Fashion

కొప్పులో బంగారం

Telugu Fashion News Tips & Tricks-Koppu And Golden Jewelry

ఎంబ్రాయిడరీల తళుకులూ నగల మెరుపులతో సోకులద్దుకున్న బ్లౌజూ దాని వెనకున్న వీపు సౌందర్యం కనిపించాలంటే జడ వేయడం, జుట్టు విరబోయడంకన్నా సిగ చుట్టడమే బెటర్‌ అంటున్నారు హెయిర్‌స్టైలిస్టులు. అందుకే ఈ ఏడాది జరిగిన వివాహ వేడుకల్లో అతివలంతా ముడులతోనే అదీ రంగురంగుల పూలూ నగలతో మెరిసే కొప్పుల్నే నెత్తిన పెట్టుకుని మరీ సందడి చేశారు.

అదో పెళ్లి వేడుక… అక్కడికి వచ్చిన ఆడవాళ్లంతా చీరల్లో గాగ్రాల్లో గౌనుల్లో అందంగా మెరిసిపోతున్నారు. అయితే అందరి దృష్టీ ముద్దొచ్చే వాళ్ల ముఖాలమీదకన్నా వెనకున్న సిగల చుట్టూనే తిరుగుతోంది. వీపు అందాన్ని పెంచేలా రూపుదిద్దిన రవికా, ఆ రవిక సోకుతో పోటీపడుతూ అలంకరించిన సిగ… చూస్తే ఓ పట్టాన కళ్ళు తిప్పుకోలేరెవరూ. నల్లని కురులను అందంగా మడిచివేసిన ముడినీ దానికి చుట్టిన పూలనీ నగల్నీ చూస్తూ కొప్పును కూడా ఇంత అందంగా అలంకరించవచ్చా అని సామాన్యులు అబ్బురపడితే ‘రాగాల సిగలోన సిరిమల్లివి’… అంటూ కవితలు అల్లేస్తారు కవులు.

ఒకప్పుడు ముడి అనేది వయసు పైబడినవాళ్లే వేసుకునేవారు. ప్రాయంలోని పడుచులు- పెళ్లికొచ్చినా పెళ్లిపీటలెక్కినా- పూలజడల్లోనే కనిపించేవారు. కానీ ఉత్తరాది పెళ్లిళ్లలో మాత్రం పూలజడలతో పోలిస్తే ఎప్పుడూ ముడులే ఎక్కువ. ఇప్పుడు కూడా మన దగ్గర పెళ్లి కూతురుకి పూలజడే వేస్తున్నా పెళ్లిలో సందడి చేసే బంధువులూ కుటుంబ సభ్యులూ మాత్రం ముడులకే మా ఓటంటున్నారు. ఇక రిసెప్షన్‌ వేడుకకైతే పెళ్లికూతుళ్లూ ముడులే చుడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఎంబ్రాయిడరీ బ్లౌజులేనట. జడ వేస్తే బ్లౌజులకి ఉన్న రాళ్లూ పూసలకి జుట్టు పట్టేస్తుంటుంది. అదే ముడితో అయితే ఆ బాధ ఉండదు.

పైగా ఆ డిజైన్లూ అందంగా కనిపిస్తాయన్న కారణంతో అమ్మాయిలూ అమ్మలూ అందరూ వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు ముడి వేయడానికే ఇష్టపడుతున్నారు. ఇక, సెలెబ్రిటీలయితే చెప్పనే అక్కర్లేదు. చీర కట్టినా లెహంగా వేసినా లాంగ్‌ గౌను వేసినా సినీ పండుగలూ సంప్రదాయ వేడుకల్లో సిగలతోనే తళుక్కుమంటున్నారు.

