేలా ఆహార ధాన్యాల నిల్వలు, వైద్య వ్యవస్థ బలోపేతం, మౌలిక వసతుల పటిష్ఠం చేయడం వంటివాటిపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వాల సలహాలు, సూచనలు ప్రజలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు. లేదంటే మన చేతితో మనమే ‘మరణ శాసనం’ రాసుకున్నట్టు అవుతుందని హెచ్చరిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z