DailyDose

భారతదేశ హిందూ ఉగ్రవాద గురువు-గాడ్సే!

kamal haasan calls hindus the first terrorists of India

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యుం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారత్‌లో ‘తొలి ఉగ్రవాది హిందువే’ అని వ్యాఖ్యానించారు. నాథూరామ్‌ గాడ్సేను ఉద్దేశిస్తూ ఆయన ఈ విమర్శలు చేశారు. తమిళనాడులోని అరవకురిచిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఓ ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. దేశంలోని ప్రజలంతా సమానత్వంతో జీవించాలని కోరుకునే భారతీయుల్లో తానూ ఒకడినని అభిప్రాయపడ్డారు. త్రివర్ణ పతాకంలోని మూడు రంగులు వివిధ వర్గాల విశ్వాసాలను సూచించినట్లుగానే తాను కూడా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటానని వ్యాఖ్యానించారు. ‘‘ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్న కారణంగా నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. గాంధీ విగ్రహం ఎదుట నిలబడి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. స్వతంత్ర భారత్‌లో తొలి ఉగ్రవాది ఒక హిందువు.. ఆయన పేరు నాథూరామ్‌ గాడ్సే. అప్పటి నుంచే ఈ ఉగ్రవాదం ప్రారంభమైంది’’ అని కమల్‌ హాసన్‌ చెప్పుకొచ్చారు. ఒక గాంధేయవాదిగా ఆయన హత్యకు గల కారణాలను తెలుసుకోవాలనుకుంటున్నానని కమల్‌ అన్నారు. గతంలోనూ కమల్‌ హాసన్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. 2017 నవంబరులో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘హిందూ తీవ్రవాదం’ అనే పదజాలం ఉపయోగించారు. కమల్‌ వ్యాఖ్యల్ని అప్పట్లో భాజపాతో పాటు పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాయి. మే 19న అరవకురిచి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎమ్‌ఎన్‌ఎమ్‌ తరఫున ఇక్కడి నుంచి మోహన్‌రాజ్‌ అనే అభ్యర్థి బరిలోకి దిగారు. ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన కమల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.