ఈ సిగల్లోనూ ఎన్నో రకాలు… నడినెత్తి మీద నుంచి మెడమీదకీ లేదంటే చెవి వెనకకో అందాల కొప్పులు వేస్తున్నారు. అది కూడా చుట్టలానో వేలిముడో లేదా తూర్పు కొప్పు చుట్టినట్లో కాకుండా స్వెప్ట్‌ బ్యాక్‌, పఫ్‌డ్‌ అప్‌, కాస్‌కేడ్‌, రింగ్‌లెట్‌, చింగ్‌నన్‌, బెల్లారినా, మెస్సీరింగ్‌, క్రిస్‌క్రాస్‌, డోనట్‌… ఇలా భిన్న స్టైల్స్‌లో ముడులను తెల్ల దొరసానుల నుంచి దిగుమతి చేసుకుని మరీ వేస్తున్నారు. పైగా సిగ వేసేటప్పుడు కూడా ఒకే పద్ధతిలో కాకుండా ముందు జుట్టును రకరకాలుగా అల్లడం, మడవడం చేస్తూ శిరోజాలంకరణలో వందల డిజైన్లు సృష్టిస్తున్నారు. అయితే ఇవన్నీ వేయాలంటే ఒకప్పుడు స్టైలిస్ట్‌ల సహాయం తప్పనిసరి. కానీ ఇప్పుడు యూట్యూబ్‌తో సొంతంగానే ప్రయత్నిస్తున్నారు. పైగా వెనకటిలా జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులయినా పెడుతుంది అనకుండా జుట్టున్నా లేకున్నా ఎన్ని కొప్పులయినా పెట్టొచ్చు అనేస్తున్నారు.

ఈతరం అమ్మాయిలు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో రెడీమేడ్‌ ముడులు బోలెడు స్టైల్స్‌లో దొరుకుతున్నాయి. దాంతో ఈ శ్రమ అంతా ఎందుకులే అనుకునేవాళ్లు వాటినే తెచ్చి జుట్టును అందులోకి మడిచేసి దాన్ని ముడి పిన్నుల సాయంతో పెట్టేసుకుంటున్నారు. అలా జుట్టున్నా లేకున్నా చిన్నా పెద్దా అంతా రెడీమేడ్‌ ముడులతో చిటికెలో ముస్తాబైపోతున్నారు.

ముడి పెట్టడంలోనే కాదు, ఆ తరవాతే ఉంది అసలు అలంకరణంతా. ఒకప్పటి నాగరమూ సూర్యచంద్రులూ కాగితీలూ రాగిడికొమ్మలూ తిరుగుడు పువ్వులూ చామంతిపువ్వులూ… వంటి కేశాభరణాల మాదిరిగానే ఇప్పుడు ముడులకోసం మరిన్ని ప్రత్యేకమైన నగలు వస్తున్నాయి. గుండ్రంగానూ, అర్ధచంద్రాకారంలోనూ ఉండే నాటి రాళ్ల పిన్నులకే ఇప్పుడు రైన్‌స్టోన్స్‌, క్రిస్టల్స్‌, రత్నాలతో చేసిన బుట్టలూ ముత్యాల సరాల్నీ వేేలాడదీస్తూ మరింత అందంగానూ ఘనంగానూ కనిపించేలా తయారుచేస్తున్నారు. ఈ పిన్నులతోబాటు ముడి మొత్తాన్నీ చుట్టినట్లుగా ఉండే బంగారు నగల్నీ తొడిగి, ఆపై పూలచెండులతో అలంకరిస్తున్నారు. వీటితోపాటు చెవిలోలాకుల్నీ సిగలోని పిన్నుల్నీ కలిపినట్లుగా ఉండే జుడా పిన్నుల్లాంటివి కుందన్‌కారి, మీనాకారి వంటి సంప్రదాయ డిజైన్లలో అలరిస్తున్నాయి. చెంప సరాలను పోలినట్లుగా ఉండే ఈ రకమైన రాజస్థానీ ఆభరణాలు ముడులకు చక్కగా సరిపోతున్నాయి.

Image result for koppu

Related image

Related image

Related image