Business

మనవడికి భారీ బహుమతి ఇచ్చిన మూర్తి-BusinessNews-Mar 18 2024

మనవడికి భారీ బహుమతి ఇచ్చిన మూర్తి-BusinessNews-Mar 18 2024

* కరోనా సంక్షోభం సమసిపోవటంతో టెక్ కంపెనీలన్నీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work from home) విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు తమ ఉద్యోగులంతా ఆఫీసుకు రావాలని అల్టిమేటం జారీ చేశాయి. అయినప్పటికీ.. కొందరు ఇంకా ఇంటినుంచి పనికే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్‌ (Dell) కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ నిబంధనల ప్రకారం ఆఫీసుకు రానివారికి ప్రమోషన్లు ఉండవని తేల్చి చెప్పినట్లు పలు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. ఇప్పటికీ ఇంటి నుంచి పనిచేయాలనుకునేవారు అదే విధానాన్ని కొనసాగించొచ్చని డెల్‌ (Dell) తమ ఉద్యోగులకు ఫిబ్రవరిలో జారీ చేసిన మెమోలో తెలియజేసింది. కానీ, వారెవరినీ ప్రమోషన్లకు పరిగణించబోమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం కంపెనీలో హైబ్రిడ్‌ పని విధానం కొనసాగుతోంది. దీని ప్రకారం.. ప్రతీ ఉద్యోగి వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలి. అలా రానివారందరినీ ఇంటి నుంచి పని చేస్తున్నట్లు భావించాల్సి వస్తుందని కంపెనీ తెలిపింది. వారెవరికీ పదోన్నతులు ఉండవని స్పష్టం చేసింది. అలాగే జాబ్‌ రోల్‌ మార్చుకునే అవకాశం సైతం ఇవ్వబోమని చెప్పింది. కరోనాకు ముందు నుంచే డెల్‌లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work from home) విధానం అమల్లో ఉండేది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్‌ డెల్‌ సైతం దీన్ని ప్రోత్సహించేవారు. పైగా ఆఫీసుకు రావాలని ఆదేశిస్తున్న కంపెనీలను ఆయన తప్పుబట్టారు. కానీ, తాజాగా డెల్‌ (Dell) విధానాల్లో సమూల మార్పులు వచ్చాయి. అందరూ కలిసి పనిచేయడం, తమ ఆలోచనలను పంచుకోవడం సంస్థ వృద్ధికి దోహదం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. ఈనేపథ్యంలోనే ప్రతిఒక్కరూ ఆఫీసుకు రావాలని కోరుతోంది. తాజా నిర్ణయంతో చాలామంది ఉద్యోగులు సంతృప్తిగా లేరని సమాచారం.

* ఇన్ఫోసిస్ (Infosys) సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) తన మనవడు ఏకాగ్రహ్‌ రోహన్‌ మూర్తికి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చారు. ఏకంగా కంపెనీలో 15 లక్షల షేర్లను అతని పేరు మీద రిజిస్టర్ చేశారు. వీటి విలువ సుమారు రూ.240 కోట్లు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. కంపెనీలో తన వాటా షేర్లలో కొన్నింటిని మనవడికి బహుమతిగా ఇచ్చినట్లు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వెల్లడించారు. నారాయణ మూర్తికి ఇన్ఫోసిస్‌లో 0.40 శాతం వాటా ఉంది. ఆయన వద్ద 1.51 కోట్ల కంపెనీ షేర్లు ఉన్నాయి. గతేడాది నవంబరులో ఆయన కొడుకు రోహన్‌ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్‌లకు ఏకాగ్రహ్ జన్మించాడు.

* దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్‌ సహా యూకే, జపాన్‌ కేంద్ర బ్యాంకులు ఈ వారమే నిర్ణయాలు తీసుకోనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సూచీలు రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. అయితే రిలయన్స్‌, టాటా స్టీల్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌లో కొనుగోళ్ల మద్దతు కారణంగా సూచీలు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఉదయం 72,587.30 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం 12 గంటల వరకు లాభనష్టాల మధ్య కదలాడింది. ఆ తర్వాత కాస్త కోలుకుని ఇంట్రాడేలో 72,985.89 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 104.99 పాయింట్ల లాభంతో 72,748.42 వద్ద ముగిసింది. నిఫ్టీ 32.35 పాయింట్ల లాభంతో 22,055 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.90గా ఉంది.

* అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ (Adani group) మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. లంచం ఆరోపణల విషయంలో ఆ గ్రూప్‌పై అమెరికా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టిందన్న వార్తల నేపథ్యంలో వాటి విలువ కుంగింది. గ్రూప్‌లోని అన్ని కంపెనీల షేర్లూ ఆరంభంలో భారీ నష్టాలు ఎదుర్కొనగా.. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి కోలుకొని స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ గ్రూప్‌లో ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ ఉదయం 4 శాతం నష్టపోగా.. ప్రస్తుతం కోలుకొని 1 శాతానికి అది పరిమితమైంది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎనకమిక్‌ జోన్‌ లిమిటెడ్‌ ఓ దశలో 3 శాతం మేర కుంగగా.. ప్రస్తుతం 2 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అదానీ విల్మర్‌, అదానీ పవర్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌.. ఇలా అన్ని షేర్లు పతనమయ్యాయి. అటు ఈ గ్రూప్‌నకు చెందిన డాలర్ బాండ్లు సైతం విలువ తగ్గాయి.

* ఐపీఎల్ (IPL) సందడి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానుల కోసం రిలయన్స్‌ జియో (Reliance Jio) రెండు డేటా ప్యాక్‌లను అందిస్తోంది. ఈ లీగ్‌ను వీక్షించాలనుకునేవారికి ఇవి సరిగ్గా సరిపోతాయి! రూ.667, రూ.444తో వస్తున్న ఈ ప్లాన్లు కొంతకాలంగా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. మ్యాచులను ఎంజాయ్‌ చేయాలనుకునేవారు వైఫై సదుపాయం లేకపోతే వీటిని పరిశీలించొచ్చు. మార్చి 22 నుంచి ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రిలయన్స్‌ జియో (Reliance Jio) రూ.667 ప్లాన్‌ వ్యాలిడిటీ 90 రోజులు. ఇది కేవలం డేటా వోచర్‌ మాత్రమే. దీంట్లో వాయిస్‌ కాలింగ్‌, ఎసెమ్మెస్‌ వంటి ప్రయోజనాలేమీ ఉండవు. పైగా యాక్టివ్‌ బేస్‌ ప్లాన్‌ ఉంటేనే దీన్ని రీఛార్జ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 150 జీబీ డేటా లభిస్తుంది. రోజువారీ పరిమితి ఏమీ ఉండదు. కావాలంటే మొత్తం ఒకేసారి వాడుకోవచ్చు. మరోవైపు రూ.444 ప్లాన్‌లో 100 జీబీ డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ 60 రోజులు. దీనికీ బేస్‌ ప్లాన్‌ ఉండాల్సిందే.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z