Health

12గంటల్లో స్నానం చేయిస్తే తల్లిపాలకు ఆరాటపడతారు

new born feeding

పిల్లలకు ఆరు నెలలు నిండేంత వరకూ కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి. ఇది బిడ్డ ఎదుగుదలకు, రోగనిరోధకశక్తి పెంపొందటానికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే బిడ్డ రొమ్ము పట్టటం లేదని కొందరు వాపోతుంటారు. పుట్టిన తర్వాత బిడ్డకు ఆలస్యంగా స్నానం చేయిస్తే ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకోవచ్చని క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌ అధ్యయనం పేర్కొంటోంది. కనీసం 12 గంటల తర్వాత తొలి స్నానం చేయించిన పిల్లలు తల్లిపాలు బాగా తాగుతున్నట్టు, తల్లులు కూడా ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లాక చనుబాలు ఇవ్వటానికే మొగ్గుచూపుతున్నట్టు బయటపడటం గమనార్హం. ఇలాంటి పిల్లల్లో శరీర ఉష్ణోగ్రత కూడా స్థిరంగా ఉండటం విశేషం. సిజేరియన్‌ కాన్పు అయినవారితో పోలిస్తే సహజకాన్పు అయిన వారిలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటున్నట్టూ తేలింది. దీనికి గల కారణాలేంటన్నది స్పష్టంగా బయటపడలేదు గానీ బిడ్డ తల్లిని, తల్లి బిడ్డను తాకటం.. తల్లి వాసన ఇందుకు దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఉమ్మనీరు, రొమ్ములు ఒకే వాసన కలిగుంటాయి మరి. ఆలస్యంగా స్నానం చేయించటం ద్వారా బిడ్డ త్వరగా తల్లిని హత్తుకోవటానికి అవకాశం లభిస్తుందని, అలాగే ఉమ్మనీటి వాసనతో కూడిన రొమ్మును పిల్లలు తేలికగా గుర్తించి, పెదాలతో పట్టుకోవటానికి వీలవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అంతేకాదు.. వెంటనే స్నానం చేయిస్తే ఒంట్లో ఉష్ణోగ్రత తగ్గిపోయి బిడ్డకు చలివేస్తుంది. దీంతో శిశువులు త్వరగా అలసిపోతారు. ఫలితంగా రొమ్ము పట్టటానికి అంతగా ఇష్టపడరు. అందువల్ల శిశువులకు వీలైనంత ఆలస్యంగా స్నానం చేయించటమే మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.