Politics

కవిత…లంచాలే ₹100కోట్లు ఇచ్చారు-NewsRoundup-Mar 16 2024

కవిత…లంచాలే ₹100కోట్లు ఇచ్చారు-NewsRoundup-Mar 16 2024

* ఒంగోలు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి తెదేపాలో చేరారు. మంగళగిరిలోని ఎన్టీఆర్‌భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు కండువాకప్పి మాగుంటను తెదేపాలోకి ఆహ్వానించారు. వీరితో పాటు అద్దంకి వైకాపా నేతలు బాచిన కృష్ణచైతన్య, గరటయ్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి తెలుగుదేశంలో చేరారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లా రాజకీయం తిరగబడిందని, దర్శి అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు.

* రాజకీయాల్లో నల్లధన ప్రభావాన్ని అరికట్టేందుకే ఎన్నికల బాండ్ల (Electoral Bonds) పథకాన్ని తీసుకొచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) వెల్లడించారు. దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము పూర్తిగా గౌరవిస్తామన్నారు. అయితే, దీన్ని రద్దు చేయడానికి బదులుగా మెరుగుపర్చే అవకాశమిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఇండియాటుడే’ నిర్వహించిన కాంక్లేవ్‌లో మాట్లాడుతూ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

* లిక్కర్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్‌ విధించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని కవిత తరఫు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో రిమాండ్‌ విధిస్తూ.. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. అలాగే రిమాండ్‌లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే.. ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. కవిత కస్టడీ రిపోర్టులో.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారు. సౌత్‌ లాబీ పేరుతో లిక్కర్‌ స్కాంలో కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ లిక్కర్ విధానంలో కీలక కుట్రదారు… ప్రధాన లబ్ధిదారు కవితే. ఆప్‌ పార్టీకి వంద కోట్లు ఇవ్వడంలో కవిత కీలకపాత్ర ధారి. మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారు. కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారు. పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారు.. అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో.. కవిత వాటా పొందారు. ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారు. కవిత తన మొబైల్ లోని ఆధారాలు తొలగించారు. సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు పన్నారు. మాగుంట ద్వారా రూ. 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చారు. రూ. 30 కోట్లను అభిషేక్‌ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఈడీ పేర్కొంది.

* మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి’ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లామని.. ప్రస్తుతం తాము ప్రజల్లోనే ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు.

* కేంద్రంలో వరుసగా మూడోసారి భాజపా గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భారాస పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారని చెప్పారు.

* బహుజన్‌ సమాజ్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆ పార్టీని వీడారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని, పార్టీని వీడటం తప్ప మరో అవకాశం లేకుండాపోయిందని పేర్కొన్నారు.

* దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితను రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు ఈడీ అధికారులు ఈ ఉదయం హాజరుపరిచారు. కవిత తరఫున సీనియర్‌ లాయర్‌ విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించగా.. ఈడీ తరఫున ఎన్‌.కె మట్టా, జోయబ్‌ హుసేన్‌ వాదనలు కొనసాగించారు.

* వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధికి శనివారం సీఎం జగన్‌ నివాళులర్పించారు. అనంతరం ఆయన సమక్షంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం సీట్లు కేటాయించినట్లు చెప్పారు.

* టెస్టు క్రికెట్‌ వృద్ధి కోసం బీసీసీఐ (BCCI) ఇటీవల ఇన్సెంటివ్‌ స్కీమ్‌ను ప్రకటించింది. ప్రతీ టెస్టు మ్యాచ్‌కు అదనంగా ఫీజు చెల్లించడం వల్ల సుదీర్ఘ ఫార్మాట్‌ను ఆడేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపిస్తారనేది బోర్డు భావన. ఇంగ్లాండ్‌పై భారత్ (IND vs ENG) ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్నాక బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

* అంతర్జాతీయ వేదికగా దాయాది దేశం పాకిస్థాన్‌ తీరును భారత్ ఎండగట్టింది. చెప్పిందే చెప్పే చెత్త రికార్డు ఆ దేశం సొంతమని విసుగు ప్రదర్శించింది. ఐరాస జనరల్ అసెంబ్లీ(UNGA)లో అయోధ్య రామాలయం, సీఏఏ గురించి ఆ దేశ రాయబారి లేవనెత్తిన నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది.

* భారత నేవీ (Indian Navy) మరోసారి సముద్రపు దొంగల ఆటలు సాగనివ్వలేదు. తమ ప్రాంతం ద్వారా ప్రయాణించే నౌకలను దోచుకునేందుకు వారు చేసిన యత్నాలను అడ్డుకుంది. ఈ క్రమంలో భారత బలగాల వైపు పైరెట్లు కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలను నౌకాదళం ఎక్స్‌ (ట్విటర్) వేదికగా షేర్ చేసింది.

* సౌర విద్యుత్‌ వినియోగాన్ని మరింత విస్తరించి, పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన (PM Surya Ghar)’ పథకానికి కేంద్రం ఇటీవల శ్రీకారం చుట్టింది. దీనిద్వారా కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

* సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024)కు నగారా మోగింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన ఏపీలోని 25, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు.

* ప్రముఖ బాలీవుడ్‌ గాయని అనురాధ పౌడ్వాల్ (Anuradha Paudwal) శనివారం దిల్లీలో భారతీయ జనతా పార్టీ(భాజపా)లో చేరారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సనాతన ధర్మం(Sanatana Dharma)తో గాఢమైన అనుబంధం ఉన్న ప్రభుత్వంలో చేరడం సంతోషంగా ఉందని, భాజపాలో చేరడం తన అదృష్టమని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z