DailyDose

బిచ్చమెత్తిన కన్నా లక్ష్మీనారాయణ-తాజావార్తలు-10/07

Kanna Laxminarayana Becomes Beggar-Telugu Breaking News-10/07

* అరెస్టులకు మేం భయపడమని సమ్మెను కొనసాగిస్తామని తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ ఐకాస నేతలు నివాళులర్పించేందుకు అక్కడికి వెళ్లడంతో.. అనుమతి లేదంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నివాళులర్పించేదుకు వచ్చిన వారిని అదుపులోకి తీసుకోవడాన్ని అశ్వత్థామరెడ్డి తప్పుబట్టారు.

* ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

* ఏపీలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలో నూతన ఇసుక విధానాన్ని నిరసిస్తూ గుంటూరు భాజపా ఆధ్వర్యంలో ఆయన నిరసన తెలిపారు. పట్నంబజారులో భిక్షాటన చేశారు. ఇసుక కొరతతో భవననిర్మాణ కార్మికులు ఉపాధికోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

* ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఇసుక రుచి బాగా తెలిసినట్లుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇసుక విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిర్మాణరంగాన్ని కుదేలు చేసిందని ఆయన విమర్శించారు. అధికార పార్టీ నాయకులు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు.

* మెట్రో రైల్‌ డిపో నిర్మాణం కోసం ముంబయిలోని ఆరె కాలనీలో చెట్ల నరికివేత వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది. ఇందు కోసం జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. అక్టోబరు 21 వరకు ఆరెలో చెట్లను నరికివేయద్దంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

* దాదాపు 17 నెలలుగా అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల అధీనంలో ఉన్న ముగ్గురు భారతీయ ఇంజినీర్ల విడుదలకు మార్గం సుగమం అయినట్లు సమాచారం. ఈ మేరకు ఆదివారం తాలిబన్లు, అమెరికా బలగాల మధ్య జరిగిన చర్చల్లో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి కోసం అమెరికా 11 మంది తాలిబన్లను విడుదల చేసేందుకు అంగీకరించినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. వీరిలో తాలిబన్‌కు చెందిన ప్రముఖ నేతలు ఉన్నట్లు సమాచారం.

* ఉగ్రవాదం అంశంలో పాకిస్థాన్‌ వైఖరిని మరోసారి ఎఫ్‌ఏటీఎఫ్‌(ఆర్థిక చర్యల కార్యదళం) ఏపీజీ తప్పుబట్టింది. హఫీజ్ సయీద్‌పై పాక్‌ కంటితుడుపు చర్యలు తీసుకొందని ఆ సంస్థ మండి పడింది. ‘లష్కరే తోయిబా, ఫలాయీ ఇన్సానియత్‌, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలపై పాకిస్థాన్‌ సరైన చర్యలు తీసుకోవడం లేదు’ అని తెలిపింది. ఈ మేరకు ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించింది.