Politics

పిల్లచేష్టలు మానుకోండి-పవన్ హెచ్చరిక

Pawan Kalyan Warns AP Ministers And Govt Not To Move Capital

రాజధాని అంటే పిల్లల ఆటలు కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. స్థానిక రైతులు భూములిచ్చింది వ్యక్తులకు కాదని, ఏపీ ప్రభుత్వానికని గుర్తు చేశారు. రాజధానికి కులం రంగు పులిమి వేరే చోటకు తరలిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని వ్యాఖ్యానించారు. రాజధాని ఇక్కడ నుంచి కదలదని రైతులకు హామీ ఇస్తున్నా అని పవన్‌ అన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి 29 గ్రామాల నుంచి రాజధాని ప్రాంత రైతులు భారీగా తరలివచ్చారు. ‘‘రైతులు భూములు ఇచ్చింది వ్యక్తులకు కాదు.. ఏపీ ప్రభుత్వానికి. అమరావతి రాజధాని కోసం రైతులకు అండగా నిలబడతా. భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేసేందుకు జనసేన కృషి చేస్తుంది. రైతుల ఆందోళన చూసే రెండ్రోజుల పాటు రాజధానిలో పర్యటించా. పాలకుల చేతుల్లో ప్రజలు పడుతున్న బాధలు చూసే పార్టీ పెట్టా. నాయకుల మధ్య వ్యక్తిగత వైరం ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అమరావతి రాజధానికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చింది. మోదీకి తెలిసే అమరావతి రాజధాని ఏర్పాటైంది. 2014లో వైకాపా అధికారంలోకి వచ్చి ఉంటే దొనకొండలో రాజధాని పెడితే వారిష్టం. కానీ 151 మంది ఎమ్మెల్యేలున్నారు కదా.. అమరావతి కాకుండా మరోచోట పెడతామనే గందరగోళ ప్రకటనలు చేయవద్దు’’ అని పవన్‌ హితవు పలికారు. ‘‘రాజధానికి కులం రంగు పులిమి తరలిస్తామంటే కుదరదు. అమరావతిలో బీసీలు, ఎస్సీలు, కూడా ఉన్నారు. ప్రభుత్వాలు అంటే చిన్నపిల్లల ఆటలు కాదు. వేలమంది ప్రజలను మనోవేదనకు గురిచేయడం శ్రేయస్కరం కాదు. గత ప్రభుత్వంలో వ్యక్తులు తప్పు చేసి ఉంటే వారిని విచారించి శిక్షించండి. రాజధాని విషయంలో ప్రభుత్వ వైఖరిని మారకుంటే ప్రధాని మోదీని, అమిత్‌షాను కలుస్తా. అమరావతి అందరిదీ అనే భావన ప్రజల్లో కల్పించాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలుండాలి. రాజధాని రైతులు భూములు అమ్ముకోవద్దు’’ అని సూచించారు. ‘‘జగన్‌ కుటుంబ సభ్యులుగానీ, సన్నిహితులు గానీ ఎవరూ చెడు ప్రకటనలు చేయడం లేదు. చెడు వార్తలకు బాధ్యులు కావొద్దని బొత్సకు విన్నవిస్తున్నా. భవిష్యత్‌లో బొత్స సీఎం అవుతారేమో. అది దృష్టిలో పెట్టుకుని బొత్స ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలి. ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి అవుదామనుకుని బొత్స అనుకున్నా అప్పట్లో జరగలేదు. భవిష్యత్‌లో అది జరగొచ్చేమో!’’ అని వ్యంగ్యంగా పవన్‌ వ్యాఖ్యానించారు. రాజధానిని వ్యతిరేకిస్తున్నారంటే మోదీని, అమిత్‌షాను వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఫోక్స్‌వ్యాగన్‌ కేసులను బొత్స గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. ఇతర నాయకులు కూడా బొత్సలా మాట్లాడకుండా ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు.