Politics

ఆ హక్కు నాదే

ఆ హక్కు నాదే

ఖమ్మం ఎంపీ సీటు అడిగే హక్కు తనకు మాత్రమే ఉందని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి స్పష్టం చేశారు. ఖమ్మం సంజీవరెడ్డి భవన్‌లో ఆమె గురువారం మాట్లాడారు. తాను సీటు అడిగితే కాదని చెప్పేవారు ఎవరూ లేరని ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని అందరం మనస్ఫూర్తిగా అడిగామని చెప్పారు. ఆమె తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఎంతో శుభసూచకమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఖమ్మం లోక్‌సభ స్థానం సోనియాగాంధీకి రిజర్వు చేశామని, మిగతాది ఆమె నిర్ణయంపై ఆధారపడి ఉందన్నారు. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసుకున్న అంతా వట్టిదేనని కొట్టిపారేశారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా 20 ఏళ్లు ఉంటారని పేర్కొన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలను సైతం దిల్లీ దాకా తీసుకువెళ్లానని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అక్రమాలపై కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని కొనియాడారు. పువ్వాడ అజయ్‌కుమార్‌ తన సహకారంతోనే ఎదిగారని తెలిపారు. భద్రాచలం రామాలయ సమస్యలు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రామాయణంలో ఖమ్మం జిల్లా పాత్ర తెలియకుండా భాజపా మూర్ఖంగా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. అయోధ్య రామాలయం పూర్తికాకుండానే రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తుండటం బాధాకరమని చెప్పారు. జనవరి 22 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. సమావేశంలో మానుకొండ రాధాకిశోర్‌, కట్ల రంగారావు, వడ్డెబోయిన నరసింహారావు, నాగండ్ల దీపక్‌ చౌదరి, రామ్మూర్తినాయక్‌, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.