DailyDose

అప్పులు చేసిన భార్యపై భర్త దాడి-CrimeNews-Mar 26 2024

అప్పులు చేసిన భార్యపై భర్త దాడి-CrimeNews-Mar 26 2024

* దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను రౌజ్‌ అవెన్యూ కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు హాజరుపరిచారు. ఈడీ తరఫు న్యాయవాది జోయబ్‌ హుస్సేన్‌ ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించారు. 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్‌ విడుదల అయ్యిందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కవితకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్‌ 9 వరకూ ఈ రిమాండ్‌ కొనసాగనుంది. దీంతో ఆమెను తిహాడ్‌ జైలుకు అధికారులు పంపనున్నారు. మరోవైపు కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 1న విచారణ చెపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.

* అప్పులు చేసిందని ఓ వ్యక్తి భార్యపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జవహర్‌నగర్‌ సంతోష్‌నగర్‌లో మేడ ఇందిర(39), పెద్దబ్బాయి దంపతులు, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఇందిర నాటు కోడి చికెన్‌ సెంటర్‌ నిర్వహిస్తుండగా, ఆమె భర్త పెద్దబ్బాయి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో పెద్దబ్బాయి మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్నాడు. మూడు నెలల క్రితం వీరి మధ్య సయోధ్య కుదరడంతో ఇంటికి తిరిగివచ్చాడు. ఇందిర భర్తకు తెలియకుండా రూ.4 లక్షలు అప్పు చేసింది. అప్పు ఇచ్చిన వారు తరచూ ఇంటికి వస్తుండటంతో పెద్దబ్బాయి భార్యను నిలదీశాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం చికెన్‌ షాప్‌ వద్ద గొడవ జరగడంతో అతను ఇందిరపై కత్తితో దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* విజయవాడ నగర శివారు కానూరులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. న్యూ ఆటోనగర్‌లోని ఆయిల్‌ శుద్ధి చేసే కేంద్రంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలముకుంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక శకటాలతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనుమతులు లేకుండా ఈ కర్మాగారాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆస్తినష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

* హైదరాబాద్ కి చెందిన ఐఐటీ పీహెచ్‌డీ స్కాలర్ విద్యార్థి ఖాతా నుండి 30 లక్షల రూపాయలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు. ఇటీవల దేశవ్యాప్తంగా పార్సెల్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా స్కాంకు తెరలేపారు. పార్సల్ పేరుతో వివిధ రకాల బాధితులకు ఫోన్లు చేస్తూ బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తూ, నకిలీ పోలీస్ అధికారులుగా అవతారం ఎత్తుతూ దేశవ్యాప్తంగా వందలాది బాధితుల దగ్గర నుండి కోట్ల రూపాయలు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వీటి బారిన పడకుండా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇటీవల ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఐఐటి పీహెచ్‌డీ స్కాలర్ విద్యార్థికి ఒక అగంతకుడు నుండి కాల్ వచ్చింది. తమ కొరియర్ సర్వీస్ నుండి మాట్లాడుతున్నామని విద్యార్థికి తెలిపారు. ఆ పార్సిల్ లో కొన్ని అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని మభ్య పెట్టారు. ఎలాంటి వస్తువులు ఉన్నాయో తెలుపాలని విద్యార్థి కొరియర్ వారిని ఎదురు ప్రశ్న వేశాడు. అనుమానాస్పదంగా ఉన్న పార్సెల్‌లో డ్రగ్స్ తో పాటు ఒక పాస్‌పోర్ట్ ఉన్నట్లు బాధితుడిని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. తనతో పాటు తన కుటుంబీకుల మొబైల్స్ లాప్టాప్‌లను టెర్రరిస్ట్ గ్రూపులు హ్యాక్ చేశారని నమ్మించారు. కొరియర్ సంస్థ నిర్వాహకులు వెంటనే ముంబై పోలీసులకు కాల్ కలుపుతున్నట్లు నటించారు. ఆ వెంటనే లైన్‌లోకి వచ్చిన మరో సైబర్ నేరగాడు బాధితుడిని మరింత బెదిరించే ప్రయత్నం చేశాడు. తన బ్యాంక్ అకౌంట్‌కు టెర్రరిస్టులతో లింక్ ఉన్నట్లు నమ్మించారు. అందుకే తన మీద కేసు నమోదు చేస్తున్నామంటూ ఒక నకిలీ ఎఫ్ఐఆర్‌ను సైతం తయారు చేసి బాధితుడికి వాట్సాప్‌లో పంపించారు. ఇదంతా నిజమేమో అని అనుకోని నమ్మిన బాధితుడు సైబర్ నేరగాళ్లు చెప్పిన విధంగా 30 లక్షల రూపాయలు వారి బ్యాంకు ఖాతాకి బదిలీ చేశాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z