Business

టాటా గ్రూపు నూతన ప్రణాళిక

టాటా గ్రూపు నూతన ప్రణాళిక

విమానయాన వ్యాపార విభాగంలో భారీ మార్పులకు టాటా గ్రూప్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే విస్తరించిన తన విమానయాన వ్యాపార సామ్రాజ్య పునర్‌నిర్మాణ ప్రణాళికలో భాగంగా నాలుగు ఎయిర్‌లైన్స్ బ్రాండ్లను ఒకే గూటికి తీసుకురావాలనుకుంటోంది. 4 బ్రాండ్లనూ ఎయిరిండియా లిమిటెడ్కిం ద కలిపేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా విస్తారా ఎయిర్‌లైన్స్ బ్రాండ్‌ను మూలనపడేయాలని టాటా గ్రూప్ భావిస్తోందంటూ ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉమ్మడి కంపెనీలో తన వాటా పరిమాణాన్ని సింగపూర్ ఎయిర్‌లైన్స్ లెక్కిస్తోందని ఓ వ్యక్తి తెలిపారు. అయితే ఈ రిపోర్టులపై ప్రశ్నించగా టాటా గ్రూప్, ఎయిరిండియా, విస్తారాల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కాగా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్‌, టాటా గ్రూప్ ఉమ్మడిగా విస్తారా ఎయిర్‌లైన్స్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ స్పందిస్తూ.. టాటా, ఎస్ఐఏ (SIA) మధ్య చర్చలు నడుస్తున్నాయని తెలిపింది. అక్టోబర్ 13 నాటి స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్ మినహా కొత్తగా ఎలాంటి సమాచారంలేదని స్పష్టం చేసింది. ఇరు కంపెనీల భాగస్వామ్యం, అనుసంధానంపై చర్చలు ఉండొచ్చని పేర్కొంది. కాగా కొత్త యాజమాన్యం టాటా గ్రూప్ సారధ్యంలోని ఎయిరిండియా క్రమంగా కొత్త రూపును సంతరించుకుంటోంది. 300 చిన్న విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చే విషయాన్ని కంపెనీ పరిశీలిస్తోంది. ఇదే జరిగితే కమర్షియల్ ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద ఆర్డర్‌గా నిలవనుంది. ఎయిరిండియా తన ప్రస్తుత విమానాల సంఖ్య 113ను రానున్న ఐదేళ్లలో మూడింతలు పెంచుకోనుందని ఎయిరిండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యాంప్‌బెల్ గత నెలలోనే ధృవీకరించారు. చిన్న, పెద్ద విమానాలను గణనీయంగా పెంచుకోనున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు నిధుల సేకరణపైనా టాటా గ్రూపు దృష్టిసారించింది. ఒక ఫండింగ్ రౌండ్‌లో భాగంగా 1 బిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించడంపై యాజమాన్యం చర్చిస్తోందని కంపెనీకి చెందిన వర్గాలు సెప్టెంబర్‌లో వెల్లడించాయి. 25 ఎయిర్‌బస్ ఎస్ఈ, 5 బోయింగ్ కో కొనుగోలు చేయాలనుకుంటోంది. డిసెంబర్‌లో ఈ ప్రక్రియ మొదలవనుందన్న సంగతులు తెలిసినవే.