Politics

రెండ్రోజుల్లో తెదేపా-భాజపా సీట్లపై స్పష్టత-NewsRoundup-Mar 10 2024

రెండ్రోజుల్లో తెదేపా-భాజపా సీట్లపై స్పష్టత-NewsRoundup-Mar 10 2024

* ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి పాల్పడితే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై అమెరికా 2022లోనే పూర్తి స్థాయి కసరత్తు చేసింది. ఈ క్రమంలో భారత్, చైనా అధినేతల ప్రకటనలు కూడా అణుసంక్షోభ నివారణకు సాయపడ్డాయి. ఈ విషయాన్ని బైడెన్‌ కార్యవర్గానికి చెందిన ఇద్దరు అధికారులు ఓ ఆంగ్ల వార్తా సంస్థకు వెల్లడించారు. వాస్తవానికి మాస్కో టాక్టికల్‌ అణుబాంబును ప్రయోగించే అవకాశాలున్నాయని వాషింగ్టన్‌ బలంగా విశ్వసించింది. ఈ విషయాన్ని జిమ్‌స్కాటో అనే జర్నలిస్టు తన పుస్తకం ‘ది రిటర్న్‌ ఆఫ్‌ గ్రేట్‌ పవర్‌’లో ప్రస్తావించారు. ముఖ్యంగా కొన్ని అంచనాలు.. సమాచారం విశ్లేషించిన తర్వాత వాషింగ్టన్‌ ఈ నిర్ణయానికి వచ్చిందని పేర్కొన్నారు. ఖేర్సాన్‌లో రష్యా ఎదురు దెబ్బలు తింటున్న వేళ అణుదాడి జరగవచ్చని వాషింగ్టన్‌ భావించింది. ఈ ప్రాంతాన్ని తమ భూభాగంలోనిదిగా అప్పటికే మాస్కో ప్రకటించడంతో పుతిన్‌ ఈ దాడికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వొచ్చనుకొన్నారు. ఆ సమయంలో తమ దాడికి అవసరమైన సాకు కూడా దానికి దొరికినట్లు భావించారు. దీనికి తగ్గట్లే ఉక్రెయిన్‌ డర్టీబాంబ్‌ కోసం యత్నిస్తోందని క్రెమ్లిన్‌ వర్గాలు తరచూ ఆరోపణలు చేయడం మొదలుపెట్టాయి. మరోవైపు రష్యా భారీ అణ్వాయుధాలు తరలిస్తే.. అమెరికా తేలిగ్గా పసిగట్టేస్తుంది. అదే చిన్న సైజు టాక్టికల్‌ అణుబాంబులు తరలిస్తే గుర్తించడం అత్యంత కష్టం. ఈ నేపథ్యంలో వాటిని మాస్కో వాడే అవకాశాలున్నాయని ఆందోళన చెందింది. దీంతో అమెరికా వర్గాలు నేరుగా తమ భయాలను రష్యాకు తెలియజేశాయి. అదే సమయంలో తన సహచర దేశాలతో కలిసి ఈ దాడిని నివారించేందుకు ప్లాన్‌ను సిద్ధం చేసింది. దాడి చేస్తే ఎదుర్కోవాల్సిన పరిణామాలను రష్యాకు తెలియజేసింది.

* పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో భాజపా ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. తెదేపా-జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడటం సంతోషమన్నారు. సీట్ల విషయంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే ఈ పొత్తులని తెలిపారు. రాష్ట్రంలో అరాచకాల అంతానికి అందరూ కలవాలని పురందేశ్వరి పిలుపునిచ్చారు.

