Devotional

22నుంచి కళ్యాణవెంకన్న బ్రహ్మోత్సవాలు

kalyana Venkateswara Brahmotsavam TTD In 2019

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాల గోడ ప‌త్రిక‌లు అవిష్క‌రించిన టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాల గోడ ప‌త్రిక‌లను టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం గ‌రువారం ఉద‌యం అవిష్క‌రించారు. తిరుప‌తిలోని జెఈవో క్యాంపు కార్యాల‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ మే 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వ‌సంతోత్స‌వాలు వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్ర‌తిరోజు మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, రాత్రి 7.00 నుండి 8.00 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్స‌వం జ‌రుగుతుంద‌న్నారు.
**మే 23న స్వర్ణరథోత్సవం
మే 23వ తేదీ గురువారం సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరుగనుంద‌ని తెలిపారు. గృహస్తులు(ఇద్దరు) ఒక రోజుకు రూ.516/- చెల్లించి ఈ వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, అష్టోత్తర శతకలశాభిషేకం, తిరుప్పావ‌డ‌ సేవలను టిటిడి రద్దు చేశింది. ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ ధ‌నంజ‌యులు, ఏఈవో శ్రీ ల‌క్ష్మ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీఅనీల్‌ కుమార్‌, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
1. యాదాద్రిలో బెల్లం లడ్డూలకు విశేష స్పందన
యాదాద్రి దేవస్థానంలో బెల్లం లడ్డూల విక్రయాలకు సంబంధించి, స్వామి జయంతి ఉత్సవాల మొదటి రోజైన బుధవారం భక్తులనుంచి విశేష స్పందన లభించింది.100 గ్రాముల బెల్లం లడ్డూ ధరను రూ.25 వంతున నిర్ణయించామని ఈవో గీత తెలిపారు.
2. యాదాద్రిలో నృసింహ ఉత్సవాలు ప్రారంభం
లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం నృసింహ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత విష్వక్సేనుడిని ఆరాధిస్తూ మంత్రపఠనాలతో జలశుద్ధి నిర్వహించారు. పూజించిన జలంతో స్వస్తివాచనం, ఉత్సవ మూర్తులకు లక్ష కుంకుమార్చన ద్వారా వేడుకలకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ఈవో గీత పాల్గొన్నారు.
3. పరిణయోత్సవాలు పరిసమాప్తం
తిరుమలలో మూడు రోజుల పాటు సాగిన పద్మావతి పరిణయోత్సవాలు బుధవారం పరిసమాప్తమయ్యాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ప్రత్యేకంగా రూపొందించిన దశావతారం మండపంలో ఈ వేడుకలను తితిదే వైభవంగా నిర్వహించింది. చివరి రోజు శ్రీమలయప్పస్వామి గరుడవాహనంపై కల్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా రాగా.. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు బంగారు పల్లకిపై చేరుకున్నారు. పద్మావతి, శ్రీనివాసుల పరిణయ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవతామూర్తులు బంగారు పల్లకిలో ఊరేగుతూ శ్రీవారి ఆలయానికి చేరుకోవడంతో ఉత్సవాలు ముగిశాయి.
4. శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారి అర్చన, తోమాల సేవల్లో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా.. తిరుమల ఇన్‌ఛార్జి జేఈవో లక్ష్మీకాంతం శ్రీవారి పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం పార్వేట మండపం వద్ద జరుగుతున్న కారీరిష్టి యాగశాలను న్యాయమూర్తి దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా రుత్విక్కులు యాగం వైశిష్ట్యాన్ని జస్టిస్‌ రమణకు వివరించారు. తిరుమల నుంచి తిరుగు ప్రయాణంలోభాగంగా తిరుపతిలోని కపిలతీర్థం ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. తితిదే ఆధ్వర్యంలో స్థానికంగా నిర్వహిస్తున్న వరుణయాగంలో కూడా జస్టిస్‌ రమణ దంపతులు పాల్గొన్నారు.
