Devotional

కాళేశ్వరంలోని ఆలయానికి కేసీఆర్ భారీ వరాలు

TRS Govt To Spend 100 Crore INR On Kaleswaram Temple

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామి ఆలయ రూపురేఖలు మారనున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ముక్తేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి అధికారులతో సీఎం చర్చించారు. ముక్తేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు. కాళేశ్వరాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలనే సంకల్పం ఉందని వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి 600 ఎకరాలు సేకరించాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఫారెస్టు భూములను సేకరించాలని అధికారుల్ని ఆదేశించారు. కల్యాణ మండపంతో పాటు ఆలయ నిర్మాణాన్ని విస్తరించాల్సి ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అర్చకుల కోసం క్వార్టర్స్‌, వేద పాఠశాల, కళాశాలతో కూడిన ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తామని తెలిపారు. ప్రాజెక్టు పూర్తవుతున్న సందర్భంలో ఒక యాగాన్ని నిర్వహించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ఆలయ పునఃనిర్మాణానికి శృంగేరి పీఠాధిపతి భారతి తీర్థస్వామిని ఆహ్వానించినట్లు సీఎం తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరు అందించనున్నట్లు వివరించారు.