* ‘మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టికెట్‌ రాకుండా చూడండి. కాదని ఆయనకే ఇస్తే 25 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయం’ అని అసమ్మతి నేతలు పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు వైకాపా సమన్వయకర్త అనిల్‌కుమార్‌ యాదవ్‌కు తేల్చిచెప్పారు. అంబటి అసమ్మతి నాయకులు, కార్యకర్తలు శనివారం నరసరావుపేటలో అనిల్‌కుమార్‌ను కలిశారు. సత్తెనపల్లిలో వైకాపా పరిస్థితిని ఆయనకు వివరించారు. ‘‘పార్టీలో గ్రూపు విభేదాలకు అంబటి ఆజ్యం పోశారు. మొదట్నుంచి వైకాపాలో ఉంటున్న వారిని ఇబ్బందులకు గురిచేశారు. దందాలు చేయిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని గతంలో అంబటి కోసం పనిచేశాం. ఈసారి పనిచేయలేం’ అని వివరించారు. సత్తెనపల్లి వ్యవహారాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తానని అనిల్‌కుమార్‌ వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.

* సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటూ ఆసక్తికర విషయాలు పంచుకునే అమితాబ్‌ బచ్చన్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో ఆయన్ని దాదాపు 38 లక్షల మంది అభిమానులు ఫాలో అవుతుంటారు. మరి అమితాబ్‌ మాత్రం కేవలం ఒకే ఒకర్ని అనుసరిస్తున్నారు. అలాగని ఆ వ్యక్తి సెలబ్రిటీనో, కుటుంబ సభ్యురాలో కాదు. చూపులేని ఓ సామాన్యురాలు. ముంబయికి చెందిన ఆ అమ్మాయి పేరు అవ్నీ రాథీ. గతేడాది ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొని అమితాబ్‌కి మరింత దగ్గరైంది. ఉన్నత చదువులు చదువుకున్న అవ్నీ పాటలు రాసి పాడుతుంటుంది. వాద్య పరికరాలు వాయిస్తుంది. మ్యూజిక్‌ కంపోజ్‌ చేస్తుంటుంది. స్టేజీ షోలు కూడా చేస్తున్న అవ్నీ ఆత్మవిశ్వాసానికీ, ప్రతిభకీ మెచ్చిన అమితాబ్‌ ప్రశంసాపూర్వంగా ఆమె ఫేస్‌బుక్‌ ఖాతాని ఫాలో అవుతున్నారట.

* సముద్ర గర్భ అన్వేషణ కోసం భారత్‌ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్‌ ఓషన్‌ మిషన్‌ ‘సముద్రయాన్‌’ (Samudrayaan) ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది చివరికల్లా చేపడతామని కేంద్ర భూ విజ్ఞానశాస్త్ర శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) వెల్లడించారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తల బృందం సముద్ర మట్టం నుంచి ఆరు వేల మీటర్ల లోతులోకి వెళ్లి పరిశోధన చేస్తారని తెలిపారు.

* ఫిట్స్‌ వచ్చి రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని మంత్రి జూపల్లి కృష్ణారావు కాపాడారు. రాయికోల్‌ టోల్‌గేట్‌ వద్ద ఓ వ్యక్తి ఫిట్స్‌ వచ్చి పడిపోయాడు. కొల్లాపూర్‌కు వెళ్తున్న మంత్రి జూపల్లి ఆయన్ను గమనించి.. అనుచరులతో కలిసి కాపాడారు.

* డ్వామా పీడీగా ఉన్న యధుభూషణ్ రెడ్డికి ఎలాంటి ఎన్నికల బాధ్యతలు కేటాయించవద్దని తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన పదవీ విరమణ పొందాక వైకాపా ప్రభుత్వం పదవీకాలం పొడిగించిందని గుర్తుచేశారు. ఎన్నికల పరిశీలకులకు ప్రొటోకాల్ ఏర్పాట్లు చేసే బాధ్యతలను యధుభూషణ్ రెడ్డికి అప్పగించారని.. ఇక్కడ అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందన్నారు.

* హమాస్‌పై పోరు విషయంలో ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) అనుసరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంజమిన్‌ వైఖరి ఆయన సొంత దేశాన్నే గాయపరుస్తోందని శనివారం వ్యాఖ్యానించారు.

