Business

మొత్తం అన్నీ వేలంపాట

nirav modi cars auctioned

*** రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌, పనామెరా, రెండు మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లు, మూడు హోండా కార్లు, టొయోటా ఫార్చునర్‌

పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు నీరవ్‌ మోదీకి మరో షాక్‌ తగిలింది. నీరవ్‌కు చెందిన 13 కార్లను వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ అతడికి చెందిన విలాస వంతమైన పెయింటింగ్స్‌ ద్వారా రూ.54.84 కోట్లు సేకరించింది. ఇప్పుడు ఈడీ వంతు వచ్చింది. ఏప్రిల్‌ 18న నీరవ్‌కు చెందిన అత్యంత విలాస వంతమైన కార్లను ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకానికి ఉంచనున్నారు. రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌, పనామెరా, రెండు మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లు, మూడు హోండా కార్లు, టొయోటా ఫార్చునర్‌, ఒక ఇన్నోవా తదితర కంపెనీలకు చెందిన కార్లు వీటిలో ఉన్నాయి. కార్లన్నీ సరైన స్థితిలోనే ఉండటంతో ఇవి మంచి ధర పలుకుతాయని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ వేలాన్ని నిర్వహించే కాంట్రాక్టును ప్రభుత్వం మెటల్‌ స్క్రాప్‌ ట్రేడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎంఎస్‌టీసీ)కు ఇచ్చింది. వేలంలో కార్లను కొనాలనుకునే వారు ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. కార్లు కొనాలనుకునే వారు కార్లను పరిశీలించవచ్చు. కానీ టెస్ట్‌ డ్రైవ్‌ చేయడానికి కుదరదు. వేలానికి ఒక వారం ముందుగా కొనుగోలుదారు కార్లను పరిశీలించుకునే వీలు కల్పించనున్నారు. కార్ల అంచనా ధర, తయారీ సంవత్సరం, కారు మోడల్‌, ఫొటోలు, ఇతర డాక్యుమెంట్లను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్లో ఉంచనున్నారు. వేలం పూర్తయిన తర్వాత కార్ల రిజిస్ట్రేషన్‌ కోసం కొంత గడువు ఇస్తారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వేల కోట్లకు మోసగించి విదేశాల్లో తలదాచుకుంటున్న నీరవ్‌ మోదీని లండన్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వెస్ట్‌ మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇతడికి బెయిల్‌ కూడా నిరాకరించింది.