5. 27 నుంచి శుభప్రదం
తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: భారతీయ సనాతన ధర్మంలోని మానవీయ నైతిక విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తితిదే ఏటా వేసవిలో శుభప్రదం కార్యక్రమం నిర్వహిస్తోంది. 7,8,9 తరగతుల విద్యార్థులకు ఈనెల 27 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనుంది. తిరుపతిలోని 7 కేంద్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 3,500 మంది బాలబాలికలకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేపట్టారు. బాలబాలికలకు విడివిడిగా శిక్షణ, వసతి, బస, భోజనం అందిస్తారు. హెచ్‌డీపీపీ ప్రోగ్రాం అసిస్టెంట్‌, జిల్లా ధర్మప్రచార మండలి సభ్యులు, తితిదే కల్యాణ మండపాలతో పాటు తితిదే వెబ్‌సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంచారు. పూర్తి చేసిన వాటిని తిరిగి ఆయా కేంద్రాల్లోనే సమర్పించాల్సి ఉంటుంది.
*17న భక్తులతో భవదీయుడు
తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో ఈనెల 17వ తేదీన భక్తులతో భవదీయుడు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు తితిదే తిరుపతి జేఈవో లక్ష్మీకాంతం అందుబాటులో ఉంటూ ఫోన్‌కాల్స్‌ స్వీకరిస్తారు. ప్రతినెల మూడో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తిరుచానూరు, ఒంటిమిట్ట, తిరుపతి, అప్పలాయగుంట, నారాయణవనం, నాగలాపురంలోని తితిదే స్థానికాలయాలు, తిరుపతిలోని తితిదే వసతి సముదాయాలపై భక్తులు ఫోన్‌ 0877-2234777 నంబరు ద్వారా నేరుగా జేఈవోకు సూచనలు, సలహాలు అందిచవచ్చు.
6. శుభమస్తు
తేది : 16, మే 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ద్వాదశి
(నిన్న ఉదయం 10 గం॥ 37 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 8 గం॥ 16 ని॥ వరకు)
నక్షత్రం : హస్త
(నిన్న ఉదయం 7 గం॥ 17 ని॥ నుంచి
ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 42 ని॥ వరకు)
యోగము : సిద్ధి
కర : బాలవ
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 34 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 53 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 4 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 26 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 49 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 44 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 40 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : కన్య
7. చరిత్రలో ఈ రోజు/మే 16
1804: ఫ్రెంచి సెనేటు నెపోలియన్ బోనపార్టె ను చక్రవర్తిగా ప్రకటించింది.
1830: ఫ్రాన్సు కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ మరణం (జ. 1768).
831: మైక్రోఫోను సృష్టికర్త డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ జననం (మ.1900).
1881: మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ట్రాము, బెర్లిన్ (జర్మనీ) సమీపంలో, ప్రజల కు అందుబాటు (ప్రజసేవ) లోకి వచ్చింది.
1929: హాలీవుడ్ లో మొదటిసారిగా అకాడమీ పురస్కారాలు ప్రధానం చేయబడ్డాయి.
1960: భారతదేశంలో మొట్టమొదటి సారిగా భారత-బ్రిటన్ల మధ్య టెలెక్స్ సర్వీసు ప్రారంభమైంది
1996: భారత 11వ ప్రధానమంత్రి గా అటల్ బిహారీ వాజపేయి నియమితుడైనాడు.
8. తిరుమల సమాచారం ఈ రోజు గురువారం. 16.05.2019
ఉదయం 5 గంటల సమయానికి, తిరుమల: *23C° – 36C°*
