Politics

తెరాస పతనానికి నాంది. ఆసుపత్రిలో బాలకృష్ణ-తాజావార్తలు

తెరాస పతనానికి నాంది. ఆసుపత్రిలో బాలకృష్ణ-తాజావార్తలు

* తెరాస పతనానికి నాంది పడిందని నిజామాబాద్‌ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెరాసలో పెద్ద ఎత్తున ముసలం పుట్టబోతోందన్నారు. హుజూరాబాద్‌లో భాజపాకు 20వేల మెజార్టీ వస్తుందన్న అర్వింద్‌.. డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని భావించిన తెరాసకు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ‘‘కేసీఆర్‌ చేసిన అవినీతి పాపాలే ఆయన్ను చుట్టుముట్టాయి. అహంకారమే ఆయన్ను దహించివేసింది. కేసీఆర్‌ చరిత్రలో మిగిలిపోయే రోజు ఇవాళ్టి నుంచి మొదలైంది. తెరాస పార్టీ అస్తవ్యస్తం కాబోతోంది. తెలంగాణ ప్రజలు నరేంద్రమోదీ నాయకత్వంలో నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి అతి త్వరలో రాబోతున్నారు. నిజమైన బంగారు తెలంగాణ అన్నది కేవలం నరేంద్రమోదీ గారి నాయకత్వంలోనే సాధ్యం’’ అని అర్వింద్‌ అన్నారు.

* సినీ నటుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలో చేరారు. గత ఆరు నెలలుగా బాలకృష్ణ భుజం నొప్పితో బాధపడుతున్నారు. దీంతో అక్టోబరు 31వ తేదీన చికిత్స నిమిత్తం ఆయన బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి వెళ్లారు. ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రఘువీర్‌రెడ్డి, డాక్టర్‌ బి.ఎన్‌.ప్రసాద్‌ల బృందం నాలుగు గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘అఖండ’ విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు. దీని తర్వాత గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. మరోవైపు ప్రముఖ ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్స్‌’ పేరుతో సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే.

* టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించారు. దీంతో బంగ్లాదేశ్‌ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 18.2 ఓవర్లలోనే 84 పరుగులు చేసి ఆలౌటైంది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మెహెదీ హాసన్ (27) ఒక్కడే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ, అన్రిచ్‌ నోర్జే మూడేసి, తబ్రెయిజ్‌ షంసి రెండు, డ్వేయిన్‌ ప్రిటోరియస్‌ ఒక వికెట్ తీశారు.

* నగర శివారుల్లోని మంచిరేవుల ఫాంహౌస్‌లో ఆదివారం రాత్రి పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే సహా బడా స్థిరాస్తి వ్యాపారులు, ఇతర రంగాల్లోని ప్రముఖులు ఉండటంతో ఈ వ్యవహారం సంచలనమైన విషయం తెలిసిందే. పట్టుబడిన 30 మందిని నార్సింగి పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు. అయితే, ఉప్పర్‌పల్లి న్యాయస్థానం వీరిలో 29మందికి మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ కుమార్‌కు బెయిల్‌ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. ఈకేసులో గుత్తా సుమన్‌ కుమార్‌ ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలడం, అతనిపై గతంలో గచ్చిబౌలి, పంజాగుట్ట, కూకట్‌పల్లి పీఎస్‌లలో కేసులు ఉండటంతో న్యాయస్థానం అతని బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్‌పై ఈనెల 5 విచారణ జరగనుంది. విజయవాడకు చెందిన గుత్తా సుమన్‌కుమార్‌పై ఏపీ, తెలంగాణలోని వివిధ ఠాణాల్లో పలు కేసులు నమోదైనట్లు నార్సింగి పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. గుత్తా సుమన్‌కుమార్‌, శ్రీరాం భద్రయ్య(మహబూబాబాద్‌ మాజీ ఎమ్మెల్యే), తనున్‌, గుమ్మాడి రామస్వామి చౌదరి, నందిగా ఉదయ్‌, సీహెచ్‌ శ్రీనివాస్‌రావు, టి.శివరామకృష్ణ, బడిగా సుబ్రహ్మణ్యం, పాండిటాగా సురేశ్‌, నాగార్జున, కె.వెంకటేశ్‌, ఎం.భానుప్రకాశ్‌, పాతూరి తిరుమల, వీర్లా శ్రీకాంత్‌, మద్దుల ప్రకాశ్‌, సీవీసీ రాజారాం, కె.మల్లికార్జునరెడ్డి, బొగ్గారాపూర్‌ నాగా, గట్ట వెంకటేశ్వరరావు, ఎస్‌ఎస్‌ఎన్‌ రాజు, యు.గోపాల్‌రావు, బి.రమేశ్‌కుమార్‌, కంపల్లి శ్రీనివాస్‌, ఇమ్రాన్‌ఖాన్‌, టి.రోహిత్‌, బొళ్లబోలా ఆదిత్య, సీహెచ్‌ గణేశ్‌, తోట ఆనంద్‌ కిశోర్‌, షేక్‌ ఖాదర్‌, బి.రాజేశ్వర్‌.

* తెదేపా నేతలపై వైకాపా ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌ లక్ష్యంగా తెదేపా నేతలు చేసిన వ్యాఖ్యలను వివరించినట్టు రాష్ట్రపతితో భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. తప్పుచేసి దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే ఆయన దిల్లీకి వచ్చారని ఆరోపించారు.

* హుజూరాబాద్‌ ఉప పోరులో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయటం వల్లే హుజూరాబాద్‌లో భాజపా గెలుస్తోందని సంజయ్‌ పేర్కొన్నారు.

* హోరాహోరీగా సాగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు తన స్వగ్రామం హిమ్మత్‌నగర్‌లో ఓటర్లు షాకిచ్చారు. ఇక్కడ గెల్లుకు 358 రాగా, ఈటల రాజేందర్‌కి 549 ఓట్లు పోలయ్యాయి. గెల్లు అత్తగారి గ్రామం హుజూరాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లెలోని ఓటర్లు కూడా ఆయనకు హ్యాండ్‌ ఇచ్చారు. ఇక్కడ ఈటలకే 76 ఓట్ల అధిక్యం వచ్చింది. యాదవ సామాజిక వర్గం అధికంగా ఉన్న వెంకటరావుపల్లెతో పాటు సీఎం కేసీఆర్‌ దళితబంధు ప్రకటించిన శాలపల్లిలో కూడా ఓటర్లు తెరాసను ఆదరించలేదు.

* దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ స్థానాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. ఇందులో కొన్ని చోట్ల భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ చేయగా.. పశ్చిమ బెంగాల్‌లో భాజపాకు గట్టి పట్టున్న దిన్‌హటా నియోజకవర్గం దీదీ వశమైంది. కర్ణాటకలోనూ కాషాయ పార్టీకి మిశ్రమ ఫలితాలు దక్కాయి.

* మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌కు ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ గట్టి షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన దాదాపు రూ.1000కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ముంబయిలోని నారిమన్‌ పాయింట్‌లో గల నిర్మల్‌ టవర్‌తో పాటు మహారాష్ట్ర, దిల్లీ, గోవాల్లో ఆయనకు సంబంధించిన పలు ఆస్తులను ఐటీ శాఖ అధికారులు అటాచ్‌ చేసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

* పర్వానా మాలిక్‌కు తొమ్మిదేళ్లు.. బాగా చదువుకుని టీచర్‌ అవ్వాలని తన కల. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె కలలను తుడిచేశాయి. పేదరికం ఆమెను వివాహ బంధంలోకి నెట్టేసింది. అభం శుభం తెలియని పసి ప్రాయంలో 55ఏళ్ల వ్యక్తికి ఇల్లాలిని చేసింది. ఒక్క పూట తిండికి కూడా డబ్బుల్లేని పర్వానా తండ్రి.. కుటుంబాన్ని బతికించుకోవడం కోసం గత్యంతరం లేక తన 9ఏళ్ల కుమార్తెను పెళ్లి పేరుతో అమ్మకానికి పెట్టారు. ఒక్క పర్వానానే కాదు.. అఫ్గాన్‌లో అనేక మంది బాలికల దయనీయ పరిస్థితి ఇది..!

