NRI-NRT

హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ఆటా అవార్డులు

హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ఆటా అవార్డులు- ATA 2019 Vedukalu Awards At Ravindra Bharati Hyderabad-Dattatreya Krishnamraju

అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆటా అవార్డుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చలనచిత్ర నటుడు కృష్ణంరాజుకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. మాజీ కేంద్ర మంత్రి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కృష్ణంరాజుతో పాటు వివిధ రంగాల్లో మరికొందరు ప్రముఖులకు అవార్డులను అందజేశారు. ఆటా అధ్యక్షుడు పరమేశ్ భీంరెడ్డి, తదుపరి అధ్యక్షుడు భువనేశ్ బుజాల ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానం జరిగింది. తెలంగాణా రోడ్లు, భవనాల శాఖా మంత్రి ప్రతాప్‌రెడ్డి, తితిదే పాలకమండలి అధ్యక్షుడు వై.వీ.సుబ్బారెడ్డి, ఏపీ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్‌రెడ్డి, రసమయి బాలకిషన్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ గాయకుడు రామాచారి, ఆయన కుమారుడు సాకేత్ తదితరులు నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది.

*** తెలుగు భాషను విస్మరించవద్దు – దత్తాత్రేయ
తెలుగు భాష తల్లి వంటిదని మాతృభూమిని వదిలి ఇతర దేశాలకు వెళ్లినప్పటికీ మన భాషను మరువకూడదని గవర్నర్ దత్తాత్రేయ కోరారు. ఆటా చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు.

*** చాలా సంతోషంగా ఉంది – కృష్ణంరాజు
ఆటా ఆధ్వర్యంలో తనకు జీవన సాఫల్య పురస్కారం అందజేయడం చాలా సంతోషంగా ఉందని, విదేశాల్లో తెలుగు భాష అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా ప్రసంగించిన కృష్ణంరాజు పేర్కొన్నారు. తానా ప్రారంభించిన తొలినాళ్లల్లో తనసొంతు ఖర్చులతో 11మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను తాను అమెరికాకు పంపించానని కృష్ణంరాజు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. — రవీంద్ర భారతి నుండి TNI డైరక్టర్ కిలారు ముద్దుకృష్ణ.