నిన్న *74,309* మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని *02*
గదులలో భక్తులు
వేచియున్నారు,
ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*06* గంటలు పట్టవచ్చును,
నిన్న *35,823* మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు
నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.17* కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_
9. భద్రాద్రిలో బెల్లం ప్రసాదాలు సిద్ధం
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఇప్పటికే ఉన్న ప్రసాదాలకు తోడు కొత్తగా బెల్లంతో తయారైన ప్రసాదాలను సిద్ధం చేశారు. వీటిని బుధవారం నుంచి విక్రయించనున్నట్లు ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పెద్ద ఆలయాల్లో బెల్లం ప్రసాదాల తయారీకి ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో ఈ తరహా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. 100 గ్రాముల బెల్లం లడ్డూ ధర రూ.20 నిర్ణయించారు. 100 గ్రాముల బెల్లం పొంగలి రూ.10, 100 గ్రాముల బెల్లం రవ్వ కేసరి రూ.10 నేటి నుంచి కౌంటర్లలో భక్తులకు అందించనున్నారు. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం లేనందున ఎప్పటికప్పుడు రద్దీకి అనుగుణంగా తాజా ప్రసాదాలను తయారు చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల నుంచి వీటికి లభిస్తున్న ఆదరణను చూసి తయారీలో సంఖ్యను పెంచే అవకాశం ఉంది. ప్రత్యేక బృందం పర్యవేక్షణలో రెండు మూడు పద్ధతుల్లో వీటిని తయారు చేసి అన్ని రకాలుగా నాణ్యంగా తయారైన ప్రసాదాన్ని ఖరారు చేశారు. ఇప్పటి వరకు పంచదారతో తయారు చేస్తున్న ప్రసాదాలను విక్రయిస్తున్నారు. ఇందులో 500 గ్రాముల మహా లడ్డూ ధర రూ.100, 100 గ్రాముల చిన్న లడ్డూ రూ.20, 200 గ్రాముల పులిహోర ధర రూ.10, 150 గ్రాముల చక్కెర పొంగలి ధర రూ.10 ఉంది. ఇందులో చక్కెర పొంగలి పరిమాణాన్ని 150 గ్రాముల నుంచి 100 గ్రాములకు తగ్గించే యోచనలో ఉన్నట్లు ఈవో తెలిపారు. ప్రసాదాల విభాగంలో రూ.కోట్లలో వార్షిక లావాదేవీలు ఉండగా ఇందులో చక్కెర పొంగలిపై నష్టం వాటిల్లుతోంది. దీని దృష్టిలో ఉంచుకుని ధరను పెంచకుండా తూకాన్ని తగ్గించే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
10.గజేంద్ర మోక్షం ఎన్నడో!
ఉత్సవాల వేళ భగవంతుణ్ని దర్శించుకుంటే అదే అసలైన పండుగ. దీన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమైన ఆలయాల్లో కొన్ని పత్యేక సంబరాలను నిర్వహించి భక్తులను మంత్రముగ్ధులను చేస్తుండటం సర్వసాధారణంగా మారింది. ఇలాంటి విశిష్ట వేడుకల నిర్వహణలో భద్రాచలం రామాలయం ప్రత్యేకతను చాటుతోంది. ప్రతీ క్రతువు ఒక తరానికి గుర్తుండేలా సాగినప్పటికీ ఇందులో రెండు ఉత్సవాలు మాత్రం ఇంకా పరిపూర్ణం కావాల్సి ఉందన్నది భక్తుల భావన. శతవర్ష ఉత్సవాల వేళ ఇలాంటి ఇంకో ఉత్సవం త్వరలోనే ఉంటుందని చెప్పినప్పటికీ ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఐదున్నర దశాబ్దాల తర్వాత ఇటీవల నిర్వహించిన శ్రీరామ క్రతువులోను ఒక ప్రశ్న భక్తులను తొలుస్తునే ఉంది. ఈ నెల 9న అంబారీ సేవ ఉంటుందని ప్రచారం చేసినప్పటికీ రకరకాల కారణాలతో ఏనుగులు రాలేదు. శోభాయాత్ర అత్యంత వైభవాన్ని చాటినప్పటికీ గజరాజులను చూడలేకపోయామన్న బాధ మాత్రం మిగిలే ఉంది. వీటి నిర్వహణపై వైదిక పెద్దలు స్పష్టమైన హామీలిచ్చినందున వీలైనంత తొందరగా తమకు వైదిక ఆనందం కలిగించాలని కోరుతున్నారు.
