Movies

విష్ణుకు బాలయ్య మద్దతు-తాజావార్తలు

విష్ణుకు బాలయ్య మద్దతు-తాజావార్తలు

* నటీనటుల విమర్శలు, ప్రతి విమర్శలతో ‘మా’ ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో నటుడు బాలకృష్ణ తనకే మద్దతు ఇస్తున్నారని అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ‘అఖండ’ సెట్‌కు వెళ్లిన విష్ణు కాసేపు బాలయ్యతో ముచ్చటించారు. తన మేనిఫెస్టో గురించి వివరించారు. ‘మా’ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం తాను చేపట్టనున్న కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు. తన అభిప్రాయాలతో ఏకీభవించిన బాలయ్య తనకు మద్దతు ప్రకటించారని విష్ణు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఓ ట్వీట్‌ పెట్టారు. ‘బాలా అన్న.. మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు. మీరు నాకు మద్దతు తెలపడం ఎంతో గర్వంగా ఉంది’ అని విష్ణు పోస్టు పెట్టారు. మరోవైపు ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ ప్రధానంగా పోటీపడుతున్న విషయం తెలిసిందే.

* సినిమా టికెట్ల ధరలు అమాంతంగా పెంచేసి కొందరు నిర్మాతలు చేస్తున్న దోపిడీని కట్టడి చేసేందుకే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ తనయుడు హరికృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ‘‘ఆటో రజినీ’’ చిత్ర ప్రారంభోత్సవానికి కొడాలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘చిన్న సినిమాలను బతికించేందుకు మార్పు అనివార్యమైంది. సినీ పరిశ్రమ అంటే నలుగురు నిర్మాతలు మాత్రమే కాదు. ఒకరు బెదిరిస్తే ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో బెదిరిపోయే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి.. ఎక్కడ ఏ విధమైన రేట్లు ఉండాలనే విధానంపై నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారమే సినిమా టికెట్లు అమ్మాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ విషయంలో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని హైకోర్టు సైతం తెలిపింది. కేవలం ఒక వ్యక్తి లేదా ఒక సినిమాను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదు. సినీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అరిచినంత మాత్రాన అదిరిపోయి, బెదిరిపోయి పారిపోయేది కాదు రాష్ట్ర ప్రభుత్వం. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఎవరి మద్దతు అవసరం లేదు. ఆయనకు భగవంతుడి మద్దతు ఉంది’’ అని కొడాలి నాని అన్నారు.

* తెలంగాణ అసెంబ్లీలో రాజాసింగ్‌, రఘునందన్‌రావు, రాజేందర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)లు ప్రజాగళం వినిపిస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన భాజపా ఎన్నికల శంఖారావ సభలో బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. ఉద్యమకారుడైన ఈటల రాజేందర్‌ను గెలిపించాలని హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెరాస నేతలు ఈటలతో లబ్ధి పొంది చివరకు ఆయన్ను వదిలించుకున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే కేసీఆర్‌ పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. తెరాస విషపూరిత ప్రచారాన్ని అందరూ గమనిస్తున్నారన్నారు. నకిలీ ఉత్తరాలు సృష్టిస్తూ .. దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెరాస కుతంత్రాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. భాజపా సభకు ఆపార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు.

* ‘‘వైకాపా చేసిన త‌ప్పుడు ప్రచారాల‌ను తిప్పికొట్టడంలో వెనుక‌ప‌డ్డాం. అందుకే ఇవాళ ఇలా ప్రతిప‌క్షంలో ఉన్నాం. ఆ త‌ప్పు మ‌రోసారి పున‌రావృతం కాకూడదు. మూడేళ్ల వైకాపా పాలన చూశాం. ఎంత క‌క్షపూరితంగా, దుర్మార్గంగా, మోస‌పూరితంగా పాలన సాగిస్తోందో అంద‌రూ గ‌మ‌నిస్తున్నారు’’ అని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. తెదేపా ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ స్థాయి పార్టీ శిక్షణా త‌ర‌గ‌తుల ముగింపు కార్యక్రమంలో కొల్లు రవీంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు.

* బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ మాల్‌ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ మండల టాస్క్ ఫోర్స్, పంజాగుట్ట పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి నిందితుడిని అరెస్టు చేశారు. నైజీరియన్‌ నుంచి నాలుగు గ్రాముల కొకైన్, హోండా యాక్టీవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2014లో స్టూడెంట్ వీసాపై హైదరాబాద్‌కి వచ్చిన నైజీరియన్‌ డానియల్ ఒలేరియా జోసఫ్.. కూకట్‌పల్లిలో ఓ కళాశాలలో చదువుతున్నాడు. దిల్లీకి చెందిన నైజీరియన్ జాన్ పాల్ తో కలిసి జోసఫ్ మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో జోసఫ్‌ను లంగర్‌హౌస్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. బెయిల్‌పై విడుదలైన జోసఫ్ మళ్ళీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. గ్రాము కొకైన్‌ రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు జాన్ పాల్‌ కోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలిస్తున్నారు.

* తెలంగాణ ప్రభుత్వం పట్ల భాజపా నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అగ్రహం వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాలేదని స్పష్టం చేశారు. అయన పాదయాత్రలో ఎటు చూసినా పచ్చదనమే కనిపించిందని.. అందుకే సంజయ్‌కు ఏమి మాట్లాడాలో తెలియలేదని ఎద్దేవా చేశారు. విద్య, వైద్యం రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరూ చెప్పాల్సిన పని లేదన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు 5 మెడికల్ కళాశాలలుంటే ఇప్పుడు 9 కాలేజీలు ఉన్నాయని.. మరో నాలుగు కళాశాలలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో బండి సంజయ్‌ తెలంగాణ కోసం ఏం మాట్లాడారో చెప్పాలని వినోద్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

* మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఎంతో ప్రయత్నిస్తున్నారు. తన టీమ్‌తో కలిసి వరుస ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన అసోసియేషన్‌ సభ్యులందరికీ లంచ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో ఆదివారం మధ్యాహ్నం అసోసియేషన్‌ సభ్యులందరితో సమావేశమైన ప్రకాశ్‌రాజ్‌.. తన ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ గురించి వివరించారు. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం తాను చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై వాళ్లతో చర్చలు జరిపారు. అలాగే, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

* మనదేశంలోనే కాదు అంతర్జాతీయంగానూ సత్తాచాటుతోన్న నాయిక దీపికా పదుకొణె. భారతీయ భాషల్లోనే కాకుండా హాలీవుడ్‌లోనూ నటిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. తాజాగా ఆమెకు అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఉత్తమ నటిగా ‘గ్లోబల్‌ ఎచీవర్స్‌’ పురస్కారం ఆమెను వరించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వారికి ఈ పురస్కారం అందిస్తారు. ఈ జాబితాలో బరాక్‌ ఒబామా, జెఫ్‌ బెజోస్‌, క్రిస్టియానో రొనాల్డో తదితరులు ఉన్నారు. ఈ అవార్డు కోసం విభిన్న రంగాల నుంచి 3000 నామినేషన్స్‌ వచ్చాయి. 2018లో టైమ్స్‌ పత్రిక ప్రకటించిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావం కనబరిచిన వందమంది జాబితాలో దీపిక చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపిక ఓ హాలీవుడ్‌ చిత్రంతో పాటు ‘ఫైటర్‌’, ‘83’, ‘పఠాన్‌’ చిత్రాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా షకున్‌ బత్రా దర్శకత్వంలో ఓ సినిమా, ప్రభాస్‌, అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలోనూ నటిస్తోంది.

* కడప జిల్లాలోని బద్వేల్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని తెదేపా నిర్ణయించింది. అధినేత చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన తెదేపా పొలిట్‌ బ్యూరో బద్వేల్‌ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయించింది. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణికే టికెట్‌ ఇచ్చినందున పోటీకి తెదేపా విముఖత వ్యక్తం చేసింది. సంప్రదాయాలను గౌరవించి బద్వేల్‌లో పోటీ చేయడం లేదని తెదేపా వెల్లడించింది. వైకాపా ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో బద్వేల్‌ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. పొలిట్‌ బ్యూరో నిర్ణయానికి ముందు బద్వేల్‌ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్‌ను తెదేపా ఖరారు చేసింది. 2019లో బద్వేల్‌ తెదేపా అభ్యర్థిగా రాజశేఖర్‌ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దివంగత ఎమ్మెల్యే సతీమణికే వైకాపా టికెట్‌ ఇచ్చినందున జనసేన పోటీ చేయడం లేదని ఇప్పటికే ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

* కశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో భద్రతాదళాలు రూ.25 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి లభ్యమైన ఈ మాదక ద్రవ్యాలను అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించాయి. బారాముల్లా సీనియర్‌ ఎస్పీ రాయీస్ అహ్మద్‌ ఆదివారం వివరాలు వెల్లడించారు. ‘శనివారం విధుల్లో ఉన్న జవాన్లు.. సరిహద్దు సమీపంలో అనుమానాస్పద కదలికలను గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమయ్యారు. తనిఖీల్లో భాగంగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు’ అని తెలిపారు. దీంతో సరిహద్దు అవతలివైపు నుంచి కశ్మీర్‌లోకి మాదక ద్రవ్యాల చేరవేత యత్నాన్ని భగ్నం చేసినట్లయిందన్నారు. సుమారు 25 నుంచి 30 కిలోల హెరాయిన్‌ పట్టుబడిందని, మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.25 కోట్లు ఉంటుందని ఎస్‌ఎస్పీ చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, జిల్లాలో మాదకద్రవ్యాల రవాణాకు సంబంధించిన మాడ్యూల్‌ను త్వరలోనే ఛేదించే అవకాశం ఉందని వివరించారు. మరోవైపు ఆదివారం ఉదయం కశ్మీర్‌లోని సౌజానా గ్రామంలో పోలీసులు.. ఓ ఏకే-47, మూడు మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు, ఓ టెలిస్కోప్‌ ఉన్న ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ వైపు నుంచి వచ్చిన ఓ డ్రోన్ ఈ ఆయుధాలను జారవిడిచినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని, భారత్‌లో ఈ ఆయుధాలను ఎవరు తీసుకోవాల్సి ఉందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

* జేఎన్‌టీయూ.. మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిపాటు చదువును మధ్యలో ఆపి మళ్లీ కొనసాగించే బ్రేక్‌ స్టడీ ( భ్రేక్ స్తుద్య్ ) విధానాన్ని తీసుకొచ్చింది. స్టార్టప్స్‌లో రాణించే విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారికి ఈ అవకాశం కల్పించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలుచేస్తున్నట్టు జేఎన్టీయూ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. ఇది వరకు బీటెక్‌ ( భ్టెచ్ )లో చేరితే నాలుగేండ్లపాటు వరుసగా చదువాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒక విద్యార్థి గరిష్ఠంగా రెండు సెమిస్టర్లపాటు తాత్కాలిక విరామం తీసుకోవచ్చు. బీటెక్‌ విద్యార్థులు కొందరు ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు స్టార్టప్స్‌లో రాణిస్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అన్వేషిస్తున్నారు. ఈ దశలో అటు చదువా.. ఇటు స్టార్ట ప్పా.. అన్నది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మధ్యలో చదువులు ఆపేస్తే పట్టా చేతికి అందదని.. చదువులకు ప్రాధాన్యమిస్తే మొగ్గదశలోనే నవ ఆలోచనలను తుంచేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన జేఎన్టీయూ బ్రేక్‌ స్టడీ విధానాన్ని తీసుకొచ్చింది. ఝ్ణ్టూ నెవ్ పొలిచ్య్ మార్గదర్శకాలు..
స్టార్టప్స్‌ వెంచర్లు, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నవారే ఇందుకు అర్హులు.
తొలి నాలుగు సెమిస్టర్లు పూర్తిచేసినవారికే అవకాశం. బ్యాక్‌ల్యాగ్స్‌ ఉన్నవారికి, హాజరుశాతంలేనివారికి ఈ అవకాశం ఉండదు.
ఆయా విద్యార్థులు జేఎన్టీయూ వీసీకి రిపోర్ట్‌చేసి, అనుమతి పొందాలి. ఏ కారణం చేత బ్రేక్‌ తీసుకోవాలనుకుంటున్నారో వెల్లడించాలి.
తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌ నుంచి సైతం అనుమతి పొందాల్సి ఉంటుంది.
సంవత్సరం పూర్తికాగానే మరలా తిరిగి కోర్సులో చేరాలి.