Movies

కూతురి పెళ్లికి పిలుస్తారా?

Shakti Kapoor Expects An Invitation To His Daughter Shraddha Kapoors Wedding

‘సాహో’ భామ శ్రద్ధా కపూర్‌ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ రోహన్‌ శ్రేష్ఠతో శ్రద్ధ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని, 2020లో వీరు పెళ్లిపీటలెక్కబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై శ్రద్ధ తండ్రి శక్తి కపూర్‌ మీడియా ద్వారా స్పందించారు. ‘నిజమా? నా కూతురు పెళ్లి చేసుకోబోతోందా?పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోకండి. పెళ్లెక్కడో ముందే చెప్పండి. నేను వస్తాను. నేను తండ్రినే అయినా ఈ వివరాలేవీ నాకు తెలీవు’ అంటూ తనదైన శైలిలో చమత్కరించారు.గతంలో శ్రద్ధ పెళ్లి గురించి శక్తి స్పందిస్తూ.. ‘మంచి కుటుంబానికి కోడలిగా తమ కూతురు వెళ్లాలని ప్రతి తండ్రి కోరుకుంటారు. నేనూ అంతే. కానీ ఇప్పుడు నా పిల్లల విషయంలో నేను జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే తల్లిదండ్రులు చూపించినవాళ్లని పెళ్లి చేసుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. నచ్చిన అబ్బాయినే శ్రద్ధ పెళ్లి చేసుకుంటుంది. మాకు అందులో ఎలాంటి అభ్యంతరం లేదు’ అని పేర్కొన్నారు.అయితే శ్రద్ధ మాత్రం ఈ విషయాలపై ఇప్పటివరకు నోరు విప్పింది లేదు. ‘సాహో’ చిత్రంలో శ్రద్ధకు సంబంధించిన చిత్రీకరణ పూర్తైంది. ఆగస్ట్‌ 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆమె.. ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డి’, ‘బాఘి 3’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.