**కవచం కోసం ఇచ్చిన విరాళాలు దాచుకుంటారా?
కల్యాణ విగ్రహాలకు కవచ అలంకరణ కోసం 2016 మార్చిలో శతవర్ష ఉత్సవాలను నిర్వహించారు. దాదాపు నెల రోజుల పాటు నిత్య హోమాలు కొనసాగాయి. సుమారు 5 కిలోల బంగారంతో ప్రముఖ స్థపతుల పర్యవేక్షణలో సీతారామలక్ష్మణ స్వామి వారి మూర్తులకు కవచాలను అలంకరించారు. ఈ వేడుకకు చిన్న జీయర్‌స్వామి రావడంతో ఉత్సవాల వైభవం రెట్టింపైంది. వందేళ్లకు ఒకసారి ఇలాంటి సంబరాలను విగ్రహాలకు చేస్తుండగా వీటికి మరో కవచాన్ని కూడా ఏర్పాటు చేయాలని వైదిక పెద్దలు భావించారు. దీనికే శోభా కవచం అని పేరు పెట్టారు. ఎంతో ప్రాచీనమైన విగ్రహాలు శాశ్వత కాలం పూజలు అందుకునే విధంగా శోభా కవచం దోహద పడుతుందని అనుకున్నారు. ఇందు కోసం వైదిక పెద్దలు నిర్ణయించిన వెంటనే కొంతమంది దాతలు ముందుకు వచ్చి సుమారు 2 కిలోల బంగారంతో పాటు రూ.లక్షల్లో నగదును సమర్పించారు. శోభా కవచానికి 5 కిలోల బంగారం అవసరం అవుతుందని అంచనా. దాతల ద్వారా మిగతా బంగారాన్ని గానీ దీనికి సరిపడా నగదు రూపంలో గానీ విరాళాలను సేకరించగలిగితే రెండో కవచం ఏర్పాటుకు ఆటంకాలు ఉండవని అంటున్నారు. ఈ మధ్య ఓ దాత రామాలయాన్ని దర్శించుకోగా ఇక్కడి పరిస్థితి తెలుసుకుని గోశాల కోసం రూ.కోటి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇలాంటి దాతల సాయం తీసుకునే వీలుంది. కవచం కోసం ఇచ్చిన విరాళాలను ఆ పనికి కాకుండా బ్యాంకుల్లో భద్రపర్చడం వల్ల మిగతా దాతలు సైతం ఆలోచనలో పడే ప్రమాదం ఉంది. ఇక్కడ కావాల్సిందల్లా చిత్తశుద్ధితో కూడిన చొరవ మాత్రమే. అధికారులు పట్టించుకోకుంటే అపవాదు తప్పదు.
**గజరాజ సేవ అవసరమే
రామాలయంలో గజరాజులతో సేవ చేయడం కొత్తేమీ కాదు. 1986 వరకు ఇక్కడ దేవుడికి ఒక ఏనుగు ఉండేది. ఆ తర్వాత దీన్ని వేరే చోటకు తరలించి మరో దాన్ని తెప్పించాలనుకున్నారు. ఎందుకో ఏమో అప్పటి నుంచి ఏనుగు లేకుండా రాజాధి రాజుగా ముల్లోకాలలో కీర్తిగాంచిన శ్రీరామచంద్ర ప్రభువుకి ఉత్సవాలు సాగుతున్నాయి. అశ్వాలతో పాటు గజరాజులతో వేడుక చేయాలని కొంతమంది వైదిక పెద్దలు అనుకున్నప్పటికీ దేవాదాయ శాఖ నుంచి సరైన సహకారం అందడం లేదు. జంతువులకు సంబంధించిన చట్టాలన్నీ గుర్తుకు వచ్చి తమకెందుకొచ్చిన కొలుపని మెదలకుండా ఉంటున్నారు. దాదాపు 55 సంవత్సరాల క్రితం భద్రాద్రిలో అంబారీ సేవను పెద్ద జీయర్‌స్వామి చేశారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని చిన్న జీయర్‌స్వామి సూచనలతో అహోబిల రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ నెల 9న ప్రధాన వీధుల్లో రెండు ఏనుగులతో అంబారీ సేవను ఏర్పాటు చేశారు. లోపం ఎక్కడుందో గానీ ఏనుగులు రాలేదు. ఉత్సవం బాగానే జరిగినప్పటికీ గజరాజు సేవను కళ్లారా వీక్షించాలనుకున్న వాళ్లకు ఈ మోక్షం లభించలేదు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోని పెద్ద దేవాలయాలకు గజరాజులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ఆలయాలకు సైతం ఈ సదుపాయం ఉంది. తెలంగాణలో మాత్రం దీన్ని ఖర్చుతో కూడుకున్న పనిగా భావించడంతో దేవుడి ఉత్సవాలలో ఆ తరహా సందడి కనిపించడం లేదు. పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తే గజరాజులను ఉత్సవాల కోసం తీసుకురావచ్చని పలువురు సూచిస్తున్నారు. వైదిక పెద్దలే చొరవ తీసుకుని నియమ నిబంధనలు పాటించి దీన్ని నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు.
