Business

స్థిరంగా బంగారం ధరలు-BusinessNews-Mar 17 2024

స్థిరంగా బంగారం ధరలు-BusinessNews-Mar 17 2024

* చాక్లెట్‌ తయారీ సంస్థ బారీ క్యాలిబాట్‌, టెక్‌ సంస్థ బుహ్లర్‌ సహా స్విట్జర్లాండ్‌కు (Switzerland) చెందిన అనేక కంపెనీలు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఆ దేశ ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ హెలెన్ బడ్లిగర్‌ తెలిపారు. హెస్‌ గ్రీన్‌ మొబిలిటీ 2025 నాటికి భారత్‌లో 3,000 విద్యుత్తు బస్సులను తయారు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అందుకోసం వచ్చే 6-8 ఏళ్లలో 110 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. బారీ క్యాలిబాట్‌ తన మూడో తయారీ కేంద్రాన్ని భారత్‌లో 2024లోనే ప్రారంభించే యోచనలో ఉందని బడ్లిగర్‌ తెలిపారు. గత ఐదేళ్లలో కంపెనీ ఇక్కడ 50 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. మరోవైపు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి 30 ఏళ్లు నిండిన సందర్భంగా వచ్చే 2-3 ఏళ్లలో బుహ్లర్‌ 23 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తిగా ఉందని వెల్లడించారు. వీటితో పాటు అనేక చిన్న కంపెనీలు భారత్‌ వైపు చూస్తున్నాయని చెప్పారు.

* గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,23,660 కోట్లు నష్టపోయాయి. వాటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఉన్నాయి. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1,475.96 (1.99 శాతం) నష్టపోయింది.రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) భారీగా నష్టపోగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, ఐటీసీ లబ్ధి పొందాయి.

* రెండేళ్ల క్రితం వరకు ఐటీ ఉద్యోగులు తరచూ కంపెనీలు మారుతూ ఉండేవారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. గతంలో లాగా కంపెనీ మారినప్పుడు, వేతనాల్లో పెంపు భారీగా ఉండకపోవడంతో ఉద్యోగుల వలసలు తగ్గుతున్నాయి. ఐటీ పరిశ్రమ ప్రస్తుతం విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటోంది. కొత్తగా వస్తున్న ప్రాజెక్టులు తగ్గడంతో నియామకాలు పెద్ద ఎత్తున ఉండటం లేదు. కొన్ని విభాగాల్లో చూస్తే, కావాల్సిన నిపుణుల లభ్యతా తక్కువగానే ఉంటోంది. కృత్రిమ మేధ (ఏఐ), ప్రాంప్ట్‌ ఇంజినీరింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), డేటా అనలిటిక్స్‌ నిపుణులకు ఇప్పుడు గిరాకీ పెరుగుతోంది. మరో వైపు, అమెరికాలాంటి దేశాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల కోత మొదలయ్యింది. ఇప్పటికిప్పుడు మన దేశంపై ఈ ప్రభావం లేదనే ఐటీ పరిశ్రమ చెబుతోంది.

* స్థిరాస్తి రంగం మార్కెట్‌ పరిమాణం 2034 నాటికి 1.3 లక్షల కోట్ల డాలర్ల(దాదాపు రూ.106 లక్షల కోట్లు) స్థాయికి చేరుతుందని స్థిరాస్తి డెవలపర్ల సంఘం క్రెడాయ్‌ నివేదిక వెల్లడించింది. 2047 నాటికి ఇది 5.17 లక్షల కోట్ల డాలర్ల(సుమారు రూ.423 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. భారతీయ స్థిరాస్తి మార్కెట్‌ ప్రస్తుత పరిమాణం రూ.24.6 లక్షల కోట్లు (దాదాపు 300 బిలియన్‌ డాలర్లు)గా ఉందని తెలిపింది. ఇందులో నివాస, వాణిజ్య విభాగాలు 80 శాతం, 20 శాతంగా ఉన్నట్లు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో స్థిరాస్తి రంగం పాత్ర’ పేరుతో నివేదికను విడుదల చేసింది. క్రెడాయ్‌ ప్రకారం రాబోయే ఏళ్లలో భారతీయ రియల్‌ ఎస్టేట్‌ రంగం భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది. 2034 నాటికి జీడీపీలో 13.8 శాతం, 2047 నాటికి 17.5 శాతానికి చేరుతుందని అంచనా వేసింది.

* బ్యాంకు ఖాతా తెరవాలన్నా, మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో పెట్టుబడులు పెట్టాలన్నా, బీమా పథకం కొనుగోలు చేయాలన్నా.. ఆయా సంస్థలకు కేవైసీ (మీ వినియోగదారు గురించి తెలుసుకో) సమర్పించడం తప్పనిసరి. వినియోగదారు చిరునామా, ఫోను నెంబరు మారితే, మళ్లీ కేవైసీలో మార్పులు చేయించుకోవాల్సిందే. విభిన్న సంస్థలకు పలుమార్లు కేవైసీ వివరాలు సమర్పించడం ఇబ్బందితో కూడిన పనే కాకుండా.. సమయం కూడా వృథా అవుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపించే ఉద్దేశంతో.. ఆర్థిక సేవల రంగంలో వినియోగదారుల వివరాలన్నీ లభ్యమయ్యే ఒకే కేవైసీ విధానాన్ని అమలు చేయాలని ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) ప్రతిపాదించింది. దీనికి సంబంధించి మార్గదర్శకాల సిఫారసుకు ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ‘ఒకే కేవైసీ విధానాన్ని తీసుకొని రావడం వల్ల.. ఆర్థిక సేవల రంగంలో బ్యాంకు ఖాతా తెరవడం దగ్గర నుంచి బీమా పథకం కొనుగోలు వరకు కేవైసీ కోసం ఉపయోగించుకునే వీలుంటుంది. దీనివల్ల పలుమార్లు కేవైసీ పత్రాలు సమర్పించే పని వినియోగదార్లకు తప్పుతుంద’ని ఇటీవల పలు సందర్భాల్లో ఎఫ్‌ఎస్‌డీసీ ఛైర్‌పర్సన్‌ నిర్మలా సీతారామన్‌ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

* దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్చి 17న పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,100గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,100గా ఉంది. వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,100గా ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z