Business

సోమవారం నుండి అందుబాటులోకి బంగారం బాండ్స్-వాణిజ్య వార్తలు

సోమవారం నుండి అందుబాటులోకి బంగారం బాండ్స్-వాణిజ్య వార్తలు

* JSW గ్రూప్‌ ఒడిశా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కటక్‌, పారాదీప్‌లలో ఎలక్ట్రిక్‌ వాహనాల, బ్యాటరీల తయారీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి రూ.40 వేల కోట్ల విలువైన ఒప్పందాలపై ఈ రోజు సంతకం చేసింది. ఎలక్ట్రిక్‌ వాహనాల, బ్యాటరీల తయారీ కాంప్లెక్స్‌ కోసం కటక్‌లో రూ.25 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది. మిగిలిన రూ.15 వేల కోట్లను పారాదీప్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల విడిభాగాల తయారీ కేంద్రంలో పెట్టుబడి పెట్టనుంది. ప్రాజెక్ట్‌లో 50గిగా వాట్స్‌ EV బ్యాటరీ ప్లాంట్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, లిథియం రిఫైనరీ, కాపర్‌ స్మెల్టర్‌, సంబంధిత కాంపోనెంట్‌ తయారీ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్ల వల్ల రాష్ట్రంలో 11 వేల ఉద్యోగాలు లభిస్తాయిని, ఈ ప్రాజెక్ట్‌ అనుబంధ, సహాయక సర్వీసెస్‌లో పరోక్షంగా ఎన్నో వేల మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

* దేశీయంగా ఎంతో ఆదరణ చూరగొన్న పసిడి బాండ్లు (Sovereign gold bonds) మరోసారి సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. ఫిబ్రవరి 12 (సోమవారం) నుంచి 16వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సబ్‌స్క్రిప్షన్‌ అందుబాటులో ఉంటుంది. ఒక్కో గ్రాము ధరను రూ.6,263గా ఆర్‌బీఐ నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వస్తున్న నాలుగో సిరీస్‌ (2023-24 సిరీస్‌ IV) ఇది. ఈ ఏడాది జూన్‌, సెప్టెంబర్, డిసెంబర్‌లో మూడు విడతలుగా బాండ్లను విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ ఇస్తారు. అంటే ఒక్కో గ్రాము రూ.6,213కే లభిస్తుంది.

* సాధారణ ఎ‍న్నికల వేళ రాజకీయ నేతలకు సోషల్‌ మీడియా దిగ్గజం మెటా (Meta) షాకిచ్చింది. తమ ఇన్‌స్టాగ్రామ్ (Instagram), థ్రెడ్స్‌ (Threads) ప్లాట్‌ఫామ్స్‌లో ఇకపై పొలిటికల్‌ కంటెంట్‌ను రికమెండ్‌ చేయబోమని ప్రకటించింది. అంతేగాక ఫేస్‌బుక్‌లో కూడా త్వరలో అవాంఛిత పొలిటికల్‌ కంటెంట్‌కి కళ్లెం వేస్తామని చెబుతోంది. కాగా, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, థ్రెడ్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని అరికట్టడానికి ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ అయిన మెటా ఇప్పటికే కృషి చేస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాధనాలతో రూపొందించిన చిత్రాలను గుర్తించడానికి ఇటీవల ప్రయత్నాలను విస్తరించింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో పొలిటికల్‌ కంటెంట్‌ను రికమెండ్‌ చేయబోమని ప్రకటిచింది. అయితే రాజకీయ కంటెంట్‌ను ఇష్టపడేవారికి మాత్రం ఏ ఇబ్బంది ఉండదని మెటా తెలిపింది. అలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేసే ఖాతాలను అనుసరించే వారికి తాము ఏ మాత్రం అడ్డు రాబోమని స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్‌ ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతి కావాలని తాము కోరుకుంటున్నాని, అందుకే ఫాలోకాని అకౌంట్ల నుంచి రాజకీయ కంటెంట్‌ను ముందస్తుగా సిఫార్సు చేయబోమని చెప్పింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా హెడ్‌​ ఆడమ్ మోస్సేరి కూడా థ్రెడ్స్‌ పోస్ట్‌ చేశారు.

* Yamaha FZ-X Chrome Edition | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) ప్రైవేట్ లిమిటెడ్.. దేశీయ మార్కెట్లోకి తన క్రూయిజ్ మోటారు సైకిల్ క్రోమ్ కలర్ ఎడిషన్ ను ఆవిష్కరించింది. దీని ధర రూ.1.40 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ షో-2024లో దీన్ని ఆవిష్కరించారు. ట్రాక్షన్ కంట్రోల్ తరహా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. న్యూ కలర్ ఆప్షన్ మినహా బైక్ డిజైన్, ఫీచర్లు, డైమన్షన్లలో ఎటువంటి తేడాలు లేవు. క్రోమ్ మోడల్ యమహా ఎఫ్‌జడ్-ఎక్స్ బైక్.. మ్యాట్టె టైటాన్, డార్క్ మ్యాట్టె బ్లూ, మెటాలిక్ బ్లాక్, మ్యాట్టె కాపర్ కలర్ ఆప్షన్లలోనూ లభిస్తుంది. ఎఫ్ జడ్-ఎక్స్ క్రోమ్ కలర్ బైక్‌ను తొలుత ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న 100 మంది కస్టమర్లకు డెలివరీ టైంలో ‘కాషియో జీ-షాక్ వాచ్’ ఉచితంగా అందజేస్తారు. యమహా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రూ.2000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. స్టాక్ లభ్యత ఆధారంగా మోటారు సైకిళ్లు 45 రోజుల్లోపు డెలివరీ చేస్తామని యమహా తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z