Food

ఆహారం ఉంటుంది గానీ అందులో పోషకాలు ఉండవు

By 2050 You Will Have Food That Has No Nutrients

‘తిండి కలిగితే కండ కలదోయ్. కండ కలవాడేను మనిషోయ్’ అని ఎంత చెప్పుకొన్నా భవిష్యత్తులో ఫలితం ఉండకపోవచ్చు! ఎందుకంటే… వాతావరణ కాలుష్యం, కార్బన్ డైఆక్సైడ్ స్థాయులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా 2050 నాటికి ఆహారంలో మాంసకృత్తులు, ఇనుము, జింకు వంటి కీలక పోషకాలు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదముందని ఆహార విధాన పరిశోధన సంస్థ హెచ్చరించింది. వచ్చే 30 ఏళ్లలో వరి ధాన్యం, గోధుమలు, జొన్న, బార్లీ, దుంపలు, సోయా, కూరగాయలు వంటి పంటల్లో పోషకాలు గణనీయంగా తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార పంటలపై వాతావరణ కాలుష్యం ఎలాంటి ప్రభావం చూపుతోందన్న దానిపై తాజా పరిశోధన వివరాలను ఆ సంస్థ వెల్లడించింది. ‘‘ఉష్ణోగ్రతలు పెరుగుతూ, వాతావరణం తీవ్రంగా కలుషితమవుతున్న ఫలితంగా… భవిష్యత్తులో ప్రపంచం గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఆహారం ద్వారా అందుతున్న ప్రొటీన్లు 19.5%, ఇనుము ధాతువు 14.4%, జింక్ 14.6% తగ్గిపోతాయి. దక్షిణాసియాలో ఇనుము, జింకు ధాతువులు కనీస ప్రమాణ స్థాయిలోనూ ఉండవు.