* వరుస నష్టాల నుంచి సోమవారం కోలుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు మళ్లీ నేలచూపులు చూశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు కాసేపటికే కిందకు దిగజారుతూ వెళ్లాయి. అలా చివరి గంట వరకు ఒడుదొడుకుల్లో కొనసాగి.. చివరకు నష్టాలతో ట్రేడింగ్‌ ముగించాయి. సెన్సెక్స్‌ 30 సూచీలోని కీలక కంపెనీలన్నీ నష్టాలు మూటగట్టుకున్నాయి. అలాగే లోహ ఇంధనం వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.

* వాతావరణ మార్పులపై పోరాటానికి ప్రపంచ దేశాలన్నీ గళమెత్తుతోన్న విషయం తెలిసిందే. అయితే.. ఇదే ముసుగులో చైనా తమ భూములను లాక్కోవడానికి యత్నిస్తోందని టిబెటన్లు ఆరోపిస్తున్నారు. తద్వారా తమ ప్రాథమిక హక్కులను, జీవనోపాధిని దెబ్బతీస్తోందని వాపోతున్నారు. ఇప్పటికే తమ భూములపై యాజమాన్య హక్కులను బలవంతంగా వదులుకోవాల్సి వచ్చిందని, దీంతోపాటు పశువుల మేతకు గడ్డి మైదానాలనూ వినియోగించుకోలేక పోతున్నామని చెబుతున్నారు.

* వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఎంతకాలం రక్షణ కల్పిస్తున్నాయనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా వైరస్‌ బారినపడి కోలుకున్న తర్వాత రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకునే వారిలో అత్యధిక యాంటీబాడీలు ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో మరోసారి వెల్లడైంది. ఈ అధ్యయనం జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (JAMA)లో ప్రచురితమైంది.

* పొట్టి ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు ఎదురైన రెండు వరస పరాజయాలు భారత క్రీడాభిమానులకు మింగుడుపడట్లేదు. మరోవైపు న్యూజిలాండ్‌ మ్యాచ్‌ అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కాకుండా.. బుమ్రా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మాజీ భారత క్రికెటర్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ స్పందిస్తూ.. బుమ్రా బదులు కోచ్‌ రవిశాస్త్రి మీడియాతో మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

* జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదానికి సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించేందుకు కొత్తగా ‘స్టేట్‌ ఇన్విస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎస్‌ఐఏ)’ని ఏర్పాటు చేశారు. జమ్ముకశ్మీర్‌లోని పోలీసులతోనే ఈ ఏజెన్సీని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రదాడులు, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, తప్పుడు ప్రచారాలు చేసి అరెస్టైన వారి కేసులను ఈ ఏజెన్సీ విచారించనుంది. అలాగే.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు సహాయసహకారాలు అందిస్తుంది.

* న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచి లేఖ వచ్చిన వెంటనే పంచ్‌ ప్రభాకర్‌ పోస్టులను యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ తొలగించాయని, అలాగే అకౌంట్‌ని బ్లాక్‌ చేశారని స్టాండింగ్‌ కౌన్సిల్‌ అశ్వినీకుమార్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై తాము కూడా లేఖ రాసినట్టు సీబీఐ తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. లేఖ రాసి ఉపయోగం ఏంటని ప్రశ్నించింది. పంచ్‌ ప్రభాకర్‌ని ఎలా పట్టుకుంటున్నారో చెప్పాలని కోరింది. ఇందుకు సీబీఐ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు చెప్పింది వినకపోతే మీరు చెప్పేది వినాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ ఏం చేయాలో తామే ఆదేశాలిస్తామని స్పష్టంచేసింది. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసే యోచన చేస్తామని తెలిపింది.

* కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైపై తనకున్న అభిమానాన్ని ఓ మహిళ భిన్నంగా చాటుకుంది. సీఎం తన ఇంటికి రావడంతో సంతోషంలో మునిగితేలిన ఆమె.. ముఖ్యమంత్రి చేతిపై ముద్దుల వర్షం కురిపించింది. దీంతో బొమ్మై ఒకింత ఇబ్బందికర పరిస్థితికి గురయ్యారు.