NRI-NRT

నా అపజయమే నా విజయానికి నాంది

Powerstar Pawan Kalyan Mesmerizing Speech At TANA 2019 In Washington DC

* తానా సభలో అదిరిపోయే ప్రసంగం చేసిన పవన్
* కులాలు మతాల మీద విడిపోతున్నాం
* విలువలు సమాజం భవిత కోసం కలిసి నడుద్దాం
* ప్రవాసులతో పలు నగరాల్లో త్వరలో సదస్సులు

కులాలు మతాలు ఆధారంగా భారతదేశం దాని ప్రజలు విడిపోతున్నారనే బాధలో నుండి విలువలకు కట్టుబడే రాజకీయలతో పౌర సమాజాన్ని ఏకీకృతం చేసి ఐకమత్యంగా బంగారు భవిత దారిలోకి తీసుకువెళ్లేందుకు తాను జనసేన పార్టీ పెట్టానని, కానీ దాని ఆవిర్భావ ఎన్నికల పోటీ నుండి లభించిన అపజయాన్ని తన విజయానికి నాందిగా భావిస్తున్నానని ప్రముఖ సినీనటులు, జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ 22వ తానా మహాసభల రెండో రోజు సాయంకాల సమావేశంలో కీలకోపన్యాసం చేస్తూ పేర్కొన్నారు. ఓటమి నుండి విజయాన్ని అందుకోవడం నెల్సన్ మండేలా నుండి, థామస్ అల్వా ఎడిసన్ నుండి తాను నేర్చుకున్నానని ఆయన పేర్కొన్నారు. తనకు ఓర్పు ఎక్కువ అని, ఎన్ని అడ్డంకులు కష్టాలు ఎదురైనా విలువలకు కట్టుబడే రాజకీయాలు చేస్తానని, సమాజం విచ్ఛిన్నం కాకుండా చేసే ఏకైక సాధనం మంచి రాజకీయాలు మాత్రమేనని ఆయన వెల్లడించారు. తనకు ఎప్పటినుండో విశ్వనాధ కావ్యాలు చదవాలని కోరిక ఉండేదని, ఆ పుస్తకాల కోసం ఎంత ప్రయత్నించిన దొరకకపోతే ఒక ప్రవాసుడు 40సంపుటాలను తనకు కానుకగా పంపించారని, Y2K ముందు వరకు తన సినిమాలకు అమెరికాలో మంచి ఆదరణ ఉండేది కాదని, ప్రవాసులు ఐటీ ఉద్యోగుల వలనే తనకు అమెరికాలో కూడా ఆదరణ పెరిగిందని అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. తానా సభలకు వెళ్లవద్దని ఏవేవో కారణాలు మంతనాలు సలహాలు తనకు అందాయని కానీ కులాల కోసం విడిపోవడం కన్నా సమాజం కోసం రేపటి తరం కోసం విలువలతో కూడి అందరం కలిసి నడక సాగించాలనే తాను తానాకు వస్తానని మాట ఇచ్చానని, ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు ఈ వేడుకల్లో ఆనందం పాల్గొంటున్నానని పవన్ పేర్కొన్నారు. గతంలో ఎన్నో తెలుగు సంఘాలు తనకు ఆహ్వానం పలికాయని కానీ అమెరికాలో పాతది పెద్దది అయిన తానాను ఎన్నుకోవడం వెనుక దాని సేవా చరిత్ర ఉందని పవన్ వెల్లడించారు. భారతీయుల ఆలోచనలు అన్నీ కలిసికట్టుగా ఉండాలని అప్పుడే బలమైన భారతదేశం తయారవుతుందని అన్నారు. రానున్న కాలంలో అమెరికాలోని అన్ని ప్రముఖ నగరాల్లో చిన్న చిన్న సమావేశాల ద్వారా ప్రవాసులతో మమేకం అయ్యేందుకు తాను ప్రణాళికలు రూపొందించుకున్నట్లు పవన్ తెలిపారు. జనసేన ఓటమి విలువలతో కూడుకున్నదని అందుకు గర్వంగా ఉందని పవన్ అనడంతో సభికులు హర్షధ్వానాలు చేశారు. “మనం తెలుగువాళ్లం. మనం భారతీయులం. మనం మనుషులం. భారతమాతకు జై” అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం తానా అధ్యక్షుడు వేమన సతీష్, తానా సభల సమన్వయకర్త డా.మూల్పూరి వెంకటరావు, తానా సభల ఛైర్మన్ డా.కొడాలి నరేన్‌లు పవన్, నాదెండ్ల మనోహర్‌లను సన్మానించారు. అనంతరం కార్యవర్గంతో చిత్రాలు దిగారు.