Politics

టీఎస్‌ఆర్‌టీసీని మూసేయడానికి కేసీఆర్ కుట్ర

టీఎస్‌ఆర్‌టీసీని మూసేయడానికి కేసీఆర్ కుట్ర

బస్సు చార్జీల పెంపుతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మూసేవేసే కుట్రకు తెరలేపుతున్నారని ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపణలు గుప్పించారు.టీఎస్‌ఆర్‌టీసీ ప్రయివేటీకరణ దిశగా ముందుకు సాగుతున్నదనే అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుపై విమర్శల దాడినిని కొనసాగించిన బండి సంజయ్‌ టీఎస్‌ఆర్‌టీసీని మూసివేసి తన కుటుంబ సభ్యులకు అప్పగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని అన్నారు. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్‌లో నిరసన తెలుపుతున్న కొద్ది మంది ప్రయాణికులు, టీఎస్‌ఆర్‌టీసీ సిబ్బందితో బీజేపీ నేత బండి సంజయ్ మాట్లాడారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలను టీఎస్‌ఆర్‌టీసీ సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు.

నిరసన స్థలంలో కరీంనగర్ ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి రాకముందు 2014లో ఆర్టీసీకి 10 వేల బస్సులు ఉంటే ఇప్పుడు దాన్ని 6 వేలకు తగ్గించారు. గతంలో 1200 ప్రైవేట్ బస్సులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 3,000కి పెరిగిందని అన్నారు. రోడ్డు రవాణా సంస్థల చట్టం ప్రకారం ప్రైవేట్‌ బస్సులు 20 శాతానికి మించి ఉండకూడదని తెలంగాణ బీజేపీ చీఫ్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో ఇప్పుడు దాదాపు 50 శాతం ప్రైవేట్ బస్సులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, గత ఆరు నెలల్లో కేంద్రం పెట్రోల్‌, డీజీల్ పై వరుసగా 15, 17 సుంకాన్ని తగ్గించిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం సెస్ విధింపుపై ప్రశ్నలు సంధించారు. తెలంగాణ ప్రభుత్వం బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ బీజేపీ చేపట్టిన నిరసనకు ముందు ఉదయం కరీంనగర్ ఎంపీని గృహనిర్బంధంలో ఉంచారు. ఆయన నిరసనలో పాల్గొనకుండా నేతల నివాసం వద్ద పెద్దఎత్తున భద్రతా సిబ్బంది మోహరించారు.

ఇదిలావుండగా, సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చని సంజయ్ అన్నారు. ముందు తెలంగాణకు ఏం చేశారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ ఎనిమిదేళ్ల పాలనపై, కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమని సంజయ్ సవాల్ విసిరారు. కుటుంబ అవినీతి పార్టీలు దేశంలో అంతమైపోతున్నాయంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కులాలు, మతాలు, వర్గాల పేరుతో కేసీఆర్ విచ్ఛిన్నం చేశారని సంజయ్ ఆరోపించారు. ప్రపంచంలో భారత్‌ను మోడీ అగ్రస్థానంలో నిలిపారని ఎన్నికల హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు.మరో బీజేపీ నాయకుడు సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ప్రతిపక్షాలపై రాజకీయ దురుద్దేశాలతోనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారన్న కేటీఆర్‌ ట్వీట్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  కౌంటరిచ్చారు. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం అంటే ఇదేనేమోనంటూ ఆయన సెటైర్లు వేశారు. కేటీఆర్ ట్వీట్‌లోని ఆంతర్యం ఏమిటోనంటూ ప్రశ్నించిన రఘునందన్ రావు దర్యాప్తు సంస్థలు అంటే ఎందుకు ఉలికిపడుతున్నారోనంటూ కామెంట్స్ చేశారు.