Sports

మొత్తం గోల్స్ 700

Ronaldo Scores His 700th Goal Against Ukraine

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో కెరీర్‌లో అరుదైన మైలురాయి అందుకున్నాడు. యూరో 2020 అర్హత పోటీల్లో భాగంగా సోమవారం ఉక్రెయిన్‌తో తలపడిన మ్యాచ్‌లో రొనాల్డో 700వ గోల్‌ కొట్టాడు. మొత్తం 973 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. అతడికన్నాముందు చెక్‌ ఆస్ట్రియన్‌ ఆటగాడు జోసెఫ్‌ బికన్‌ 805 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా తర్వాత రొమారియో 772 (బ్రెజిల్‌), పీలే 767, ఫెరెన్‌ పుస్కాస్‌ 746 (హంగేరి), గెర్డ్‌ ముల్లర్‌ 735 (జెర్మనీ) వరుసగా ఉన్నారు. మరోవైపు అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ ప్రస్తుతం 672 గోల్స్‌తో కొనసాగుతుండగా.. రొనాల్డోని అధిగమించే అవకాశం ఇతడికి మాత్రమే ఉంది. కాగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్‌ జట్టు 1-2 తేడాతో ఓటమిచెందడంతో యూరో 2020 గ్రూప్‌ బీలో ఉక్రెయిన్‌ 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పోర్చుగల్‌ 11 పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది.