Business

ఆ బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుదల-BusinessNews-Mar 31 2024

ఆ బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుదల-BusinessNews-Mar 31 2024

* హైడ్రోకార్బన్, టెలికాం వ్యాపారాల విస్తరణ కోసం గత పదేళ్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 125 బిలియన్‌ డాలర్లకు పైగా మూలధనాన్ని వెచ్చించిందని గోల్డ్‌మన్ శాక్స్‌ నివేదిక తెలిపింది. రాబోయే మూడేళ్లలో రిటైల్, నూతన ఇంధన రంగంపై దృష్టి సారించనున్నట్లు పేర్కొంది. దీర్ఘకాల క్యాపెక్స్‌ సైకిళ్ల నుంచి కంపెనీ క్రమంగా బయటకొస్తోందని విశ్లేషించింది. ‘‘రిలయన్స్‌ (Reliance) 2013-18 ఆర్థిక సంవత్సరాల మధ్య ‘ఆయిల్‌-టు-కెమికల్‌ (O2C)’ బిజినెస్‌లో 30 బిలియన్‌ డాలర్ల మూలధనాన్ని చొప్పించింది. 2013-24 మధ్య 4జీ/5జీ కోసం టెలికాం బిజినెస్‌లో 60 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. దేశవ్యాప్త 5జీ విస్తరణ దాదాపు పూర్తయ్యింది. త్వరలో టెలికాం టారిఫ్‌లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఓ2సీ బిజినెస్‌తో పాటు ఇకపై టెలికాం నుంచి కూడా రిలయన్స్‌కు భారీ నగదు ప్రవాహం రానుంది. తక్కువ మూలధనం అవసరమయ్యే రిటైల్‌, నూతన ఇంధన రంగాలపై కంపెనీ వచ్చే మూడేళ్లలో దృష్టి సారించే అవకాశం ఉంది’’ అని గోల్డ్‌మన్‌ శాక్స్‌ నివేదిక పేర్కొంది.

* ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్‌పీఎస్‌ ఖాతా లాగిన్‌కు సంబంధించి పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతను మరింత మెరుగు పరుస్తూ 2 ఫ్యాక్టర్‌ ఆధార్‌ బేస్డ్‌ అథంటికేషన్‌ వ్యవస్థను తీసుకొచ్చింది. పాస్‌వర్డ్‌ ఆధారిత యూజర్లందరూ ఏప్రిల్‌ 1 నుంచి ఈ విధానాన్నే అనుసరించాల్సి ఉంటుంది. మార్చి 15న ఈ మేరకు ఓ సర్క్యులర్‌ జారీ చేసింది.

* ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణాలపై వడ్డీ రేట్లను సవరించింది. రుణ రేటును 10బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. బీఓఐ నిర్ణయంతో వడ్డీ రేట్లు 2.75 శాతం నుంచి 2.85 శాతానికి చేరాయి. ఏప్రిల్‌ 5న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడున్న తరుణంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. పెంచిన వడ్డీ రేట్లు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో ఈ రేట్లతో అనుసంధానం అయిన రుణాలు ప్రియం కానున్నాయి. మరోవైపు.. ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ కూడా వడ్డీ రేట్లను 5 బేసిస్‌ పాయింట్లు పెంచింది. కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్‌ 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుత రెపో రేటు 6.5 శాతం, రెపో ఆధారిత రుణ రేటు 9.35 శాతంగా ఉంది.

* అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్‌ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్‌ వర్గాలు అంటుంటాయి. అది ఒక విధంగా నిజమే. అక్కడి మార్కెట్ల తీరును బట్టి, మరుసటి రోజు మన మార్కెట్లు కదలాడిన రోజులు ఎన్నో. అయితే ఇటీవలి కాలంలో ఆ ప్రభావం పరిమితంగా ఉంటోంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాదిలో 3 సార్లు రేట్ల కోతను చేపడతామనే సంకేతాలిచ్చింది. తదుపరి అక్కడి మార్కెట్లు కొంత పెరిగాయి. అక్కడి రేట్ల కోత ప్రభావం మన మార్కెట్లపై ఎలా ఉండొచ్చనే అంశంపై విశ్లేషణలు సాగుతున్నాయి. అక్కడ వడ్డీరేట్ల ప్రభావం ఇలా..ఫెడ్‌ కీలక రేట్ల ఆధారంగానే అమెరికాలోని బ్యాంకులు తమ నగదు నిల్వలను సర్దుబాటు చేసుకుంటాయి. రోజూ ఉదయం తమ వద్ద ఉన్న నగదు నిల్వలను చూసుకుని.. తమ అవసరాలను అంచనా వేస్తాయి. తక్కువ నిధులు ఉన్నాయనిపిస్తే.. ఇతర బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని.. తర్వాతి రోజు వడ్డీతో చెల్లిస్తాయి. పెద్ద కంపెనీలు కూడా తమ వృద్ధి ప్రణాళికల కోసం/రోజువారీ కార్యకలాపాల కోసం తీసుకునే రుణ వ్యయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాయి. వడ్డీ రేట్లు తగ్గితే, ‘అంతకుముందు అధిక వడ్డీతో తీసుకున్న రుణాలను తీర్చేయడానికి కొత్త రుణాలు తీసుకునే వెసులుబాటు కంపెనీలకు కలుగుతుంది. దీంతో కంపెనీల లాభాల మార్జిన్‌ పెరుగుతుంది. తద్వారా ఆదాయాలూ మెరుగవుతాయి. వడ్డీ భారం తగ్గినప్పుడు, సహజంగానే వినియోగదార్ల వ్యయాలూ పెరుగుతాయి. తద్వారా కంపెనీల ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఇదో చక్రంలాగా మారి కార్పొరేట్‌ ఫలితాలపై సానుకూల ప్రభావం పడుతుంది. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో షేర్లు పరుగులు తీసే అవకాశం ఉంటుంది.

* ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు మాత్రమే ఎందుకు పరిగణిస్తారు, అని చాలామందికి అనుమానం రావొచ్చు. దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. ఆర్థిక పరిశోధకులు కొన్ని ప్రధాన కారణాలను వెల్లడించారు. బ్రిటీష్ దేశాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు అకౌంటింగ్ వ్యవధిని అనుసరించారు. భారతదేశం సుమారు 150 సంవత్సరాలు బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పుడు కూడా ఈస్టిండియా కంపెనీ ఇదే విధానాన్ని కొనసాగించింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఈ పద్దతినే భారత ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. భారతదేశం వ్యవసాయ దేశం. కాబట్టి చాలా వరకు ఆదాయం ప్రధానంగా పంటలపై ఆధారపడి ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి కాలంలో పండిన దిగుబడుల అంచనాపై ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఈ రెండు నెలల వ్యవధిలో ఆదాయం పెరుగుతుందా/తగ్గుతుందా అనే అంచనా కూడా వేస్తారు. అందువల్ల ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు తీసుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణం.

* ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. తన హెచ్‌డీఎఫ్‌సీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. ఈ లావాదేవీ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జరుగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్విస్ ఛాలెంజ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ ఎడ్యుకేషన్‌ వాటాను ఎవరు కొనుగోలు దారులను ఖరారు చేస్తుంది. ఆ తర్వాత బ్యాంక్ బిడ్డర్ ప్రయోజనాల కోసం డాక్యుమెంటేషన్‌ ప్రాసెస్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z