**దెబ్బతిన్న బంగారంతో కవచం చేయవచ్చు
రామయ్యకు సుమారు 53 కిలోల బంగారం ఉంది. ఇది కాకుండా 9 కిలోల 865 గ్రాముల బంగారాన్ని బాండ్‌ రూపంలో మార్చి బ్యాంకులో దాచారు. 830 కిలోల వెండి ఉంది. ఇది గత ఏడాది ప్రకటించిన నివేదిక. కొత్తగా వచ్చిన కానుకలను పరిగణలోకి తీసుకుంటే బంగారంతో పాటు వెండి తూకం ఇంకాస్త పెరిగే వీలుంది. ఈవో రమేశ్‌బాబు ప్రత్యేక దృష్టి సారించి పటిష్ట బందోబస్తు నడుమ ఇటీవల ప్రతీ కానుక వాస్తవ బరువును లెక్కించేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నివేదిక ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అవసరమైతే దేవాదాయ శాఖ అనుమతితో శోభా కవచానికి రామాలయంలో ఉన్న బంగారాన్ని ఉపయోగించవచ్చని పండితులు సూచిస్తున్నారు. దెబ్బతిన్న గొలుసులు, ఉపయోగంలో లేని ఆభరణాలను ప్రభుత్వ సంస్థలో కరిగించి కవచం కోసం వాడుకోవచ్చని అంటున్నారు. ఇదంతా ఎందుకులే అనుకుంటే దాతలను సంప్రదించాల్సిందే. అప్పుడు బంగారం భద్రంగా ఉండడంతో పాటు ఉత్సవం వైభవాన్ని చాటే వీలుంది. శోభా కవచం ఏర్పాటు వేళ గజరాజు సేవ చేస్తే అది భక్తులకు పరమానందమే.
11. బాసర,శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానం. ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్న, తెలంగాణ రాష్ట్ర హై కోర్టు జడ్జి శ్రీదేవి గారు, వీరికి ఆలయ మర్యాదాలతో స్వాగతము పలికి, ప్రత్యేక పూజ చేసిన ఆలయ పూజారులు, వీరి వెంబడి ఆలయ కార్యనిర్వహాణాధికారి సంధ్యారాణి గారు, ఆలయ ఛైర్మెన్ శరత్ పాఠక్ గారు,ఆలయ Aeo శ్రీనివాస్ గారు,నిర్మల్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు, నిర్మల్ జిల్లా SP శశిధర్ రాజు గారు, DSP రాజేష్ బల్లా గారు, ASP దక్షిణామూర్తి గారు,బాసర మండల SI తోట మహేష్ గారు ఉన్నారు.
12. 18న కేదర్‌నాథ్‌కు ప్రధాని మోదీ
దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్‌ధామ్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మే 18వ తేదీన కేదర్‌నాథ్ ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఉత్తరాఖండ్ విపత్తు దళం అప్రమత్తమైంది. కేదర్‌నాథ్ ఆలయ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్‌ధామ్ యాత్ర మే మొదటి వారంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
13. నెల్లూరు జిల్లాపెంచలకోన క్షేత్రంలో జరుగుతున్న శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..మంత్రి సోమిరెడ్డికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం సత్కరించడంతో పాటు క్షేత్ర ప్రాశస్త్యాన్ని వివరించిన చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు, అర్చకులు..పెనుశిల క్షేత్రాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని, పెంచల స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి రైతులు, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన మంత్రి సోమిరెడ్డి..
14. హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం శ్రీ‌గోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. త్రేతాయుగంలో రామభక్తునిగా ప్రసిద్ధిగాంచినవాడు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్త్వాన్ని బోధించినట్టు ప్రాచీనవాఙ్మయం నుండి తెలుస్తోంది. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి. అందువల్ల రాముని ప్రతిరూపమైన వేంకటేశ్వరుని హనుమంతుడు మోయడం ఉపపన్నమే. శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు. అనంతరం ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేశారు. కాగా సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరగనుంది. అనంతరం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు శ్రీవారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతారు. రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
*గ‌జ వాహ‌నం – హైందవ సనాతన ధర్మంలో ప్రతి ఒక్క జంతువుకు ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో గానీ, రాజదర్బారులో గానీ, ఉత్సవములలో గానీ గజానిదే అగ్రస్థానం. సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మీదేవికి ఇష్టవాహనం అయిన గజవాహనం లక్ష్మీపతికి కూడా వాహనంగా విశిష్టసేవలు అందిస్తోంది.
* సాంస్కృతిక కార్యక్రమాలు – శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు ఎస్‌.వి.సంగీత నృత్యకళాశాల వారిచే మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి జి.పార్వ‌తి బృందం విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. సాయంత్రం 5.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు భక్తి సంగీతం వినిపిస్తారు. శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణి వద్ద సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అన్న‌మాచార్య సంకీర్త‌న‌ల ఆలాప‌న ఉంటుంది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటి ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ జ్ఞానప్రకాష్‌, శ్రీ శ్రీ‌హ‌రి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.