DailyDose

“నారాయణ”లో కొనసాగుతున్న ఆత్మహత్యలు-నేరవార్తలు

“నారాయణ”లో కొనసాగుతున్న ఆత్మహత్యలు-నేరవార్తలు

* పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని గౌరెడ్డిపేట‌లో విషాదం నెల‌కొంది. క‌లుషిత ఆహారం తిని ఇద్ద‌రు కూలీలు మృతి చెందారు. మ‌రో 17 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వారి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో, చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న వారిలో న‌లుగురు కూలీల ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. బాధితులంతా ఇటుక బ‌ట్టీల్లో ప‌ని చేస్తున్న కార్మికులు. కూలీల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌ను అధికారులు ఆదేశించారు. కార్మికుల పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

* తన కూతురు ఒక అబ్బాయితో మాట్లాడటం చూసిన ఆమె తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు. బంధువుతో కలిసి కుమార్తె గొంతు నొక్కి నదిలోకి తోసేశాడు. (Teenager Thrown Into River) ఆ యువతి కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను రక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అలీగఢ్‌కు చెందిన 16 ఏళ్ల యువతి 9వ తరగతి చదువుతున్నది. ఒక అబ్బాయితో ఆమె మాట్లాడటాన్ని తండ్రి చూశాడు. అనంతరం కుమార్తెకు పెళ్లి చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె తిరస్కరించడంతో చంపాలని ప్లాన్‌ వేశాడు. కాగా, గురుగ్రామ్‌లో పని చేసే తండ్రి అక్కడికి తీసుకెళ్తానని చెప్పి కుమార్తెను బైక్‌పై ఎక్కించుకున్నాడు. సమీప గ్రామంలోని యమునా నదిపై ఉన్న బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న బంధువుతో కలిసి కూతుర్ని హత్య చేసేందుకు తండ్రి ప్రయత్నించాడు. వారిద్దరూ ఆమె గొంతు నొక్కి బ్రిడ్జీ పైనుంచి నదిలోకి తోసి పారిపోయారు. మరోవైపు యమునా నదిలో పడిన ఆ యువతి తనను రక్షించాలని కేకలు వేసింది. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే నది ఒడ్డున ఉన్న ఈతగాళ్ల సహాయంతో ఆ అమ్మాయిని కాపాడారు. జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించిన తండ్రి, బంధువుపై కేసు నమోదు చేశారు. వారిద్దరిని అరెస్ట్‌ చేసేందుకు వెతుకుతున్నారు. ఆ యువతిని షెల్టర్‌ హోమ్‌కు తరలించారు.

* నారాయణ విద్యాసంస్థల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. మాదాపూర్‌ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినయ్‌ అనే విద్యార్థి తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. శ్రీకాళహస్తికి చెందిన వినయ్‌ మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో ఐఐటీ లాంగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఐఐటీ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* ఇంజెక్షన్‌ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లల విభాగంలో మొత్తం 15 మందికి చికిత్స ఇస్తున్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి ఇంజెక్షన్‌ చేశారు. అర గంట తర్వాత చిన్నారులకు విపరీతమైన చలి జ్వరం రావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వీరిలో ఏడుగురిని ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z