* వైకాపా ఇన్‌చార్జ్‌ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) అనుచరులు మచిలీపట్నంలో వీరంగం సృష్టించారు. ఉల్లిపాలెంకు చెందిన తెదేపా కార్యకర్త ఈడే యశ్వంత్‌పై వారు దాడి చేశారు. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

* టెస్టు క్రికెట్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేందుకు.. క్రికెటర్లు ఎక్కువగా పాల్గొనేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టు మ్యాచ్‌లు ఆడితే అదనంగా భత్యం చెల్లించనుంది. బీసీసీఐ కార్యదర్శి జైషా ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్‌ స్కీమ్‌’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు

* కెనడాలో ప్రధాని జస్టిన్‌ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పోస్ట్‌ మీడియా కోసం ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 70 శాతం మంది ట్రూడో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు తేలింది. దేశంలో పాలన సరిగా లేదని 60 శాతం మంది ట్రూడో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో 43 శాతం మంది 2021 ఎన్నికల్లో ట్రూడో ప్రభుత్వానికి ఓటు వేసిన వారే కావడం గమనార్హం. దేశంలో పెరగిపోతున్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న జీవన ఖర్చు, ఆరోగ్య రంగం, ప్రజల ఇళ్లు కొనుగోలుచేసే శక్తి వంటి అంశాల వచ్చే ఏడాది (2025) జరిగే సాధారణ ఎన్నికల్లో ట్రూడోకు వ్యతిరేకంగా పనిచేయనున్నట్లు చెబుతున్నారు. కాగా, నాన్‌ ప్రాఫిట్‌ అంగుస్‌ రెడ్‌ సంస్థ(ఏఆర్‌ఐ) నిర్వహించిన సర్వేలోనూ కేవలం 17 శాతం మంది మాత్రమే ట్రూడో తిరిగి ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నారు. 28 శాతం మంది ‘నన్‌ ఆఫ్‌ ద అబోవ్‌’ ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ఈ సర్వేలో కన్జర్వేటివ్‌ నేత పియెర్రే పొలీవర్‌ పట్ల మాత్రం కాస్త మెరుగైన స్పందన వచ్చింది. లిబరల్స్‌తో పోల్చుకుంటే కన్జర్వేటివ్‌ పార్టీ గత 12 నెలల నుంచి దేశంలో నిర్వహించిన సర్వేల్లో ముందు నిలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 338 సీట్లున్న కెనడా పార్లమెంట్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ 206 సీట్లు, లిబరల్స్‌ 67 సీట్లు గెలుచుకుంటాయని అంచనాలున్నాయి.

* లోక్‌సభ ఎన్నికల ముందర బీజేపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ ఎంపీ బ్రిజేందర్‌ సింగ్‌ Brijendra Singh(51) ఆదివారం బీజేపీకి రాజీనామా ప్రకటించారు. రాజకీయ కారణాల వల్లే బలవంతంగా తాను పార్టీని వీడాల్సి వస్తోందని ఎక్స్‌ అకౌంట్‌ ద్వారా తెలిపారాయన. హర్యానా రాజకీయ దిగ్గజం, కేంద్ర మాజీ మంత్రి చౌద్రీ బీరేందర్‌ సింగ్‌(77) తనయుడే ఈ బ్రిజేందర్‌ సింగ్‌. హర్యానా హిసార్‌ పార్లమెంటరీ స్థానం నుంచి బ్రిజేందర్‌ సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం.

* రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ చేరుతున్న నేతలకు టికెట్‌ ఇచ్చే ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. నేడు ముగ్గురు సీనియర్‌ నేతలు బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం. అయితే, రేపు(సోమవారం) బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ క్రమంలో రెండో జాబితాలను అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఎనిమిది మంది అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి అధిష్టానాకికి జాబితాను పంపించారు. ఇక, నిన్న(శనివారం)రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కిషన్‌రెడ్డి భేటీ కూడా అయ్యారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో చర్చలు జరిపారు. కాగా, తెలంగాణలో పార్టీలో చేరికపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో సీతారాంరాయక్‌, నగేష్‌, జలగం వెంకట్రావ్‌ను బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. వీరు ముగ్గురు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నట్టు సమాచారం. ఇక, వీరు బీజేపీలో చేరిన అనంతరం, పలు పార్లమెంట్‌ స్థానాల్లో వీరికే సీట్లు ఇస్తున్నట్టు పలువురు పార్టీ నేతలు లీకులు ఇస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z