Politics

ఆగష్టులో ఏపీ పంచాయతీ ఎన్నికలు

Andhra Pradesh Panchayat Elections In August

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీ రాజ్‌ శాఖలు కసరత్తులు మొదలు పెట్టాయి. ఆగష్టు చివరి, సెప్టెంబరు మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించాలని ఈ విభాగాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈనెల 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల వారీగా సర్పంచుల పదవులకు, వార్డు సభ్యుల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసి, ఆ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంది. గత ఏడాది ఆగస్టు 1వ తేదీ నాటికే పాత సర్పంచుల పదవీకాలం ముగిసి, ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు వాయిదా పడిన నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఇటీవల సమావేశమై ఆగస్టు, సెప్టెంబరు నెలలో ఎన్నికల నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించారు.