DailyDose

బంపర్ వేగంతో పరుగెత్తుతున్న భారత స్టాక్‌మార్కెట్లు-వాణిజ్యం-11/26

Indian Stock Markets See Profits-Telugu Business News-11/26

* దేశీయ మార్కెట్ల లాభాల జోరు కొనసాగుతోంది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలు, ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన నేపథ్యంలో సోమవారం కొత్త గరిష్ఠాలను తాకిన సూచీలు.. మంగళవారం ఆ రికార్డులను చెరిపి సరికొత్త శిఖరాలకు దూసుకెళ్తున్నాయి. నేటి ట్రేడింగ్‌ ఆరంభంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ 200 పాయింట్లు ఎగబాకి ప్రతిష్ఠాత్మక 41వేల మార్క్‌ను దాటింది. అటు జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 12,100 పైన ట్రేడ్‌ అవుతోంది. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 175 పాయింట్ల లాభంతో 41,064 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 12,116 వద్ద సరికొత్త జీవన కాల గరిష్ఠ స్థాయిల్లో కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.67గా ట్రేడ్‌ అవుతోంది. యెస్‌ బ్యాంక్‌, టాటాస్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. బజాజ్‌ ఆటో, భారతీ ఎయిర్‌టెల్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తదితర షేర్లు స్వల్ప నష్టాల్లో సాగుతున్నాయి. 

* స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా పుణె సమీపంలోని తన ఛకన్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిని దాదాపు నెలరోజులపాటు నిలిపివేయనుంది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు దీనిని మూసివేయనున్నట్లు సమాచారం. ఎగుమతులు తగ్గడం, దేశీయ డిమాండ్‌ ఆశించిన మేరకు లేకపోవడం, ఆమియో సబ్‌కాంపాక్ట్‌ సెడాన్‌ను, డీజిల్‌ ఇంజిన్ల తయారీని నిలిపివేయడం వంటివిగా భావిస్తున్నారు. కానీ, వీటిని ఫోక్స్‌వ్యాగన్‌ తోసిపుచ్చింది. వార్షిక నిర్వహణలో భాగంగానే ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని , దీంతోపాటు ఇండియా 2.0 ప్రాజెక్టుకు ఏర్పాట్లు చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.

* దేశీయంగా మొబైల్‌ తయారీ రంగంలో మరో ముందడుగు పడింది. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్‌ తన ఐఫోన్‌ Xఋ మోడల్‌ తయారీని భారత్‌లో ప్రారంభించిందని, కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. దేశీయ అమ్మకాలతో పాటు ఎగుమతులు కూడా ఇక్కడి నుంచే జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే యాపిల్‌కు ఛార్జర్లు సరఫరా చేసే సాల్‌కాంప్‌ కంపెనీతో ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. చెన్నైకి సమీపంలోని సెజ్‌లో మూతపడిన నోకియా ప్లాంట్‌ను ఆ కంపెనీకి కేటాయించినట్లు చెప్పారు. 2020 మార్చి నుంచి అక్కడ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇందుకోసం రానున్న ఐదేళ్లలో రూ.2వేల కోట్లు ఆ కంపెనీ పెట్టుబడి పెట్టనుందని వివరించారు.

* ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ)కు చెందిన ఎంట్రీ లెవెల్‌ చిన్న కారు ఆల్టో విక్రయాలు 38 లక్షలు దాటాయని సంస్థ ప్రకటించింది. 2000 సంవత్సరంలో మార్కెట్లోకి విడుదలైన ఈ మోడల్ చిన్న కారు 2008లో 10 లక్షల మార్క్‌ దాటింది. అనంతరం 2012లో 20 లక్షల మార్క్‌, 2016లో 30 లక్షల మార్క్‌ దాటిందని సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్ల జాబితాలో గత 15 ఏళ్లుగా మారుతీ ఆల్టో మొదటి స్థానంలో ఉందని ఎంఎస్‌ఐ తెలిపింది.

* తమిళనాడులోని చెన్నై సమీపంలోని నోకియా టెలికామ్‌ ప్రత్యేక ఆర్థిక మండలిలోని చాలా సంస్థలు వచ్చే ఏడాది నాటికి కార్యకలాపాలు పునఃప్రారంభిచనున్నాయి. దీనిపై తమిళనాడుకు చెందిన ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ఇక్కడి భూమికి, ఇప్పటికే తయారీకి సిద్ధంగా ఉన్న ఏర్పాట్లకు.. ఎలక్ట్రానిక్‌పరికరాల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఉంది. ‘‘నోకియా ఫ్యాక్టరీపై తొలుత ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ కంపెనీ ఆసక్తి చూపింది. కానీ సాల్‌క్యాంప్‌ దీనిని దక్కించుకొంది’’ అని ఆ అధికారి పేర్కొన్నారు.

* ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ సుభాష్‌చంద్ర ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. వాటాదారుల మార్పు దృష్ట్యా ఆయన తన పదవికి రాజీనామా చేయగా.. వెంటనే కంపెనీ బోర్డు రాజీనామాకు ఆమోదం తెలిపింది. చైర్మన్‌గా వైదొలిగినప్పటికీ ఆయన సంస్థ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మాత్రం కొనసాగనున్నారు. సెబీ 17(ఐబీ) నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ స్టాక్‌ మార్కెట్‌ ఫైలింగ్‌లో పేర్కొంది. ఫైనాన్షియల్‌ పెట్టుబడిదారుల బకాయిలను తీర్చేందుకు జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో 16.5శాతం వాటాను విక్రయిస్తున్నట్లు సుభాష్‌చంద్రకు చెందిన ఎస్సెల్ గ్రూప్‌ నవంబర్‌ 20న వెల్లడించింది. సెప్టెంబర్‌లో కూడా ఈ సంస్థ జీ లిమిటెడ్‌కు చెందిన 11 శాతం వాటాను ఇన్వెస్కో-ఓపెన్‌హైమర్‌ సంస్థకు విక్రయించింది.